Nimmala Ramanaidu: జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం నిమ్మల
ABN , Publish Date - Jun 26 , 2025 | 05:46 AM
అవినీతి, అక్రమాలను వెలుగులోకి తీసుకురావడంలో జర్నలిస్టుల చేస్తున్న కృషి అభినందనీయమని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు.

అవినీతి, అక్రమాలను వెలుగులోకి తీసుకురావడంలో జర్నలిస్టుల చేస్తున్న కృషి అభినందనీయమని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ఒంగోలులో బుధవారం జరిగిన ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర మహాసభల్లో ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడుతూ... గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జర్నలిస్టులు తీవ్రంగా నష్టపోయారు. కూటమి ప్రభుత్వం జర్నలిస్టులకు అన్నివిధాలుగా అండగా ఉంటుంది. అక్రిడిటేషన్లతోపాటు గత ప్రభుత్వంలో రద్దుచేసిన అన్ని పథకాలను పునరుద్ధరించే విధంగా చర్యలు తీసుకుంటాం. ఇంటి స్థలాలతోపాటు ప్రభుత్వపరంగా అన్ని విధాలుగా సీఎం చంద్రబాబు అండగా ఉంటారు’ అని అన్నారు.
మరో మంత్రి గొట్టిపాటి రవికుమార్, మంత్రి బీవీ స్వామి, ఏపీయూడబ్లూజే యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఐవీ సుబ్బారావు, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్, బీఎన్ విజయ కుమార్, ముక్కు ఉగ్రనరసింహారెడ్డి, ముత్తుముల అశోక్‌రెడ్డి, తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఇక, పల్నాడు జిల్లా రెంటపాళ్లలో బెట్టింగుల కోసం అప్పులు చేసి, అవి తీర్చలేక ఆత్మహత్య చేసుకొని ఓ వ్యక్తి చనిపోతే... ఏడాది తర్వాత జగన్ పరామర్శ పేరుతో రాజకీయం చేస్తున్నారని ఒంగోలులోని టీడీపీ కార్యాలయంలో మాట్లాడుతూ మంత్రి నిమ్మల ధ్వజమెత్తారు. ‘జగన్ వల్ల రాష్ట్రంలో ప్రజలకు భద్రత లేదు. పరామర్శ పేరుతో బల నిరూపణ, దండయాత్రలు చేస్తున్నారు’ అని విమర్శించారు. జగన్ కారు కింద పడిన దళితుడైన శింగయ్య కొనఊపిరితో ఉన్నా పట్టించుకోకుండా రోడ్డు పక్కనే వదిలేయడం దుర్మార్గం అని నిమ్మల అన్నారు.