Share News

Govt Medical Colleges: ఆరు ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలకు కొత్త ప్రిన్సిపాల్స్‌ నియామకం

ABN , Publish Date - Apr 28 , 2025 | 03:40 AM

ఆంధ్రప్రదేశ్‌లో ఆరు ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలకు కొత్త ప్రిన్సిపాల్స్‌, మూడు బోధనాసుపత్రులకు సూపరింటెండెంట్లు నియమించారు. సీఎం చంద్రబాబు ఆమోదంతో నియామక ప్రక్రియ పూర్తి అయింది.

Govt Medical Colleges: ఆరు ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలకు కొత్త ప్రిన్సిపాల్స్‌ నియామకం

  • 3 బోధనాసుపత్రులకు సూపరింటెండెంట్లు కూడా..

అమరావతి, ఏప్రిల్‌ 27(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ఆరు ప్రభుత్వ వైద్య కళాశాలలకు కొత్త ప్రిన్సిపాల్స్‌, మూడు బోధనాసుపత్రులకు కొత్త సూపరింటెండెంట్లు నియమితులయ్యారు. నెల క్రితం డీపీసీ పూర్తిచేసినా ఆరోగ్యశాఖ ఆలస్యంగా పోస్టింగులు ఇచ్చింది. ఆంధ్రా, కాకినాడ మెడికల్‌ కాలేజీలకు గట్టి పోటీ ఉండడంతో అధికారులు పోస్టింగ్‌ విషయంలో ఆలస్యం చేశారు. చివరకు సీఎం చంద్రబాబు ఆమోదంతో లైన్‌క్లియర్‌ అయింది. ఆంధ్రా మెడికల్‌ కాలేజీ తాత్కాలిక ప్రిన్సిపాల్‌గా ఉన్న డా.కె.వి.ఎ్‌స.ఎం.సంధ్యాదేవికి అడిషనల్‌ డైరెక్టర్‌ పదోన్నతి కల్పించి అదే కాలేజీ రెగ్యులర్‌ ప్రిన్సిపాల్‌గా ప్రభుత్వం నియమించింది. కాకినాడ కాలేజీ వైస్‌ ప్రిన్సిపల్‌ డా.ఎ.విష్ణువర్థన్‌ పదోన్నతిపై ఆ కాలేజీకే ప్రిన్సిపాల్‌గా నియమితులయ్యారు. కాకినాడ ప్రిన్సిపాల్‌గా ఉన్న డీఎంఈ డా.నర్సింహంను ప్రభుత్వం రిలీవ్‌ చేసింది. ఆయన డీఎంఈగా కొనసాగనున్నారు. రాజమండ్రి మెడికల్‌ కాలేజీ బయోకెమిస్ట్రీ ప్రొఫెసర్‌ డా.జి.రాజేశ్వరికి అడిషనల్‌ డైరెక్టర్‌గా పదోన్నతి కల్పించి నెల్లూరు కాలేజీ ప్రిన్సిపాల్‌గా నియమించారు. కడప మెడికల్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ డా.ఎ.సురేఖను నంద్యాల మెడికల్‌ కాలేజీకి, ఒంగోలు బోధనాసుపత్రి సూపరింటెండెంట్‌ టి.జమునను కడప మెడికల్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌గా బదిలీ చేశారు.


తిరుపతి రుయా బోధనాసుపత్రి సూపరింటెండెంట్‌ డా.జి.రవి ప్రభుకు తిరుపతి మెడికల్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌గా బాధ్యతలు అప్పగించారు. విజయవాడ బోధనాసుపత్రి తాత్కాలిక సూపరింటెండెంట్‌ ఏవీ రావుకు పదోన్నతి కల్పించి అక్కడే రెగ్యులర్‌ సూపరింటెండెంట్‌గా, ఎస్‌వీ మెడికల్‌ కాలేజీ ప్రొఫెసర్‌ డాక్టర్‌ కె.రాధను పదోన్నతిపై ఎస్‌వీ బోధనాసుపత్రికి సూపరింటెండెంట్‌గా, విశాఖ మెడికల్‌ కాలేజీ ప్రొఫెసర్‌ డాక్టర్‌ వి.మన్మథరావుకు పదోన్నతి కల్పించి కేజీహెచ్‌ సూపరింటెండెంట్‌గా నియమించారు.

Updated Date - Apr 28 , 2025 | 03:41 AM