Nellore Police: ఇన్‌స్టా లింకు రూ.2.46 కోట్లకు బురిడీ
ABN , Publish Date - Apr 27 , 2025 | 02:40 AM
ఇన్‌స్టాగ్రామ్ లింక్‌పై నమ్మి రూ.2.46 కోట్లు కోల్పోయిన మహిళ కేసులో ఏడుగురు సైబర్ నేరగాళ్లను నెల్లూరు పోలీసులు అరెస్టు చేశారు.తక్కువ పెట్టుబడి పెట్టి ఎక్కువ లాభం పొందాలని మోసగాళ్లు నమ్మించి మోసం చేశారు.

సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడిన మహిళ
‘తక్కువ పెట్టుబడి.. ఎక్కువ ఆదాయం’ పేరిట వల
నెల్లూరులో ఏడుగురు సభ్యుల ముఠా అరెస్టు
నెల్లూరు (క్రైం), ఏప్రిల్ 26 (ఆంధ్రజ్యోతి): ‘తక్కువ నగదు పెట్టుబడిగా పెట్టండి. ఎక్కువ ఆదాయం పొందండి’ అంటూ ఫోన్లలో మాటలు కలిపి నమ్మించి రూ.కోట్లు దోచేస్తున్న ఓ అంతర్రాష్ట్ర సైబర్ నేరగాళ్ల ముఠాను నెల్లూరు పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. వివరాలను శనివారం నెల్లూరు ఎస్పీ కృష్ణకాంత్ విలేకరులకు వెల్లడించారు. నగరంలోని పొగతోటకు చెందిన లలితకు ఇన్‌స్ట్రాగ్రామ్‌లో ఆన్‌లైన్ మార్కెటింగ్‌కు సంబంధించిన లింక్ రావడంతో క్లిక్ చేశారు. వెంటనే నిషాబసు అనే మహిళ ఆన్‌లైన్ మార్కెటింగ్‌కు సంబంధించిన సూచనలు, సలహాలు ఇచ్చి లాభాలు వచ్చేలా చేస్తామని నమ్మించి, ఓ యాప్‌ను ఇన్‌స్టాల్ చేయించింది. పెద్ద మొత్తంలో పెట్టుబడి పెడితే రెట్టింపు వస్తుందని చెప్పడంతో లలిత అప్పుచేసి ఈ ఏడాది జనవరి 23 నుంచి ఫిబ్రవరి 3 వరకు పలు దఫాలుగా రూ. 2,46,30,396 డిపాజిట్ చేశారు. ఆ తర్వాత లలిత ఖాతాలో రూ.4,02,24,759 నగదు ఉన్నట్లు సైబర్ నేరగాళ్లు చూపించారు.
ఆ నగదు డ్రా చేసుకొనేందుకు ఆమె ప్రయత్నించగా నగదు రాకపోవడంతో బాధితురాలు ఈ గత నెల 9న చిన్నబజారు పోలీసులకు ఫిర్యాదుచేశారు. ఇన్‌స్పెక్టర్ చిట్టెం కోటేశ్వరరావు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి సాంకేతికత ఆధారంగా చెన్నై, హైదరాబాద్, రాజస్థాన్ ప్రాంతాల్లో దర్యాప్తును ముమ్మరం చేశారు. రాజస్థాన్‌కు చెందిన రామారామ్, అతని అనుచరులైన గోగారామ్, హేమత్‌కుమార్, కైలాష్, నాగారాం, తెలంగాణాలోని హైదరాబాద్‌కు చెందిన వీరేశ్వరరావు, ఎం.రవిని నిందితులుగా గుర్తించారు. ఈ నెల 25న రాజస్థాన్‌కు చెందిన ఐదుగురు నిందితులను, శనివారం ఇద్దరిని అరెస్ట్ చేశారు.