Nara Lokesh : నెలకు 4 వేల కోట్లు లోటు
ABN , Publish Date - Jan 07 , 2025 | 04:55 AM
‘రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. ప్రతి నెలా రూ.4,000 కోట్లు లోటు బడ్జెట్‌తో ప్రభుత్వం నడుస్తోంది. అయినా అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నాం.

ఆర్థిక ఇబ్బందుల్లో రాష్ట్రం
అధిగమించేందుకు ప్రయత్నాలు
దేశానికే రతన్ టాటా ఒక బ్రాండ్: లోకేశ్
భీమవరం, జనవరి 6(ఆంధ్రజ్యోతి): ‘రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. ప్రతి నెలా రూ.4,000 కోట్లు లోటు బడ్జెట్‌తో ప్రభుత్వం నడుస్తోంది. అయినా అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నాం. లోటును తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నాం’ అంటూ రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి, భీమవరం నియోజకవర్గాల్లో సోమవారం ఆయన పర్యటించారు. దాతల సహకారంతో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఉండిలో పునరుద్ధరించిన జిల్లా పరిషత్ ప్రభుత్వం పాఠశాలను లోకేశ్ ప్రారంభించారు. పెద అమిరంలో పద్మవిభూషణ్ రతన్‌టాటా కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘భారతదేశ చరిత్రలో విలువలతో కూడిన వ్యాపారాన్ని నిర్వహించిన పారిశ్రామికవేత్త రతన్‌టాటా. ఆయన ఒక బ్రాండ్. నష్టాల్లో వున్న కంపెనీలను తీసుకుని లాభాలబాట పట్టించారు. భారత్ దేశం బ్రాండ్ తగ్గిపోతుందని తాజ్ హోటళ్లను ఇతర దేశాలకు విస్తరించలేదు. పరిశ్రమలతోపాటు, వ్యాపార రంగంలోకి అడుగుపెట్టి భారతీయ యువతకు రోల్ మోడల్‌గా నిలిచారు. మా అమ్మమ్మ క్యాన్సర్‌తో చనిపోయారు. ఆ వ్యాధితో ఎవరూ చనిపోకూడదనే ఉద్దేశంతో తాతయ్య ఎన్టీఆర్ హైదరాబాద్‌లో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిని ఏర్పాటు చేశారు. అప్పట్లో మొదట రతన్ టాటా విరాళంగా రూ.25 కోట్లు ఇచ్చారు. హుద్‌హుద్ తుఫాను సమయంలో సహకరించాలని కోరితే రూ.3 కోట్లు సాయమందించారు. విశాఖలో టీసీఎ్‌సను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో దాదాపు 10 వేల మందికి ఉద్యోగాలు కల్పించేలా అభివృద్ధి చేస్తున్నారు’ అని తెలిపారు.
మిత్రులను సంపాదించండి
ఉండి జడ్పీ హైస్కూల్, భీమవరం ఎస్‌ఆర్‌కేఆర్ కళాశాలల్లో విద్యార్థులతో మాట్లాడుతూ... ‘విద్యార్థులు చదువుకోవడంతోపాటు కళాశాలల్లో మిత్రులను సంపాదించాలి. చంద్రబాబు అరెస్టు సమయంలో కళాశాల మిత్రులు నాకు ఎంతగానో అండగా నిలిచారు’ అని అన్నారు. ‘విద్యాలయాల్లో రాజకీయాలు ఉండకూడదు. అందుకే ఫ్లెక్సీల్లో రాజకీయ నాయకుల ఫొటోలు లేవు. పేర్లు లేవు. ఆ పిచ్చి మాకు లేదు. విద్యా సంస్థల్లో రాజకీయాల జోలికి పోము. అందుకే విద్యా శాఖను రాజకీయాలతో సంబంధం లేకుండా నడిపిస్తున్నాం. విద్యార్థుల అన్ని సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నాం’ అని లోకేశ్ చెప్పారు. ఈ సందర్భంగా జడ్పీ హైస్కూల్ విద్యార్థినులు... ‘ప్లస్-2ని ఇంటర్‌లో విలీనం చేస్తున్నట్టు ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్త నిజమేనా? మాకు పాఠశాలల్లో ఇంటర్ ఉండదా?‘ అని మంత్రి లోకేశ్‌ను అడిగారు. ‘ఆంధ్రజ్యోతి వాస్తవాన్నే రాసింది. అందులో తప్పులేదు. ప్లస్-2ని ఇంటర్ విద్యలో కలిపి అభివృద్ధి చేస్తాం. విద్యార్థుల ఇబ్బందులను తొలగిస్తాం’ అని లోకేశ్ భరోసా ఇచ్చారు.
ఆ పదవి నుంచి తప్పుకొంటున్నా
‘తెలుగుదేశం పార్టీలో సామాన్యులకు పెద్దపీట వేస్తాం. రాష్ట్ర, జాతీయ స్థాయి రాజకీయాల్లో అందరూ ఎదగాలి. పార్టీ అటువంటి అవకాశాలను కల్పిస్తుంది. జాతీయ ప్రధాన కార్యదర్శి హోదా నుంచి తప్పుకోవాలనుకుంటున్నా. ఇప్పటికే మూడుసార్లు ఆ పదవిలో కొనసాగా. మున్ముందు ఇతరులకు అవకాశం ఇవ్వాలని భావిస్తున్నాం. పార్టీ పదవుల్లో సామాన్యులకు అవకాశం కల్పిస్తాం’ అంటూ లోకేశ్ కార్యకర్తలకు భరోసా కల్పించారు. రఘురామరాజు నివాసంలో ఉత్తమ కార్యకర్తలతో సమావేశమైన ఆయన... ప్రతి ఒక్కరూ పార్టీలో అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని సూచించారు. ‘రాష్ట్రంలో కూటమిని విడదీసే పనిలో సైకో జగన్ ఉన్నాడు. కూటమిలో మిస్ ఫైర్, క్రాస్ ఫైర్, విడాకులు ఉండవు. సైకో కుయుక్తులు సాగవు’ అని లోకేశ్ అన్నారు. భీమవరంలో కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మను పరామర్శించిన అనంతరం కూటమి నాయకులతో మంత్రి లోకేశ్ సమావేశమయ్యారు. ‘సమన్వయంతో కూటమి ముందుకు వెళ్లాలి. లేదంటే సైకో పాలన మళ్లీ వచ్చేస్తుంది. సైకో మళ్లీ వస్తే రాష్ట్రం సర్వ నాశనమైపోతుంది’ అని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు.