Kurnool: టిప్పర్‌తో ఢీకొట్టి కొడవళ్లతో నరికి
ABN , Publish Date - Apr 28 , 2025 | 04:19 AM
ఎమ్మార్పీఎస్ రాయలసీమ అధ్యక్షుడు లక్ష్మీనారాయణను టిప్పర్ ఢీకొట్టి, కొడవళ్లతో నరికివేత దారుణ హత్య జరిగింది. ఈ ఘటనలో ఆయన కుమారుడు, బంధువుకు గాయాలయ్యాయి.

ఎమ్మార్పీఎస్ సీమ అధ్యక్షుడి దారుణ హత్య
గుంతకల్లు నుంచి చిప్పగిరికి కారులో వెళ్తుండగా లక్ష్మీనారాయణపై దాడి
కుమారుడు, బంధువుకూ గాయాలు.. గుంతకల్లు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స
టీడీపీ నేత శ్రీరాములు దంపతుల హత్య కేసులో లక్ష్మీనారాయణ నిందితుడు
ప్రస్తుతం ఆయన కాంగ్రెస్ ఆలూరు ఇన్‌చార్జి కూడా..
గుంతకల్లు/కర్నూలు, ఏప్రిల్ 27 (ఆంధ్రజ్యోతి): ఎమ్మార్పీఎస్ రాయలసీమ అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గ ఇన్‌చార్జి చిప్పగిరి లక్ష్మీనారాయణ (60) ఆదివారం దారుణ హత్యకు గురయ్యారు. అనంతపురం జిల్లా గుంతకల్లు శివారులో దుండగులు టిప్పర్‌తో ఢీకొట్టి, వేట కొడవళ్లతో నరికి చంపారు. కర్నూలు జిల్లా చిప్పగిరికి చెందిన ఆయన.. ఆదివారం ఉదయం తన కుమారుడు వినోద్‌కుమార్, సమీప బంధువు గోవిందుతో కలిసి గుంతకల్లుకు వచ్చారు. అనంతరం వారు మధ్యాహ్నం ఇన్నోవా వాహనంలో చిప్పగిరికి బయల్దేరారు. గుంతకల్లు-ఆలూరు రహదారిలో పట్టణ శివారులోని రైలు వంతెన సమీపాన స్పీడ్ బ్రేకర్ వద్ద ఇన్నోవాను ఆగంతకులు టిప్పర్‌తో ఎదురుగా వచ్చి ఢీకొట్టారు.
ఆ వెంటనే లక్ష్మీనారాయణను బయటకు లాగి, వేటకొడవళ్లతో ఆయన తల, వీపు మీద నరికారు. తర్వాత కారులో పరారయ్యారు. లక్ష్మీనారాయణ వాహనం ముందుభాగం నుజ్జునుజ్జయింది. స్థానికులు వెంటనే ఆయన్ను, వినోద్‌కుమార్, గోవిందును గుంతకల్లు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి లక్ష్మీనారాయణ అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించారు. గాయపడిన వినోద్‌కుమార్, గోవిందు మాట్లాడుతూ.. తమ వాహనాన్ని టిప్పర్‌తో ఢీకొట్టి దాదాపు 8 మంది కొడవళ్లతో లక్ష్మీనారాయణను విచక్షణరహితంగా నరికారని తెలిపారు. డీఎస్పీ శ్రీనివాస్, సీఐలు మనోహర్, మస్తాన్ హత్యాస్థలాన్ని పరిశీలించారు. లక్ష్మీనారాయణ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు గుంతకల్లు వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కాగా.. లక్ష్మీనారాయణకు భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. ఆయన 2006లో టీడీపీ నాయకుడు, కర్నూలు జిల్లా సహకార బ్యాంకు మాజీ చైర్మన్ వైకుంఠం శ్రీరాములు, ఆయన భార్య శకుంతల హత్య కేసులో నిందితుడి(ఏ-7)గా ఉన్నారు. ఈ కేసును న్యాయస్థానం కొట్టివేసింది.
ఈ వార్తలు కూడా చదవండి..
Visakhapatnam: యాప్‌లతో ఆర్థిక నేరాలకు పాల్పడుతోన్న ముఠా గుట్టు రట్టు
AP Police: పోలీసులను చూసి.. ఆ దొంగ ఏం చేశాడంటే..
Rains: ఏపీలో భారీ వర్షాలు.. నీట మునిగిన వరి ధాన్యం
Simhachalam: స్వామి చందనోత్సవం.. సమీక్షించిన హోం మంత్రి
TDP Supporter: రెచ్చిపోయిన వైసీపీ నేతలు.. టీడీపీ కార్యకర్తకు కత్తిపోట్లు
For AndhraPradesh News And Telugu News