Share News

Special Investigation Team: మిథున్‌ రెడ్డికి సిట్ పిలుపు

ABN , Publish Date - Apr 17 , 2025 | 03:14 AM

మద్యం స్కాంలో సిట్‌ దర్యాప్తు వేగంగా సాగుతోంది.మిథున్‌ రెడ్డి, రాజ్‌ కసిరెడ్డిలను విచారణకు పిలుస్తూ నోటీసులు జారీచేసింది.

Special Investigation Team: మిథున్‌ రెడ్డికి సిట్ పిలుపు

  • రేపు విచారణకు రావాలని నోటీసు

  • మద్యం స్కామ్‌లో సిట్‌ స్పీడు

  • నేడు విచారణకు రానున్న సాయిరెడ్డి

  • రేపు రావాలని రాజ్‌ కసిరెడ్డి తండ్రికి నోటీసు

  • ఎల్లుండి హాజరు కావాలని రాజ్‌కు మరో తాఖీదు

  • రాజ్‌ ఫోన్లు స్విచ్ఛాఫ్‌.. మూడుసార్లు డుమ్మా

అమరావతి/విజయవాడ, ఏప్రిల్‌ 16 (ఆంధ్రజ్యోతి): మద్యం కుంభకోణం దర్యాప్తులో ‘సిట్‌’ స్పీడు పెంచింది. కీలక సూత్రధారులు, పాత్రధారుల వరుస విచారణకు రంగం సిద్ధం చేసింది. ఇందులో భాగంగా... వైసీపీ ఎంపీ మిథున్‌ రెడ్డికి నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది. శుక్రవారం విజయవాడలోని ‘సిట్‌’ కార్యాలయంలో విచారణకు హాజరు కావాల్సిందిగా ఆయనను ఆదేశించినట్లు సమాచారం. ఇదే సమయంలో... జగన్‌ హయాంలో కమీషన్లు సమర్పించుకున్న మద్యం ఉత్పత్తిదారులు, వ్యాపారులను కూడా విచారణకు పిలిచినట్లు తెలుస్తోంది. వీరిని మిథున్‌ రెడ్డితో కలిపి ప్రశ్నించి... కీలక వివరాలు రాబట్టాలని భావిస్తున్నట్లు సమాచారం. అయితే... ఆయన విచారణకు హాజరవుతారా, లేదా అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. ఆయనకు అరెస్టు నుంచి సుప్రీంకోర్టు రక్షణ కల్పించినప్పటికీ... విచారణకు సహకరించాలని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు అజ్ఞాతంలోకి వెళ్లిపోయి. పదేపదే విచారణకు డుమ్మా కొడుతున్న మద్యం స్కామ్‌ సూత్రధారి రాజ్‌ కసిరెడ్డికి ‘సిట్‌’ మరో నోటీసు జారీ చేసింది. ఒకవైపు ఆయనకోసం విస్తృతంగా గాలిస్తూనే... తాజాగా ఈ నెల 19న విచారణకు రావాలంటూ నోటీసు జారీ చేసింది. ఇప్పటికే మూడుసార్లు సిట్‌ విచారణకు డుమ్మా కొట్టిన రాజ్‌ కసిరెడ్డి ఇళ్లు, కార్యాలయం, బంధువుల ఇళ్లు, భార్య పేరుతో పెట్టుబడులు పెట్టిన ఆసుపత్రిలో రెండు రోజులపాటు హైదరాబాద్‌లో సిట్‌ సిబ్బంది సోదాలు జరిపారు. ఆ సమయంలో హైదరాబాద్‌లోనే ఉన్న రాజ్‌ కసిరెడ్డి తండ్రి ఉపేందర్‌ రెడ్డిని కూడా ప్రశ్నించారు. రాజ్‌ కసిరెడ్డి ఆచూకీ గురించి ఆరా తీయగా... తనకు ఏమీ తెలీదని ఆయన సమాధానం ఇచ్చారు. దీంతో ఆయన్ను విచారించి వాంగ్మూలం నమోదు చేయాలని సిట్‌ నిర్ణయించుకుంది. అందులో భాగంగానే గురువారం విజయవాడలోని పోలీస్‌ కమిషనరేట్‌ ప్రాంగణంలో ఉన్న సిట్‌ కార్యాలయానికి రావాల్సిందిగా నోటీసు ఇచ్చారు.


పరారీలోనే...

రాజ్‌ కసిరెడ్డి కోసం ‘సిట్‌’ సిబ్బంది ఆయన బంధువులు, స్నేహితులు, ఆత్మీయుల ఇళ్లకు వెళ్లి ఆరా తీశారు. హైదరాబాద్‌లోని రాయదుర్గం, ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌లో ఉన్న నివాసాల్లో పలు డాక్యుమెంట్లు సీజ్‌ చేసి కీలక ఆధారాలు సేకరించారు. లిక్కర్‌ స్కామ్‌లో తాడేపల్లి పెద్దల తరఫున అన్నీ తానై వ్యవహరించిన రాజ్‌ కసిరెడ్డి... సిట్‌ విచారణను తప్పించుకునేందుకు రకరకాల విన్యాసాలు చేశారు. మూడుసార్లు నోటీసులు ఇచ్చినా స్పందించలేదు. ‘కారణం చెబితేనే వస్తా’ అంటూ మెలిక పెట్టి హైకోర్టును ఆశ్రయించారు. అయితే... ‘సిట్‌’కు చట్టబద్ధత ఉందని, విచారణకు సహకరించాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఆయనకు మరో నోటీసు ఇవ్వాలంటూ సిట్‌ అధికారులకు సూచించింది. దీంతో ఈనెల 9న విచారణకు రావాలని మరోసారి నోటీసు ఇచ్చారు. అయినా... రాజ్‌ పట్టించుకోలేదు. హైకోర్టు ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తూ విచారణకు డుమ్మా కొట్టారు. ఆయన ఫోన్లు స్విచ్చాఫ్‌ వస్తున్నాయు. దీంతో ఆయన ఉద్దేశ పూర్వకంగానే విచారణకు హాజరు కాకుండా పరారైనట్లు సిట్‌ అంచనాకు వచ్చింది.


సర్వం అతనే...

మద్యం స్కామ్‌తో ప్రభుత్వ ఖజానాకు 20వేల కోట్ల నష్టం వాటిల్లిందని... వైసీపీ పెద్దలు రూ.4వేల కోట్లు కమీషన్ల రూపంలో దోచుకున్నారని ప్రాథమికంగా తేలింది. ఈ స్కామ్‌ సర్వస్వం రాజ్‌ కసిరెడ్డి నడిపించినట్లు ‘సిట్‌’ నిర్ధారణకు వచ్చింది. మద్యం తయారీదారుల నుంచి ప్రతి నెలా 60కోట్ల రూపాయలకు తగ్గకుండా వసూలు చేసి...హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ప్రత్యేకంగా కార్యాలయం ఏర్పాటు చేసుకుని దందా నిర్వహించినట్లు ఆధారాలు లభించాయి. ఏ మద్యం కంపెనీ నుంచి ఎంత లిక్కర్‌ కొనుగోలు చేయాలి.. ఏ రోజు ఏ బ్రాండ్లు ఎంత మేరకు విక్రయించాలి.. అనేది రాజ్‌ కసిరెడ్డే నిర్ణయించారని సమాచారం! కమీషన్లుగా దండుకున్న డబ్బులో కొంత మొత్తాన్ని సినిమాల్లో పెట్టుబడులుగా పెట్టినట్లు అధికారులు గుర్తించారు. దీని వివరాలు రాబట్టేందుకు... సదరు చిత్ర నిర్మాణ సంస్థలకూ ‘సిట్‌’ నోటీసులు జారీ చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

Updated Date - Apr 17 , 2025 | 03:14 AM