Share News

Mithun Reddy Liquor Scam: తెలియదు చెప్పలేను

ABN , Publish Date - Apr 20 , 2025 | 03:35 AM

వైసీపీ ఎంపీ మిథున్‌ రెడ్డి లిక్కర్‌ స్కామ్‌ విచారణలో సిట్‌ అధికారుల ప్రశ్నలకు దాటవేత ధోరణిలో సమాధానాలు ఇచ్చారు. తనపై కుట్ర జరుగుతోందని, మద్యం వ్యాపారాలతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టంచేశారు

Mithun Reddy Liquor Scam: తెలియదు చెప్పలేను

  • ‘సిట్‌’ విచారణలో మిథున్‌ రెడ్డి తీరిదీ

  • నేను ఎంపీని.. ఏపీ వ్యవహారాలు తెలియవని దాటవేత

  • కుట్రతోనే మద్యం ఆరోపణలు.. ఏ సంబంధమూ లేదని వాదన

  • కసిరెడ్డితో ఉన్నది పార్టీ సంబంధమేనని వెల్లడి

  • కానీ, ఆయనతో పీఎల్‌ఆర్‌ లావాదేవీలపై ప్రశ్నలకు తడబాటు

  • ముందు తెలియదని.. ఆనక డబ్బు ఇచ్చేశాడని జవాబు

  • ‘అరబిందో’ నుంచి అప్పు తీసుకోలేదని వాదన

  • 7 గంటలపాటు విచారణ.. 100 ప్రశ్నలు

  • జవాబుల తీరుపై సిట్‌ అసంతృప్తి.. మళ్లీ విచారణకు పిలుపు?

అమరావతి, ఏప్రిల్‌ 19 (ఆంధ్రజ్యోతి): ‘‘నాకు తెలీదు.. నాకు సంబంధం లేదు.. లిక్కర్‌ బిజినెస్‌ నేను చెయ్యలేదు..’ అంటూ సిట్‌ ఏ ప్రశ్న వేసినా వైసీపీ కీలక నేత, రాజంపేట ఎంపీ పీవీ మిథున్‌రెడ్డి జవాబులో మాత్రం మార్పు లేదు. వైసీపీ ప్రభుత్వం హయాంలో జరిగిన వేల కోట్ల రూపాయల మద్యం కుంభకోణం గురించి ఏడుగంటలపాటు వంద ప్రశ్నలు వేసినా దాటవేత ధోరణిలోనే ఆయన వ్యవహరించారు. లిక్కర్‌ స్కామ్‌లోనిపాత్రధారులు, సూత్రధారులను సిట్‌ అధికారులు పిలిచి విచారిస్తున్నారు. ఇప్పటికే అధికారులు, వ్యాపారులు, మధ్యవర్తులతోపాటు వైసీపీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డిని ప్రశ్నించారు. ఈ క్రమంలో మిథున్‌ రెడ్డిని శనివారం విజయవాడలో సుదీర్ఘంగా సిట్‌ ప్రశ్నించింది. ఉదయం పది గంటలకు న్యాయవాదితో కలిసి విచారణకు హాజరైన ఆయన సాయంత్రం ఆరు గంటలకు బయటికి వచ్చారు. లిక్కర్‌ స్కామ్‌లో పరారీలో ఉన్న రాజ్‌ కసిరెడ్డి గురించి అడిగినప్పుడు, ఆయనతో తనకు ఉన్నది పార్టీ సంబంధమేనని ముందు సిట్‌ విచారణలో మిథున్‌రెడ్డి చెప్పారు. అయితే, తన కుటుంబానికి చెందిన పీఎల్‌ఆర్‌ కంపెనీతో రాజ్‌ కసిరెడ్డి జరిపిన రెండు ఆర్థిక లావాదేవీల గురించి అడిగినప్పుడు ఆయన తడబడ్డారు. ఆనక.. రాజ్‌ తమకు ఇవ్వాల్సిన డబ్బులన్నీ ఇచ్చేశాడని సిట్‌ అధికారులకు తెలిపారు.మిథున్‌రెడ్డిని అప్పటి బేవరేజెస్‌ కార్పొరేషన్‌ ఎండీ వాసుదేవరెడ్డి స్టేట్‌మెంట్‌ ఆధారంగా ప్రశ్నించారు. విజయసాయిరెడ్డి, సత్యప్రసాద్‌ల వాంగ్మూలాలను కూడా మధ్యమధ్య ప్రస్తావించారు.


అయితే ముందుగానే సిద్ధమై వచ్చినట్టు మిథున్‌ రెడ్డి దాదాపు అన్నింటికీ.. ఒకే ధోరణిలో సమాధానాలు చెప్పినట్లు తెలిసింది. విశ్వసనీయ సమాచారం మేరకు సిట్‌ అధికారులు, మిథున్‌ రెడ్డి మధ్య జరిగిన సంభాషణ.....

సిట్‌: రాష్ట్రంలో 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక లిక్కర్‌ పాలసీపై హైదరాబాద్‌, తాడేపల్లిలో విజయసాయిరెడ్డి ఇంట్లో జరిగిన సమావేశంలోనే ప్రభుత్వ మద్యం షాపులు పెట్టాలనే నిర్ణయం చేశారా?

మిథున్‌: అది ప్రభుత్వం తీసుకునే నిర్ణయం. నేను ఏపీ ప్రభుత్వంలో లేను. వైసీపీ ఎంపీగా పార్లమెంటులో ప్రశ్నలు, నియోజవర్గంలో ప్రజా సమస్యలపైనే నేను దృష్టి పెడతా.

సిట్‌: మీరు మంత్రి కాదని మాకూ తెలుసు. మరి లిక్కర్‌ పాలసీ గురించి విజయసాయిరెడ్డి ఇంట్లో ప్రైవేటు వ్యాపారులతో కూర్చుని మీరు ఎలా చర్చించారు?

మిథున్‌: ఆయన, నేను ఒకే పార్టీలో ఎంపీలు. పార్టీలో క్రియాశీలకంగా పని చేస్తున్నాం. వందల సార్లు సమావేశమయ్యాం. అంత మాత్రాన అది లిక్కర్‌ పాలసీ అంటే ఎలా.?

సిట్‌: ఆదాన్‌ డిస్టిలరీస్‌ ద్వారా మీరు చేసిన వ్యాపారం ఎంత? అందులో పారదర్శకత ఉందా?

మిథున్‌: నాకు లిక్కర్‌ బిజినె్‌సతో సంబంధం లేదు. మాకున్నవి నిర్మాణ కాంట్రాక్ట్‌ వ్యాపారాలే.

సిట్‌: నంద్యాలలో ఎస్పీవై డిస్టిలరీ్‌సను మీరు స్వాధీనం చేసుకోలేదా? రాజ్‌ కసిరెడ్డి, సజ్జల శ్రీధర్‌రెడ్డితో కలిసి వ్యాపారం కోసం అరబిందో యాజమాన్యం నుంచి 100కోట్ల రూపాయల అప్పు ఇప్పించాలని సాయి రెడ్డిని అడగలేదా.?

మిథున్‌: ఎస్పీవై డిస్టిలరీస్‌ ఎవరి పేరుతో ఉందో, అందులో వ్యాపారాలు ఎవరు చేశారో నాకు తెలీదు. రాజ్‌ కసిరెడ్డి అప్పు ఇప్పించమంటే సాయి రెడ్డి ఇప్పించి ఉండొచ్చు. వందల కోట్ల రూపాయల కాంట్రాక్టులు చేసే కంపెనీ ఉన్న నాకు ప్రైవేటు వ్యక్తుల దగ్గర రూ.100కోట్లు అప్పు చేయాల్సిన అవసరం ఎందుకు ఉంటుంది.?

సిట్‌: లిక్కర్‌ పాలసీ రూపకల్పన నుంచి మద్యం తయారీ, సరఫరా, విక్రయాల వరకూ 2019-24 మధ్యలో మీ పాత్ర ఏంటి.?

మిథున్‌: నా పాత్ర అందులో లేదు. నాపై కుట్ర జరుగుతోంది. కూటమి ప్రభుత్వ వేధింపుల్లో భాగమే ఈ కేసులు, విచారణలు..

సిట్‌: మద్యం కుంభకోణంలో ఎవరి పాత్ర ఏమిటో మాకు తెలుసు. ఆధారాలతోనే ప్రశ్నిస్తున్నాం.

మిథున్‌: నాకు తెలిసినంతవరకూ అసలు కుంభకోణమే జరగలేదు. ప్రభుత్వమే నేరుగా విక్రయాలు చేపడితే ఇక అక్రమాలు ఎలా ఉంటాయి.?

సిట్‌: ప్రైవేటు మద్యం షాపుల స్థానంలో ప్రభుత్వమే లిక్కర్‌ విక్రయించాలన్న ఆలోచన ఎలా వచ్చింది.?

మిథున్‌: నా దగ్గర ఆ ప్రశ్నకు సమాధానం లేదు. దాంతో నాకెలాంటి సంబంధం లేదు.

సిట్‌: జనం కోరుకున్న బ్రాండ్లు కాకుండా ప్రభుత్వ మద్యం దుకాణాల్లో అమ్మే బ్రాండ్లను కొనాల్సిన పరిస్థితికి ఎవరు కారణం.?

మిథున్‌: నాకు సంబంధంలేని ప్రశ్నలు మీరు అడిగితే నేను సమాధానం ఎలా చెప్పగలను.?

సిట్‌: పొరుగు రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా మద్యం ధరలు ఎందుకు పెంచారు? వ్యాపారుల ఒత్తిడే

కారణమా?

మిథున్‌: ప్రజలను మద్యం నుంచి దూరం చేసేందుకే మద్యం ధరలు పెంచినట్లు అప్పటి ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది. ఆ తర్వాత పొరుగు మద్యం అక్రమ రవాణా కట్టడి చేసే క్రమంలో ధరలు తగ్గించింది. కొందరు ముడుపుల వ్యాపారుల ఒత్తిడి ఉందా లేదా అనేది నాకు తెలీదు.

సిట్‌: రాష్ట్రంలో 28 డిస్టిలరీలు మీ కనుసన్నల్లోనే వ్యాపారాలు చేశాయని మాకు సమాచారం ఉంది.

మిథున్‌: నాకు ప్రత్యక్షంగా, పరోక్షంగా లిక్కర్‌ వ్యాపారాలతో సంబంధం లేదని మరోసారి చెబుతున్నా..

సిట్‌: మద్యం కుంభకోణంలోని ముడుపుల డబ్బులు ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులకు మీ ద్వారా వెళ్లినట్లు తెలిసింది.

మిథున్‌: అటువంటిది లేనే లేదు.

సిట్‌: హవాలా ఏమైనా జరిగినట్లు మీకు తెలిసిందా.?

మిథున్‌: నాకు సంబంధం లేని వాటి గురించి మీరు నన్నెందుకు అడుగుతున్నారు.?

సిట్‌: లిక్కర్‌ కుంభకోణంలో కీలక వ్యక్తులు ఇచ్చిన వాంగ్మూలంలో మీ పాత్రపై స్పష్టంగా ఆధారాలు ఉన్నాయి. మద్యం కంపెనీల నుంచి ముడుపుల వసూళ్ల వ్యవహారం మీరు, రాజ్‌ కసిరెడ్డి కలిసి నిర్ణయించారా.?


మిథున్‌: ఆధారాలుంటే కోర్టులో చూపించుకోండి. నేను ఎలాంటి ముడుపులు తీసుకోలేదు. ఎవరికీ ఇవ్వలేదు. అసలు ఏమీ లేని దాంట్లో రూ.వేల కోట్ల కుంభకోణం ఉందనడమే నాకు వింతగా అనిపిస్తోంది.

సిట్‌: మద్యం ముడుపులన్నీ చివరికి ఎక్కడికి చేరాయో మీకు నిజంగా తెలియదా.?

మిథున్‌: నాకు తెలిసినంతవరకూ ముడుపులే లేవు. లేనివి ఎక్కడికి చేరాయంటే చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు.

సిట్‌: రాజ్‌ కసిరెడ్డితో మీకున్న సంబంధం ఏమిటి.? అతనితో మీకు ఆర్థిక లావాదేవీలు ఉన్నాయా.?

మిథున్‌: ఒకే పార్టీలో ఉన్నాం. నేను ఎంపీ, రాజ్‌ అప్పటి ప్రభుత్వ సలహాదారు. ఆర్థికపరమైన వ్యవహారాలేమీ లేవు.

సిట్‌: లిక్కర్‌ పాలసీ ఖరారు, లిక్కర్‌ తయారీ డిస్టిలరీల స్వాధీనం, వ్యాపారానికి అప్పులు, కొత్త బ్రాండ్లతో మద్యం ఉత్పత్తి, సరఫరా, విక్రయాలు.. ఇలా అన్నింట్లోనూ మీ పేరు వినిపిస్తోంది. ఏమీ సంబంధం లేదని ఎలా చెబుతున్నారు.?

మిథున్‌: చెప్పే వాళ్లుంటే చాలా వినిపిస్తాయి. అవన్నీ నిజాలా.? ఆధారాలు ఉండాలికదా. అవి ఉంటే కోర్టులో సమర్పించుకోండి..

సిట్‌: సరే..మీరు వెళ్లండి. అవసరమైతే మళ్లీ పిలుస్తాం.

సిట్‌: రోడ్డు పక్కన టీ తాగితే ఆన్‌లైన్‌ ద్వారా చెల్లిస్తున్నారు. కానీ 95 శాతానికి పైగా మద్యం వ్యాపార లావాదేవీలు నగదు రూపంలో జరగడం ఏమిటి? మద్యం స్కామ్‌లో ముట్టిన ముడుపుల గుట్టు బయటపడకూడదనే ఉద్దేశం ఏదైనా దీనివెనుక ఉందా?

మిథున్‌రెడ్డి: కుంభకోణం, ముడుపులూ ఏమీ లేవనుకొంటున్నా.. నగదు చెల్లింపులకు కారణం ఏమిటో నాకు తెలియదు. మద్యం కొనుగోలు చేసే ప్రతి ఒక్కరి దగ్గరా ఫోన్‌ పే ఉండాలని లేదుగా.?

సిట్‌: మీ కుటుంబానికి చెందిన పీఎల్‌ఆర్‌ ఇన్‌ఫ్రా నుంచి రాజ్‌ కసిరెడ్డితో ఎలాంటి లావాదేవీలు జరగలేదా.?

మిథున్‌రెడ్డి: నాకు తెలిసినంతవరకూ ఏమీలేవు. చిన్నచిన్నవి ఏవైనా ఉన్నట్లయితే మా ఆడిటర్లు చెబుతారు. నాకు అన్నీ గుర్తుండవు కదా! (కానీ, మధ్యాహ్నం సెషన్‌లో) రాజ్‌ కసిరెడ్డి మా కంపెనీకి చెల్లించాల్సిన డబ్బులు ఇచ్చేశాడు.


ఇదొక రాజకీయ వేధింపుల కేసు: మిథున్‌

విజయవాడ, ఏప్రిల్‌ 19 (ఆంధ్రజ్యోతి) : మద్యం స్కామ్‌ అనేది జరగేలేదని, రాజకీయ వేధింపుల్లో భాగంగానే ప్రభుత్వం తప్పుడు ఆరోపణలు చేస్తోందని ఎంపీ మిథున్‌రెడ్డి ఆరోపించారు. తనపై మాదకద్రవ్యాలు, మనుషుల అక్రమ రవాణాతప్ప మిగిలిన అన్ని కేసులూ పెట్టారన్నారు.సిట్‌ విచారణ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మదనపల్లెలో ఏదో జరిగిపోయిందని కథ నడిపారని, ఈ ఘటనలో అనుమానితుడికి పోలీగ్రాఫ్‌ పరీక్షలు చేస్తే అంతా కట్టుకథని తేలిందన్నారు. ‘‘మైనింగ్‌, ఇసుకలో వేల కోట్ల అవినీతి జరిగిందన్నారు. చివరకి అది తప్పుడు కేసు అని తేలింది. అటవీ భూములను ఆక్రమించుకున్నామని ఆరోపణలు చేశారు. ఆ భూమి తమ సొంతమని పత్రాలు చూపించినా అటవీ భూమి అని వాదించారు. మేం కోర్టుకు వెళ్లిన తర్వాత అంతా సరిగా ఉందని తేలింది. ఈ కేసుల్లో ఏ ఒక్కదాన్నీ నిరూపించలేకపోయారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌ జరుగుతుందని ఆరోపిస్తే. దాన్ని నిరూపించాలని బహిరంగ సవాల్‌ చేశాను. ఈ ఆరోపణలన్నీ అయిపోయిన తర్వాత లిక్కర్‌ స్కాం ఆరోపణ చేస్తున్నారు.’’ అని విమర్శించారు. కాగా, మిథున్‌రెడ్డిని విచారిస్తున్న పోలీసు కమిషనర్‌ కార్యాలయానికి వైసీపీ ఎమ్మెల్సీలు తలశిల రఘురాం, మొండితోక అరుణ్‌కుమార్‌, మాజీ మంత్రి పేర్ని నాని, దేవినేని అవినాశ్‌, అడపా శేషు తదితరులు వచ్చారు. మీడియాతో మిథున్‌రెడ్డి మాట్లాడిన తర్వాత ఆయన వెంట వాహనాల్లో వెళ్లిపోయారు.

Updated Date - Apr 20 , 2025 | 03:35 AM