AP Politics: జగన్‌కు ఇచ్చి పడేసిన మంత్రి పార్థసారథి..
ABN , Publish Date - Nov 07 , 2025 | 05:07 PM
వైఎస్ జగన్‌పై మంత్రి కొలుసు పార్థసారథి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. జగన్ ప్రభుత్వ హయాంలో క్రెడిట్ చోరీ తప్ప ఆయన చేసిందేమీ లేదంటూ ఎద్దేవా చేశారు. ఆయన పాలనంతా దోపిడీ..
అమరావతి, నవంబర్ 7: వైఎస్ జగన్‌పై మంత్రి కొలుసు పార్థసారథి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. జగన్ ప్రభుత్వ హయాంలో క్రెడిట్ చోరీ తప్ప ఆయన చేసిందేమీ లేదంటూ ఎద్దేవా చేశారు. ఆయన పాలనంతా దోపిడీ, విధ్వంసమే ధ్యేయంగా సాగిందన్నారు. శుక్రవారం నాడు మీడియాతో మాట్లాడిన మంత్రి పార్థసారథి.. జగన్‌ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు.
మొంథా తుపాను వేగం కంటే చంద్రబాబు ప్రభుత్వం వేగంగా స్పందించి.. క్షేత్ర స్థాయిలో యంత్రాంగాన్ని నడిపించిందన్నారు మంత్రి. కానీ, ఇవేవీ కనిపించని జగన్.. అబద్ధాలు ప్రచారం చేయడమే పనిగా పెట్టుకున్నారని దుయ్యబట్టారు. గత ఐదేళ్లలో జగన్ చేసిందంతా క్రెడిట్ చోరీనే అని విమర్శించారు. ప్రభుత్వంలోకి రావడమే ఆలస్యం.. విచ్చలవిడిగా దోపిడీకి పాల్పడ్డాడని.. రాష్ట్రంలో విధ్వంసం సృష్టించారని జగన్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు మంత్రి పార్థసారథి. 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోవడానికి జగన్ చేసిన మోసాలు, విధ్వంసమే కారణమన్నారు.
జగన్ ప్రభుత్వం హయాంలో అమ్మఒడి ద్వారా ప్రతి పిల్లవాడిని చదివిస్తానని చెప్పి.. ఇంటికి ఒకరికే ఇచ్చి మోసం చేశారన్నారు. కానీ, టీడీపీ ప్రభుత్వం వచ్చాక ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తున్నట్లు మంత్రి చెప్పారు. 67 లక్షల మంది విద్యార్థులకు ఇంటర్ వరకు రూ. 10,090 కోట్లు ఖర్చు చేస్తున్నామని వివరించారాయన. జగన్ ప్రభుత్వంలో చిక్కి, కోడిగుడ్ల పంపిణీలో రూ. 200 కోట్ల అవినీతి జరిగిందని, దీనిపై వారు సిగ్గుపడాలన్నారు. రైతు భరోసా రూ. 14 వేలు ఇస్తామని చెప్పిన జగన్.. కేవలం రూ. 7,500 మాత్రమే ఇచ్చారని విమర్శించారు. కానీ, తమ ప్రభుత్వం వచ్చాక అన్నదాత సుఖీభవ పథకం కింద రూ. 20 వేలు రెండు విడతలుగా రైతులకు ఇస్తున్నామని చెప్పారు మంత్రి పార్థసారథి.
ఇక పెట్టుబడులు రాబట్టే విషయంలోనూ కూటమి సర్కార్ అద్భుతంగా పని చేస్తోందన్నారు మంత్రి. ఇప్పటికే రూ. 7.68 లక్షల కోట్ల పెట్టబడులు గ్రౌండ్ అయ్యాయని చెప్పారు. 2027-28 నాటికి 7.20 లక్షల ఉద్యోగాలు వస్తాయన్నారు. జగన్ హాయంలో పెట్టుబడులు రాలేదన్న మంత్రి పార్థసారథి.. ‘మీ క్రెడిట్ మాకు వద్దు.. మీరే జాగ్రత్తగా ఉంచుకోండి. కానీ, అబద్ధాలు మానండి’ అంటూ హితవు చెప్పారు.
Also Read:
ఉనికి కోల్పోతానన్న భయంతోనే అసత్యాలు.. జగన్‌పై మంత్రి సీరియస్