Minister Nimmala Slams Jagan: సీమపై జగన్ విషం
ABN , Publish Date - Jul 18 , 2025 | 05:14 AM
రాయలసీమ ప్రజలు తనను ఘోరంగా ఓడించడంతో కక్ష పెంచుకున్న జగన్..

జనం ఘోరంగా ఓడించారని కక్షపెంచుకున్నారు
బనకచర్లను అడ్డుకోవడం ద్రోహమే: మంత్రి నిమ్మల
కర్నూలు, జూలై 17 (ఆంధ్రజ్యోతి): రాయలసీమ ప్రజలు తనను ఘోరంగా ఓడించడంతో కక్ష పెంచుకున్న జగన్.. ఆ ప్రాంతంపై విషం కక్కుతున్నారని జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. అందుకే కరువు సీమను సస్యశామలం చేసే పోలవరం-బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకునేందుకు కుట్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. గురువారం కర్నూలులో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘పోలవరం-బనకచర్ల అసాధ్యమంటున్న జగన్‌కు క్యూసెక్కు, టీఎంసీకి తేడా తెలుసా..? 1975 నుంచి 2024 వరకు గోదావరి వరద రికార్డులు పరిశీలిస్తే.. 50 ఏళ్లలో 1.53 లక్షల టీఎంసీలు సముద్రంలో కలిశాయి. అంటే ఏటా 3,150 టీఎంసీలు కడలిపాలయ్యాయి. ఐదేళ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన జగన్‌కు ఆ మాత్రం తెలియదా..’ అని నిలదీశారు. ప్రాణహిత, ఇంద్రావతి, గోదావరి వరద పోలవరం వద్ద కలుస్తోందని.. తెలంగాణతో ఏ మాత్రం సంబంధం లేకుండా శబరి, సీలేరు నదుల నుంచి ఏటా 600 టీఎంసీల నీరు గోదావరిలో కలుస్తోందని వెల్లడించారు.
సీఎం చంద్రబాబు ఎంతో దూరదృష్టితో గోదావరి జలాలను రాయలసీమకు తెచ్చి కరువు నేలను పచ్చని పైరుగా మార్చాలని తపిస్తుంటే.. ఈ ప్రాంతం వ్యక్తిగా, ఓ పార్టీ అధ్యక్షుడిగా సహకరించాల్సింది పోయి విషం కక్కుతారా అని జగన్‌పై విరుచుకుపడ్డారు. సొంత తల్లిని, చెల్లిని, చిన్నాన్న కూతురును బయటకు గెంటేసిన వ్యక్తికి సీమ సెంటిమెంట్ ఉంటుందని తాననుకోవడం లేదన్నారు. 2020 నాటికి హంద్రీ-నీవా విస్తరణ పూర్తి చేస్తామని ప్రగల్భాలు పలికిన జగన్ ఐదేళ్లలో గంపెడు మట్టి తీయలేదని, అర బస్తా సిమెంట్ వేయలేదని ధ్వజమెత్తారు. మళ్లీ చంద్రబాబు వచ్చాక 120 రోజుల్లో 3,850 క్యూసెక్కుల ప్రవాహ సామర్థ్యాన్ని విస్తరించి ఇంజనీరింగ్ చరిత్రలోనే చెరగని రికార్డు సృష్టించారని అన్నారు. పోలవరాన్ని ప్రశ్నార్థకం చేసిన జగన్‌కు ఆ ప్రాజెక్టు గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. గుండ్రేవుల ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వంతో చర్చిస్తామని తెలిపారు. అంతకుముందు సీమ ప్రాజెక్టులపై సీఈలు కబీర్‌బాషా, నాగరాజు, ఇంజనీర్లతో మంత్రి సమీక్షించారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Heavy Rains: భారీ వర్షం.. ఎక్కడికక్కడ నిలిచిపోయిన వాహనాలు..
Heavy Rains: భారీ వర్షం.. ఎక్కడికక్కడ నిలిచిపోయిన వాహనాలు..
CM Vs KTR: కేటీఆర్ మిత్రుడు దుబాయ్‌లో చనిపోయాడు: సీఎం రేవంత్