Nara Lokesh :అన్ని స్కూళ్లలో ఐదేళ్లలో మౌలిక వసతులు
ABN , Publish Date - Mar 04 , 2025 | 06:04 AM
వచ్చే ఐదేళ్లలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో నూరు శాతం మౌలిక సదుపాయాలు కల్పిస్తామని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి లోకేశ్ తెలిపారు.

ప్రహరీ గోడలకు ఉపాధి నిధులు: లోకేశ్
ప్రతి పాఠశాల, కాలేజీలో ఈగల్ టీంలు
‘డ్రగ్స్ వద్దు బ్రో’ పేరుతో అవగాహన
అమరావతి, మార్చి 3 (ఆంధ్రజ్యోతి): వచ్చే ఐదేళ్లలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో నూరు శాతం మౌలిక సదుపాయాలు కల్పిస్తామని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి లోకేశ్ తెలిపారు. ప్రహరీ గోడల నిర్మాణానికి రూ.3 వేల కోట్లు అవసరమని, వీటికి ఉపాధి హామీ పథకం నిధులు, ‘మన బడి-మన భవిష్యత్’ నిధులు వినియోగిస్తామని చెప్పారు. 16,347 పోస్టులతో త్వరలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. ఆయా అంశాలపై సోమవారం అసెంబ్లీలో పలువురు సభ్యుల ప్రశ్నలకు ఆయన సమాధానాలిచ్చారు. ‘గత వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లలో ఒక్క డీఎస్సీ కూడా ప్రకటించలేదు. గత 30 ఏళ్లలో టీడీపీ ప్రభుత్వాల హయాంలో 13 డీఎస్సీలు తెచ్చి.. 1,80,272 మంది టీచర్ పోస్టులు భర్తీ చేసింది. రాష్ట్ర విభజన తర్వాత టీడీపీ మొదటి హయాంలో మూడు డీఎస్సీలు ప్రకటించి 16,701 పోస్టులు భర్తీ చేసింది’ అని వివరించారు. ఈ ఏడాది డిసెంబరు నాటికి కేజీబీవీల్లో వంద శాతం ప్రహరీల నిర్మాణం పూర్తవుతుందన్నారు. సీసీ టీవీలు కూడా ఏర్పాటుచేస్తామని చెప్పారు. గత ప్రభుత్వం అమలుచేసిన నాడు- నేడు పథకంపై అనేక ఆరోపణలున్నాయని, దానిపై నివేదిక తెప్పిస్తామన్నారు. ప్రతి పాఠశాల, కాలేజీలో ఈగిల్ టీంలు ఏర్పాటుచేసి ‘డ్రగ్స్ వద్దు బ్రో’ పేరుతో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. జగన్ ప్రభుత్వం జీవో 117 తీసుకొచ్చి పేదలకు విద్యను దూరం చేసిందని విమర్శించారు. దాని చేతగానితనంతో ప్రభుత్వ పాఠశాలల్లో 12 లక్షల మంది విద్యార్థులు తగ్గిపోయారని తెలిపారు. ప్రహరీ గోడలు లేకపోవడం వల్ల పాఠశాలల ఆవరణల్లో డ్రగ్స్, గంజాయి వినియోగం పెరుగుతోందని విజయనగరం ఎమ్మెల్యే పూసపాటి అదితి గజపతిరాజు అన్నారు.