AP Minister Corruption: మంత్రిగారి బేరం
ABN , Publish Date - Jul 07 , 2025 | 03:09 AM
ఎలాగూ పని అయిపోయింది. ఇప్పుడు గుట్టు బయటపడితే ఏమైందిలే!! వచ్చే కమీషన్ అయితే తీసేసుకుందాం అనే రీతిన కంప్యూటర్ల కొను గోల్‌మాల్ వ్యవహారంలో సంబంధిత శాఖ మంత్రి వ్యవహరించినట్లు తెలిసింది.

గుట్టు బయటపడ్డా తగ్గేదేలే!!
ముడుపుల కోసం హైదరాబాద్‌లో భేటీ
ఓ హోటల్‌లో కంపెనీ ప్రతినిధులతో చర్చలు
కంప్యూటర్ల కొను‘గోల్‌మాల్’పై ప్రభుత్వం ఆరా
అమరావతి, జూలై 6 (ఆంధ్రజ్యోతి): ‘‘ఎలాగూ పని అయిపోయింది. ఇప్పుడు ‘గుట్టు’ బయటపడితే ఏమైందిలే!! వచ్చే కమీషన్ అయితే తీసేసుకుందాం’’ అనే రీతిన కంప్యూటర్ల కొను‘గోల్‌మాల్’ వ్యవహారంలో సంబంధిత శాఖ మంత్రి వ్యవహరించినట్లు తెలిసింది. టెండర్ల ప్రక్రియ ఇప్పటికే పూర్తైన నేపథ్యంలో సంబంధిత కంపెనీ నుంచి ‘ప్రతిఫలం’ అందుకొనేందుకు ఆదివారం ఉదయం హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో భేటీ అయ్యారు! కంపెనీ ముఖ్యులతో చర్చించిన తర్వాత రోడ్డు మార్గంలోనే విజయవాడకు వచ్చేశారు!! ఈ వ్యవహారంలో అందాల్సిన వారికి భారీగానే ముడుపులు చేరినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో హోటల్లో మంత్రితో చర్చించిన వ్యక్తులెవరు? ముడుపులు చేతులు మారాయా? ఎవరెవరు ఎంతమేర లబ్ధి పొందారు? మంత్రి కుమారుడికి కొత్త కారు ఎలా వచ్చింది? తదితర విషయాలపై ప్రభుత్వం ఆరా తీసినట్లు తెలిసింది. రాష్ట్రంలోని ఒక కీలక ప్రభుత్వ శాఖలో కంప్యూటర్ల కొనుగోళ్ల టెండర్ ఒక కంపెనీకి వచ్చేలా జరిగిన లాబీయింగ్‌పై ‘సూర్యా భాయ్ దందా’ శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’లో ఆదివారం కథనం వచ్చిన విషయం తెలిసిందే. ఇది తెలిసిన సదరు మంత్రి.. తొలుత ఖంగుతున్నారు. తర్వాత తేరుకొని వెనక్కి తగ్గేదే లేదంటూ.. ‘ప్రతిఫలం’ అందుకొనేందుకు ముందుకే వెళ్లడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై ప్రభుత్వ పెద్దలు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారన్న ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.
ఎలాగూ పని అయిపోయింది కదా!
ముందస్తు చర్చల్లో జరిగిన ఒప్పందంలో భాగంగా టెండర్ దక్కించుకున్న కంపెనీ ప్రతినిధులు మంత్రికి చెప్పిన ప్రతిఫలం ముట్టజెప్పేందుకు హైదరాబాద్‌లోని ఒక స్టార్ హోటళ్లో సమావేశం ఏర్పాటు చేశారు. మాదాపూర్‌ని ఒక హోటల్‌కు శనివారం రాత్రే చేరుకున్న సదరు మంత్రి.. ఆదివారం ఉదయం బేగంపేటలోని స్టార్ హోటల్‌లో సమావేశమై ప్రతిఫలం అందుకోవడానికి సిద్ధమయ్యారు. అయితే ఆదివారం ఉదయం ‘ఆంధ్రజ్యోతి’లో ఈ వ్యవహారంపై కథనం రావడంతో ఖంగుతిన్నారు. కొంతసేపు తర్జనభర్జన తర్వాత ఎలాగూ పని అయిపోయింది కదా! ఇప్పుడు తీసుకుంటే నష్టమేంటి? తీసుకోకపోతే లాభమేంటి? అనే ఆలోచనతోనే హోటళ్లో భేటీకి వెళ్లిపోయినట్లు తెలిసింది. సంబంధిత కంప్యూటర్ల కొనుగోళ్ల ప్రాజెక్టు కేంద్ర నిధుల వాటా మెజార్టీగా ఉన్న నేపథ్యంలో.. ఈ భేటీలో ఢిల్లీ నుంచి వచ్చిన ఓ ఐఏఎస్ అధికారి కూడా పాల్గొన్నట్లు సమాచారం.
బేరసారాలు.. టెండర్లలో మార్పులు ఇలా..
కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా చేపడుతున్న ప్రాజెక్టులో భాగంగా ఏపీలోనూ అమలుకు రూ.40 కోట్లు విడుదల చేసింది. నాలుగు విభాగాలను ఏకం చేసి అన్నింట్లోనూ సమాచారం నిక్షిప్తం చేసేందుకు కంప్యూటర్లు కొనుగోలు చేయాలని సూచించింది. రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.10 కోట్లు కలుపుకొని ఈ ప్రాజెక్టు మొదలైంది. డెస్క్‌టాప్, హార్క్‌డిస్క్, ఇతర పరికరాలు కలిపి మొత్తం 4,580 సెట్లు కొనుగోలుకు రాష్ట్రంలోని కీలక ప్రభుత్వ శాఖకు చెందిన టెక్నికల్ విభాగం కంప్యూటర్ల కొనుగోలు ప్రక్రియ ప్రారంభించింది. మొదట కేంద్రం సూచించిన స్పెసిఫికేషన్లతో టెండర్లు ఆహ్వానించింది. అర్హత కలిగిన ఐదు కంపెనీలు బిడ్లు వేయగా.. అందులో మూడు కంపెనీలను ఒక్కరే బినామీల ద్వారా రంగంలోకి దించినట్లు తెలిసింది. మిగతా ఇద్దరినీ తప్పించే ప్రయత్నాల్లో భాగంగా మంత్రిని ఆశ్రయించారు. టెండర్ వచ్చేలా చేస్తే ప్రతిఫలం ఉంటుందని ఆఫర్ ఇచ్చారు. ఈ క్రమంలో మంచి పోస్టింగ్ కోసం ఎదురు చూస్తోన్న అధికారితో మాట్లాడిన మంత్రి ‘మీ పోస్టింగ్ బాధ్యత నాది. వీళ్లు అడిగినట్లు స్పెసిఫికేషన్లు మార్చి టెండర్ వచ్చేలా చూడండి’ అని ఆదేశించారు. దీనికి సరేనన్న టెక్నికల్ విభాగం అధికారి.. ఆ మూడు కంపెనీలకు మాత్రమే టెండర్ దక్కేలా, మిగతా రెండు అవకాశం కోల్పోయేలా మార్పులు చేశారు. ఎట్టకేలకు అనుకున్న లక్ష్యం నెరవేరడంతో మంత్రి ఆ అధికారికి మంచి పోస్టింగ్ ఇప్పించేందుకు ప్రభుత్వ పెద్దల వద్ద ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు సమాచారం. నిజాయితీపరుడు, సమర్థుడు అంటూ కులం కార్డు సైతం వాడి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు.