Minister Anita Warns: వైసీపీవి దిగజారుడు రాజకీయాలు
ABN , Publish Date - Jul 18 , 2025 | 04:48 AM
వైసీపీ నాయకులు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు. ఈ విధానాన్ని వారు విడనాడాలి..

రెచ్చగొట్టే వ్యాఖ్యలపై చట్టపరమైన చర్యలు తప్పవు: మంత్రి అనిత
మచిలీపట్నం, చుండూరు, జూలై 17(ఆంధ్రజ్యోతి): ‘వైసీపీ నాయకులు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు. ఈ విధానాన్ని వారు విడనాడాలి. లేకుంటే చట్టం తన పని తాను చేసుకుపోతుంది’ అని హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పోలీస్ శిక్షణ కేంద్రం శంకుస్థాపన కార్యక్రమానికి హాజరైన ఆమె... మంత్రి కొల్లు రవీంద్ర, జిల్లాలోని ఎమ్మెల్యేలతో కలసి మీడియాతో మాట్లాడారు. ‘సినిమా డైలాగులు చెబితే తప్పేంటని జగన్ అంటున్నారు. అల్లు అర్జున్ ఫొటో పెట్టి, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకుంటే తప్పులేదు. జగన్ ఫొటోలు వేసి రప్పా రప్పా అని ఫ్లెక్సీలు పెట్టారు. అందుకే కేసులు పెట్టారు’ అని అనిత చెప్పారు. ఈ సందర్భంగా పట్టాభిపై, గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి, తిరుపతి, విశాఖ విమానాశ్రయాల వద్ద చంద్రబాబును వైసీపీ నాయకులు, కార్యకర్తలు అడ్డుకున్న తీరును ఆమె గుర్తు చేశారు. ప్రజా సమస్యలపై పోరాటం చేసిన టీడీపీ నేతలందిరిపైనా వైసీపీ హయాంలో తప్పుడు కేసులు నమోదైన విషయాన్ని ఆమె ప్రస్తావించారు. తాను ఎస్సీ అయినా తనపైనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టిన ఘనత గత వైసీపీ ప్రభుత్వానికే దక్కిందంటూ ఎద్దేవా చేశారు. సోదరి వరుసయ్యే ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డి అక్కడితో ఆగకుండా రెండో రోజు తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారని, అందుకే ఆయనపై కేసు నమోదు చేశామన్నారు. రెచ్చగొట్టే విధంగా మాట్లాడే వారిపై చట్టపరంగా చర్యలు తప్పనిసరిగా తీసుకుంటామని స్పష్టం చేశారు. మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ, రాష్ట్రంలో మద్యం కుంభకోణంలో అనేక వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయని తెలిపారు. కాగా బాపట్ల మండలం చుండూరు మండలం వేటపాలెంలో ఎన్టీఆర్ కాంస్య విగ్రహావిష్కరణలో మంత్రి అనిత ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. జగన్ పేరు చెపితే గొడ్డలి వేటు, గంజాయి, చర్లపల్లి జైలు గుర్తుకు వస్తాయని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Heavy Rains: భారీ వర్షం.. ఎక్కడికక్కడ నిలిచిపోయిన వాహనాలు..
Heavy Rains: భారీ వర్షం.. ఎక్కడికక్కడ నిలిచిపోయిన వాహనాలు..
CM Vs KTR: కేటీఆర్ మిత్రుడు దుబాయ్‌లో చనిపోయాడు: సీఎం రేవంత్