APSRTC Bus Stolen: ఆర్టీసీ బస్సునే ఎత్తుకెళ్లాడు!
ABN , Publish Date - Jul 24 , 2025 | 03:45 AM
ఆర్టీసీ బస్సుల్లో చోరీలు జరగడం సాధారణంగా చూస్తుంటాం... వింటుంటాం

నెల్లూరుపాలెం వద్ద పట్టుకున్న అధికారులు
నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట), జూలై 23(ఆంధ్రజ్యోతి): ఆర్టీసీ బస్సుల్లో చోరీలు జరగడం సాధారణంగా చూస్తుంటాం... వింటుంటాం! అయితే ఓ వ్యక్తి ఆర్టీసీ బస్సునే ఎత్తుకెళ్లాడు. వివరాలివీ.. నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఆర్టీసీ డిపోకు చెందిన పల్లెవెలుగు బస్సు ప్రతి రోజూ ఏఎస్‌పేటకు నడుస్తుంది. మంగళవారం రాత్రి డ్రైవర్, కండక్టర్లు ఆత్మకూరు బస్టాండులో నైట్‌హాల్ట్ ఉంచారు. బుధవారం తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో ఓ వ్యక్తి ఆ బస్సును డ్రైవ్ చేసుకుంటూ తీసుకువెళ్లిపోయాడు. ఉదయం బస్సు కనిపించకపోవడంతో బస్ డ్రైవర్ నెల్లూరు-2 డిపో, ఆత్మకూరు బస్టాండు మేనేజర్లకు సమాచారం అందించారు. దీంతో అధికారులు టోల్‌ప్లాజాల వద్ద నిఘా పెట్టగా.. బస్సు బుచ్చి టోల్‌ప్లాజా దాటినట్లు తెలిసింది. వెంటనే నెల్లూరుపాలెం వద్ద ఆర్టీసీ సిబ్బందిని అప్రమత్తం చేయడంతో వారు స్థానికులతో కలిసి బస్సును అడ్డుకున్నారు. డ్రైవర్‌ను పట్టుకొని స్తంభానికి కట్టేశారు. బస్సును తీసుకెళ్లిన వ్యక్తి జిల్లాలోని విడవలూరు మండలం కంచరపాలేనికి చెందిన కృష్ణగా గుర్తించారు. అయితే, కృష్ణ కొద్ది రోజులుగా మతిస్థిమితం లేకుండా ప్రవర్తిస్తున్నట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదుచేసి విచారిస్తున్నారు.
దోసకాయను ఉప్పుతో తింటున్నారా? ఈ ముఖ్య విషయం తెలుసుకోండి.!
శరీరంలో కనిపించే ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి.. లేదంటే..!