Attenders Salary Issue: మా గోడు పట్టించుకోండి సార్
ABN , Publish Date - Jul 01 , 2025 | 05:00 AM
ఏళ్ల తరబడి చిరు జీతాలకే పనిచేస్తున్న తమ గోడు పట్టించుకోవాలని డ్వామా మండల కేంద్రాల్లో ఎంసీపీ పనిచేస్తున్న అటెండర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఉపాధి ఎంసీపీల్లోని అటెండర్ల ఆవేదన
జీతం పెంచి, తమ ఖాతాల్లో వేయాలని వినతి
అమరావతి, జూన్ 30(ఆంధ్రజ్యోతి): ఏళ్ల తరబడి చిరు జీతాలకే పనిచేస్తున్న తమ గోడు పట్టించుకోవాలని డ్వామా మండల కేంద్రాల్లో(ఎంసీపీ) పనిచేస్తున్న అటెండర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడో ఉపాధి హామీ పథకం ప్రారంభమైనప్పటి నుంచి మండల కంప్యూటర్ సెంటర్‌లో అటెండర్లుగా పనిచేస్తున్న తమకు రూ.6 వేల వేతనమే ఇస్తున్నారని చెబుతున్నారు. ప్రతి రోజు ఆఫీసు సమయం కంటే ముందే ఎంసీసీ కేంద్రాలకు వచ్చి కార్యాలయం శుభ్రం చేసి, సిబ్బందికి తాగునీరు అందించి, సాయంత్రం దాకా సిబ్బంది ఏం పని చెప్తే ఆ పనులు చేసే తమకు రూ.6 వేలు మాత్రమే అందిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ వేతనం పొందాలన్నా.. డ్వాక్రా గ్రూపు లీడర్, సంబంధిత కమ్యూనిటీ కోఆర్డినేటర్, డ్వామా అసిస్టెంట్ ప్రాజెక్టు ఆఫీసర్‌ల సంతకాల కోసం వేచి చూడాల్సి వస్తోందని అంటున్నారు. ఈ జీతాలు ఉపాధి హామీ నిధులతో ఇస్తున్నా.. దానికి డ్వాక్రా సిబ్బంది సంతకాలు ఎందుకో అర్థం కావడం లేదని వాపోతున్నారు. కొన్ని చోట్ల డ్వాక్రా సిబ్బంది సంతకాలు పెట్టకుండా వేధిస్తుండటంతో జీతాలు అందక ఇబ్బందులు పడుతున్నామని చెబుతున్నారు.
అప్పుడు టీడీపీ పెంచడమే!
మండల కేంద్రంలో డ్వామా, వెలుగు కార్యక్రమాలు ఒకే భవనంలో నిర్వహిస్తుంటారు. ఉపాధి హామీ పథకం ద్వారా ఈ భవనాల నిర్మాణాలను అప్పట్లో పూర్తి చేశారు. ‘వెలుగు’ ద్వారా అటెండర్లను నియమించేందుకు అప్పట్లో డ్వాక్రా గ్రూపులోని సభ్యులను అటెండర్లుగా నియమించుకున్నారు. మొదట్లో రూ.1,000 వేతనం ఉన్న వారికి 2007లో రూ.3 వేలకు పెంచారు. ఆ తర్వాత 2014-19 మధ్య కాలంలో రూ.6 వేలకు పెంచారు. ఈ వేతనాలను వారి అకౌంట్లలో జమచేసేలా నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత వైసీపీ హయాంలో తమ జీతాలు పెంచాలని ఎంసీసీ సిబ్బంది పలు దఫాలుగా అప్పటి కమిషనర్, ఉపాధి హామీ డైరెక్టర్‌కు మొరపెట్టుకున్నారు. అప్పట్లో ఉపాధి హామీ పథకం డైరక్టర్‌గా పనిచేసిన చినతాతయ్య వారి గోడును పట్టించుకోకపోవడమే కాక వారి వేతనాలను ఖాతాల్లో వేయకుండా తిరిగి పాత విధానం అమల్లోకి తెచ్చారు. డ్వాక్రా గ్రూపు లీడర్, సీసీ, ఏపీఓ సంతకాలు చేస్తేనే వారికి జీతాలు ఇచ్చే విధంగా నిబంధనలు పెట్టారు. రాష్ట్రవ్యాప్తంగా 650 మంది దాకా మండల కంప్యూటర్ కేంద్రాల్లో అటెండర్లు పనిచేస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన నిబంధనలను తొలగించాలని వానే కమిషనర్‌కు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రభుత్వం, ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ సానుభూతితో జీతాలు పెంచాలని కోరుతున్నారు.