Manda krishna Madiga : వర్గీకరణకు జగన్ వ్యతిరేకం
ABN , Publish Date - Feb 23 , 2025 | 04:03 AM
వైసీపీ అధినేత జగన్ గతంలో చేసిన వాఖ్యలు వర్గీకరణకు వ్యతిరేకంగా ఉన్నాయని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు.

గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలే నిదర్శనం
సుప్రీం తీర్పును దేశమంతా స్వాగతించింది
జగన్ మాత్రం ఒక్క ప్రకటనా చేయలేదు
కమిషన్ నివేదిక పారదర్శకంగా ఉండాలి
ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ
అనంతపురం సెంట్రల్, ఫిబ్రవరి 22(ఆంధ్రజ్యోతి): ప్రతిపక్ష నేతగా, ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత జగన్ గతంలో చేసిన వాఖ్యలు వర్గీకరణకు వ్యతిరేకంగా ఉన్నాయని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. అనంతపురం జిల్లా కేంద్రంలో ఎమ్మార్పీఎస్, ఎమ్మెస్పీ, అనుబంధ సంఘాల రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని శనివారం నిర్వహించారు. ముఖ్యఅతిథి మందకృష్ణ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ చేసి చంద్రబాబు దళితులను చీల్చారని సీఎంగా ఉన్నప్పుడు జగన్ అసెంబ్లీలో మాట్లాడారని గుర్తుచేశారు. సుప్రీంకోర్టు వద్దన్నా, రాజ్యాంగ విరుద్ధమని తెలిసినా వర్గీరణ అమలు చేశారని చంద్రబాబుపై ఆయన చేసిన అసత్య ఆరోపణలను మాదిగలు మరువకూడదన్నారు. సుప్రీంకోర్టులో వర్గీకరణ విచారణపై తెలంగాణ ప్రభుత్వం న్యాయవాదులను నియమించినా, ఏపీలోని వైసీపీ ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని, ఈ అంశంపై జగన్‌కు పలుమార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదని ఆరోపించారు. వర్గీకరణకు జగన్ మద్దతు లేదని అప్పట్లోనే తేలిపోయిందన్నారు. వర్గీకరణపై సుప్రీంకోర్టు తాజా తీర్పును దేశం మొత్తం స్వాగతించినా జగన్ మాత్రం ఒక్క ప్రకటన కూడా చేయలేదని, ఆయన మాలలవైపే ఉన్నారనడానికి ఇదే సాక్ష్యమని పేర్కొన్నారు. జగన్ వైఖరిని గమనించాలని కార్యకర్తలను మందకృష్ణ కోరారు. చంద్రబాబు మాదిగల వైపు ఉన్నారన్నారు. టీడీపీకి, ఆ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు తెలంగాణలో అండగా నిలిచామని చెప్పారు. ఎలాంటి అనుమానాలు లేకుండా కమిషన్ నివేదిక రావాలని కోరుకుంటున్నామని అన్నారు.
వర్గీకరణ కోసం ఎంతోమంది కార్యకర్తలు అసువులు బాశారని, వారి త్యాగఫలాలను అందుకోబోతున్న సందర్భంగా మార్చి 1న ఎమ్మార్పీఎస్ అమర వీరుల దినోత్సవాన్ని ఊరువాడా సంబరాలుగా నిర్వహించాలని మందకృష్ణ పిలుపునిచ్చారు. మరో ముఖ్యఅతిథి, ఎమ్మెల్యే ఎంఎస్ రాజు మాట్లాడుతూ, మందకృష్ణ మాదిగ నాయకత్వం... మాదిగల ఆత్మస్థైర్యం, అస్తిత్వం, ఆత్మగౌరమన్నారు. ఆయన 30ఏళ్ల నిజాయితీ, ఉద్యమ గౌరవానికి పద్మశ్రీ నిదర్శనమని పేర్కొన్నారు. వర్గీకరణ అమలు కోసం ప్రభుత్వానికి, మాదిగలకు వారధిగా కృషి చేస్తానని చెప్పారు. అణగారిన వర్గాల్లోని అట్టడుగు వర్గం నుంచి ఉదయించిన సూర్యుడని, ఆయన పద్మవిభూషణ్‌కు అర్హుడన్నారు. అనంతరం మందకృష్ణ మాదిగను గజమాలతో సత్కరించి, ‘పోరు దండోరా’ పుస్తకాన్ని ఆవిష్కరించారు.