Share News

Liquor Scam : విచ్చలవిడిగా వాడేశారు

ABN , Publish Date - Jun 23 , 2025 | 05:54 AM

సొంతలాభం కొంత మానుకుని జనం బాగుకోసం పాటుపడాలని గురజాడ వారు చెప్పారు కానీ.. వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి తీరు ఇందుకు పూర్తిగా రివర్స్‌ అధికారంలో ఉండగా. జనం సొమ్మును సొంతలాభానికి వాడుకున్నారు.

Liquor Scam : విచ్చలవిడిగా వాడేశారు

లిక్కర్‌ స్కామ్‌ కోసం ‘సర్కారు సంస్థల’ సృష్టి

జనం సొమ్ములు చెల్లించి.. సొంత జేబులు నింపుకొని..

  • మద్యం స్కామ్‌లో కళ్లు తిరిగే నిజాలు

  • ఫీల్డ్‌ మానిటరింగ్‌,క్యాష్‌ మేనేజ్‌మెంట్‌ ఏజెన్సీలు సొంత బ్రాండ్ల విక్రయం,

  • నగదు నిర్వహణ బాధ్యతలు

  • రెండింటి కాంట్రాక్టు రాజ్‌ కసిరెడ్డికే

  • సచివాలయాలపై పర్యవేక్షణకు ఎఫ్‌ఏవో

  • దానిని నిర్వహించింది అస్మదీయ కంపెనీయే

  • విశాఖలో వంద మందితో కాల్‌ సెంటర్‌

  • మద్యం విక్రయాల సమాచార సేకరణ

  • ప్రభుత్వం నుంచి వందల కోట్లు చెల్లింపు

  • వాటి సేవలు మాత్రం ‘లిక్కర్‌ స్కామ్‌’కు

సొంతలాభం కొంత మానుకుని జనం బాగుకోసం పాటుపడాలని గురజాడ వారు చెప్పారు!కానీ... వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి తీరు ఇందుకు పూర్తిగా ‘రివర్స్‌’! అధికారంలో ఉండగా... జనం సొమ్మును సొంతలాభానికి వాడుకున్నారు. వలంటీర్లు, గ్రామ సచివాలయాల సిబ్బందికి శిక్షణ, పర్యవేక్షణ పేరుతో ఏర్పాటు చేసిన ‘ఫీల్డ్‌ ఆపరేటింగ్‌ ఏజెన్సీ’ని సైతం మద్యం స్కామ్‌ కోసం ఉపయోగించుకున్నట్లు తాజాగా స్పష్టమైంది. మద్యం విధానాన్ని మార్చేసి... ముడుపుల ‘ప్రవాహం’ సక్రమంగా సాగేందుకు ఫీల్డ్‌ మానిటరింగ్‌ ప్రాజెక్టు, క్యాష్‌ మేనేజ్‌మెంట్‌ సర్వీసెస్‌ అనే సంస్థలను ఏర్పాటు చేశారు. వాటికి కూడా ప్రభుత్వ సొమ్ములే చెల్లించారు.


మద్యం వ్యాపారం, వ్యవహారాలు చూసుకునేందుకు ప్రత్యేకంగా ఒక శాఖే ఉంది. కానీ... అప్పట్లో ఎక్సైజ్‌ శాఖను పక్కనపెట్టేసి ఫీల్డ్‌ మానిటరింగ్‌ ప్రాజెక్టు, క్యాష్‌ మేనేజ్‌మెంట్‌ సర్వీస్‌ అనే ప్రత్యేక వ్యవస్థలను ఏర్పాటు చేశారు. ఈ రెండింటినీ నిర్వహించింది జగన్‌ అస్మదీయులే! తమకు కావాల్సిన బ్రాండ్లను మాత్రమే ప్రభుత్వ మద్యం దుకాణాల్లో ప్రమోట్‌ చేసేందుకు ఫీల్డ్‌ మానిటర్లను వాడుకున్నారు. ‘క్యాష్‌ పికప్‌ ఎగ్జిక్యూటివ్‌’ల ద్వారా నగదు రవాణా చేయించారు. జగన్‌ జమానాలో... లిక్కర్‌ షాపుల్లో డిజిటల్‌ పేమెంట్లు అనుమతించని సంగతి గుర్తుండే ఉంటుంది. గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది పర్యవేక్షణ, పరిశీలన, శిక్షణ కోసం ‘ఫీల్డ్‌ ఆపరేటింగ్‌ ఏజెన్సీ’ని ఏర్పాటు చేశారు. దీనికోసం విశాఖలో వందమందితో కాల్‌ సెంటర్‌ పెట్టారు. సచివాలయాలకు ఈ సంస్థ చేసిన సేవ ఏమిటో తెలియదుకానీ... కాల్‌ సెంటర్‌ ద్వారా మద్యం సేల్స్‌ సమాచారాన్ని సేకరించడం నిజం.


ఫీల్డ్‌ మానిటరింగ్‌ ప్రాజెక్టు, క్యాష్‌ మేనేజ్‌మెంట్‌ సర్వీస్‌, ఫీల్డ్‌ ఆపరేటింగ్‌ ఏజెన్సీ ఈ మూడింటినీ ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ‘యూనీ’ నిర్వహించింది. ఇది... రాజ్‌ కసిరెడ్డి, కిరణ్‌ కుమార్‌ రెడ్డి ఏర్పాటు చేసినదే అని తెలుస్తోంది. ఫీల్డ్‌ ఆపరేటింగ్‌ ఏజెన్సీకి నాలుగేళ్లలో రూ.274 కోట్లు చెల్లించారు. మరి ప్రభుత్వ మద్యం వ్యాపారంలో ఫీల్డ్‌ మానిటరింగ్‌ ప్రాజెక్టు చేపట్టిన కంపెనీకి ఎన్ని వందల కోట్లు చెల్లించారు. కేవలం క్యాష్‌మేనేజ్‌మెంట్‌ సర్వీసెస్‌ చేసిన యూని కార్పొరేట్‌ సొల్యూషన్స్‌కు ఎన్ని కోట్లు చెల్లించారు? అనేది విచారణలో తేలాల్సిందే. రాజ్‌ కసిరెడ్డికి కిరణ్‌ కుమార్‌ రెడ్డి సన్నిహితుడు. కిరణ్‌ కుమార్‌ రెడ్డి... ప్రణయ్‌ ప్రకాశ్‌ స్నేహితుడు. ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించాలని కోరగా... ‘ప్రభుత్వ ప్రాజెక్టు’లో కొలువు ఉందంటూ ‘ఫీల్డ్‌ మానిటరింగ్‌ ప్రాజెక్టు’లో చేర్చారు. ఆయన ద్వారా ఫీల్డ్‌ మానిటర్లను అపాయింట్‌ చేయించారు. హైదరాబాద్‌లోని రాజ్‌ కసిరెడ్డి ఆఫీసు నుంచి ప్రణయ్‌ రెండు నెలలు పని చేశారు. ఆ తర్వాత... విశాఖలోని ఎఫ్‌వోఏ కాల్‌సెంటర్‌ బాధ్యతలు నిర్వహించారు. చివరగా... తాడేపల్లి సమీపంలో ఒక ఫ్లాట్‌ అద్దెకు తీసుకుని ముడుపుల స్వీకరణ, బట్వాడా పనులు చూశారు.


మద్యంలో ముడుపులు కొల్లగొట్టేందుకు వైసీపీ హయాంలో అనుసరించిన ‘వినూత్న’ విధానాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. వసూళ్లను పర్యవేక్షించేందుకు ఏకంగా ప్రభుత్వం తరఫునే ఏజెన్సీలు ఏర్పాటు చేసినట్లు వెల్లడైంది. జగన్‌ అధికారంలో ఉండగా... ప్రైవేటు మద్యం దుకాణాలను ఎత్తివేసి, ప్రభుత్వ మద్యం దుకాణాలను తెరిచిన సంగతి తెలిసిందే. దీని వెనుక వేలకోట్ల స్కామ్‌ ఉందని అప్పుడు ఎవరూ ఊహించలేకపోయారు. ప్రభుత్వ ప్రాజెక్టుల పేరిట ఏర్పాటైన ఏజెన్సీలనూ ఈ స్కామ్‌కోసం వాడుకున్నారు. ప్రభుత్వ మద్యం దుకాణాల నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన ఫీల్డ్‌ మానిటరింగ్‌ ఏజెన్సీ, క్యాష్‌ మేనేజ్‌మెంట్‌ సర్వీసె్‌సతోపాటు... సచివాలయ సిబ్బందికి శిక్షణ ఇచ్చేందుకు అంటూ ఏర్పాటు చేసిన ‘ఫీల్డ్‌ ఆపరేటింగ్‌ ఏజెన్సీ’ (ఎఫ్‌ఓఏ)ని సైతం ఉపయోగించుకున్న విధానం ఇప్పుడు బయటపడింది.


బరితెగింపు..

‘‘జగన్‌ ప్రభుత్వంలో లిక్కర్‌ అమ్మకాల కోసం ఫీల్డ్‌ మానిటరింగ్‌ ప్రాజెక్టు ఏర్పాటు చేశారు. దీని కాంట్రాక్టును విజువల్‌ ఐటీ సొల్యూషన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ దక్కించుకుంది. ఆ తర్వాత యూని కార్పొరేట్‌ సొల్యూషన్స్‌కు సబ్‌ కాంట్రాక్ట్‌ ఇచ్చారు. వైజాగ్‌లోని ఫీల్డ్‌ ఆపరేటింగ్‌ ఏజెన్సీ కాల్‌సెంటర్‌లో వందమంది పనిచేసేవారు. వారి ద్వారా మద్యం అమ్మకాల డేటా తీసుకునేవాళ్లం. ఆ సమాచారం ఆధారంగా రాజ్‌ కసిరెడ్డి తదుపరి చర్యలు తీసుకునేవారు’’ అని ఈ కేసులో ప్రణయ్‌ ప్రకాశ్‌ వాంగ్మూలం ఇచ్చారు. ఇదేదో పోలీసులు భయపెట్టి తమ ముందు ఇప్పించుకున్న వాంగ్మూలం కాదు. ప్రణయ్‌ స్వయంగా మేజిస్ట్రేట్‌ ముందు ఇచ్చిన లిఖితపూర్వక వాంగ్మూలమిది! ప్రభుత్వ వ్యవస్థలను సొంత లాభానికి ఎంత నిర్లజ్జగా వాడుకున్నారనేందుకు ఇదొక నిదర్శనం. అప్పట్లో డిస్టిలరీల నుంచి ముడుపులు దండుకునేలా క్షేత్రస్థాయిలో నిర్వహణ, పర్యవేక్షణ సంస్థలను ఏర్పాటు చేశారు.


వాటికి ‘ఎఫ్‌ఓఏ’ వంటి ప్రభుత్వ సంస్థల ముసుగు తొడిగారు. వాటి కాంట్రాక్టులు కూడా అస్మదీయులకే అప్పగించారు. అందులోని సిబ్బందిని తమ సొంత ‘గ్రౌండ్‌ ఫోర్స్‌’గా వాడుకున్నారు. ఎఫ్‌వోఏ పేరుతో ‘ఐప్యాక్‌’ ప్రతినిధులకు జనం సొమ్ము జీతాలు ఇస్తున్నారని, ఈ వ్యవస్థను రాజకీయ అవసరాలకు వాడుతున్నారని ‘ఆంధ్రజ్యోతి’ గతంలోనే వెల్లడించింది. ‘అంతకుమించి’... లిక్కర్‌ స్కామ్‌కూ దీనిని ఉపయోగించుకున్నారని ఇప్పుడు స్పష్టమైంది.


ముసుగు సంస్థ ఎఫ్‌వోఏ

254.jpg

గ్రామ, వార్డు సచివాలయల సిబ్బందికి శిక్షణ, పర్యవేక్షణ, సమన్వయం అనే బాధ్యతను ఫీల్డ్‌ ఆపరేటింగ్‌ ఏజెన్సీ(ఎ్‌ఫవోఏ)కి ఇచ్చారు. ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకోకముందే, స్పష్టమైన ఆదేశాలు ఇవ్వకముందే రామ్‌ ఇన్ఫోటెక్‌కు ఎఫ్‌వోఏ కాంట్రాక్టును ఇచ్చేశారు. ఆ సంస్థ... మరో రెండు కంపెనీలను కలుపుకొని కన్షార్షియంగా ఏర్పడింది. సాధారణంగా ఒక సంస్థను ఒక ప్రయోజనం కోసం ఎంపిక చేస్తే... ఒకటి లేదా రెండేళ్లు మాత్రమే కాంట్రాక్టు ఇస్తారు. ఆ తర్వాత పనితీరు, ఫలితాలు, అవసరాన్ని బట్టి పొడిగిస్తారు. కానీ... రామ్‌ ఇన్ఫోటెక్‌ నాలుగేళ్లపాటు సేవలు అందిస్తుందని 2021 మే 31న జారీ చేసిన జీవో 13లో స్పష్టం చేశారు. అంటే, జగన్‌ ప్రభుత్వం ఉన్నంతకాలం ఈ కంపెనీ సేవలు కొనసాగేలా స్కెచ్‌ గీశారన్నమాట. నిజానికి 2020కి ముందే రామ్‌ ఇన్ఫోకు పని అప్పగించినప్పటికీ... ఆ తర్వాత నింపాదిగా అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కంపెనీకి ఏటా రూ.68.62 కోట్లు చెల్లించారు. వీరికి గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి శిక్షణ, పర్యవేక్షణ, సమన్వయం కాంట్రాక్టు ఇవ్వగా... చెల్లింపులు మాత్రం ‘వలంటీర్లకు శిక్షణ’ పేరిట జరిపారు. అన్నికోట్లు తీసుకున్న రామ్‌ ఇన్ఫోటెక్‌... వలంటీర్లకు శిక్షణ ఇచ్చిందా? అంటే... లేనే లేదు! మరి రామ్‌ ఇన్ఫో అసలేం చేసింది? ఈ ప్రశ్నకు ఇప్పుడు జవాబు తెలిసింది. అసలు విషయం ఏమిటంటే... తెరమీద పేరుకు ‘రామ్‌ ఇన్ఫోటెక్‌’ ఉన్నప్పటికీ, ఆ తర్వాత యూనీ కార్పొరేట్‌ సొల్యూషన్స్‌ ద్వారానే నడిపించారు.


ఎఫ్‌ఓఏ చేసిందేమిటంటే..

మద్యం కుంభకోణంలో అవినీతి తీగలను లాగడంతో ఫీల్డ్‌ ఆపరేటింగ్‌ ఏజెన్సీ డొంక కూడా కదిలింది. దాని పుట్టు పూర్వోత్తరాలు, మద్యం కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న రాజ్‌ కసిరెడ్డి, కిరణ్‌ కుమార్‌ రెడ్డిలతో ఉన్న సంబంధాలు బయటకొస్తున్నాయి. ప్రణయ్‌ ప్రకాశ్‌ ఇచ్చిన వాంగ్మూలం పరిశీలిస్తే... స్కామ్‌ సొమ్ములు నిర్వహించిన ‘గ్రౌండ్‌ ఫోర్స్‌’ ఎఫ్‌వోఏనే అనే అనుమానాలు బలపడుతున్నాయి. ఆయన తెలిపిన ప్రకారం... మద్యం అమ్మకాల పర్యవేక్షణకు ఫీల్డ్‌ మానిటరింగ్‌ ప్రాజెక్టును ఏర్పాటు చేశారు. దీని కాంట్రాక్ట్‌ విజువల్‌ ఐటీ సొల్యూషన్స్‌ అనే కంపెనీకి అప్పగించారు. ఆ తర్వాత యూని కార్పొరేట్‌ సొల్యుషన్స్‌కు సబ్‌కాంట్రాక్ట్‌ ఇచ్చారు. ప్రభుత్వంలో ఏదైనా ఉద్యోగం ఇప్పించాలని కోరిన ప్రణయ్‌ ప్రకాశ్‌ను... కిరణ్‌ కుమార్‌ రెడ్డి ఫీల్డ్‌ మానిటరింగ్‌ ప్రాజెక్టులో చేర్చారు. అందులో... ‘ఫీల్డ్‌ మానిటర్స్‌’ను నియమించాలని చెప్పారు. ప్రభుత్వ మద్యం దుకాణాల్లో తాము అనుకున్న బ్రాండ్లు మాత్రమే అమ్మేలా చూడటమే ‘ఫీల్డ్‌ మానిటర్స్‌’ డ్యూటీ! ప్రణయ్‌తోపాటు సైఫ్‌ (డేటా ఎంట్రీ ఆపరేటర్‌) కూడా ఫీల్డ్‌ మానిటరింగ్‌ చూసుకునే వారు. మద్యం అమ్మకాలపై ఫీల్డ్‌ మానిటర్స్‌ ఇచ్చిన సమాచారాన్ని ప్రణయ్‌ క్రోడీకరించి... ఎక్సైజ్‌ అధికారి సత్యప్రసాద్‌కు పంపించేవారు.


ఆ తర్వాత... ప్రణయ్‌ ప్రకాశ్‌ను కిరణ్‌ కుమార్‌ రెడ్డి ఎఫ్‌వోఏకు మార్చారు. ‘‘విశాఖలో 100 మందితో ఎఫ్‌వోఏ కాల్‌ సెంటర్‌ నడిచేది. అక్కడి నుంచి వలంటీర్లకు ఫోన్‌చేసి డేటా కలెక్ట్‌ చేసేవారు’’ అని ప్రణయ్‌ ప్రకాశ్‌ తన వాంగ్మూలంలో పేర్కొన్నారు. ఆ తర్వాత అదే ప్రణయ్‌ ప్రకాశ్‌ను తాడేపల్లికి పంపించారు. అక్కడ ఒక ఫ్లాటు అద్దెకు తీసుకుని ముడుపుల సొమ్ములు అందుకోవడం, వాటిని చాణక్య చెప్పినట్లుగా చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి మనుషులకు అప్పగించడం చేశారు. ప్రణయ్‌ చెప్పిన కంపెనీల లింకులను పరిశీలిస్తే... ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎఫ్‌వోఏను మద్యం స్కామ్‌కోసం వాడుకున్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. ఫీల్డ్‌ ఆపరేటింగ్‌ ఏజెన్సీ పేరిట రామ్‌ ఇన్ఫోటెక్‌కు... ఫీల్డ్‌ మానిటరింగ్‌ ప్రాజెక్టు, క్యాష్‌ మేనేజ్‌మెంట్‌ సర్వీ్‌సల పేరిట యూని కార్పొరేట్‌ సొల్యూషన్స్‌కు వందల కోట్లు చెల్లించారు. నిజానికి... ఆ సంస్థలు చేసిన పని లిక్కర్‌ స్కామ్‌ను దగ్గరుండి పర్యవేక్షించడం, అందులోని సిబ్బందిని ఉపయోగించుకొని ముడుపుల సొమ్మును మేనేజ్‌ చేయడం! ఇదీ... జగన్‌ హయాంలో జరిగిన ఘోరం.


బయటపడ్డ దుబాయి లింకులు

జగన్‌ అధికారంలో ఉండగా ‘వసూల్‌ రాజా’ పేరు మార్మోగింది. ప్రభుత్వ, ప్రైవేటు పనులు, పోస్టింగ్‌లు, భూ వివాదాలు, గనులు, పరిశ్రమలకు రాయితీలు ఇలా అన్నింట్లో చక్రం తిప్పి వందల కోట్లు దండుకున్నారని నాడు అధికారవర్గాల్లో హాట్‌టాపిక్‌. దోచుకున్న సొమ్మును దుబాయిలో పెట్టుబడి పెట్టారని, అమెరికాలో షిప్పింగ్‌ కంపెనీని కొనుగోలు చేశారని ప్రచారం జరిగింది. అధికారులు, ఉద్యోగులు వారాంతంలో హైదరాబాద్‌ వెళ్లినట్లుగా వసూల్‌రాజా, మరి కొందరు క్రమం తప్పకుండా దుబాయికి వెళ్లి వచ్చేవారు. వారికి అక్కడ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం ఉందని, లాటిన్‌ అమెరికా, ఆఫ్రికా దేశాల్లో మైనింగ్‌ వ్యాపారం ఉందని అప్పట్లో పెద్ద ప్రచారం జరిగింది. అయితే, మద్యం కుంభకోణం లింకులను ఆరాతీస్తే... ఈ కేసులో ఉన్నవారి షెల్టర్‌జోన్‌ దుబాయి అని తేలింది. అక్కడే అనేక విషయాలు మాట్లాడుకొని ఆంధ్రాలో అమలు చేసేవారని తాజాగా బయటపడింది.

Updated Date - Jun 23 , 2025 | 05:54 AM