liquor scam: లిక్కర్ సొమ్ము 30 కోట్లు సీజ్
ABN , Publish Date - Jul 01 , 2025 | 03:33 AM
దేశంలోనే అతిపెద్ద మద్యం కుంభకోణంలో ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ అత్యంత కీలక ముందడుగు వేసింది. వైసీపీ పాలనలో వేల కోట్లు ప్రజల నుంచి దోచుకుని వాటాలు పంచుకున్న లిక్కర్ మాఫియాకు గట్టి షాక్ ఇచ్చింది.

బ్యాంకు ఖాతాల్లోని నగదు స్తంభన
రాజ్ కసిరెడ్డి ‘ఆదాన్’ అకౌంట్లో 16.12 కోట్లు
గరికపాడు వద్ద పట్టుబడ్డ 8.37 కోట్ల నగదు
ఎస్‌ఎన్‌జే షుగర్స్ ఖాతాలో 5 కోట్లు
ఎంపీ డిస్టిలరీస్ నుంచి 50 లక్షలు
అమరావతి, జూన్ 30(ఆంధ్రజ్యోతి): దేశంలోనే అతిపెద్ద మద్యం కుంభకోణంలో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) అత్యంత కీలక ముందడుగు వేసింది. వైసీపీ పాలనలో వేల కోట్లు ప్రజల నుంచి దోచుకుని వాటాలు పంచుకున్న లిక్కర్ మాఫియాకు గట్టి షాక్ ఇచ్చింది. నిందితులకు చెందిన 29,99,05,244 రూపాయలను జప్తు చేసింది. ప్రభుత్వాన్ని సీఐడీ కోరడంతో జప్తునకు అనుమతిస్తూ సోమవారం హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. లిక్కర్ స్కామ్‌లో కర్త, కర్మ, క్రియగా భావిస్తున్న రాజ్ కసిరెడ్డి(ఏ-1)కి చెందిన ఆదాన్ డిస్టిలరీస్ బ్యాంకు ఖాతా నుంచి 16.12 కోట్ల రూపాయలను సిట్ సీజ్ చేసింది. సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులు ఓట్లు కొనేందుకు తరలిస్తున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచరుల నుంచి కృష్ణా జిల్లా సరిహద్దుల్లోని గరికపాడు చెక్‌పోస్టు వద్ద పోలీసులు సీజ్ చేసిన 8.37 కోట్ల రూపాయలు(బెజవాడ ట్రెజరీలో ఉంది) సైతం జప్తు చేసింది.
జగన్ పాలనలో మద్యం సరఫరాలో కీలకంగా వ్యవహరించి, ఆ తర్వాత రాజ్ కసిరెడ్డికి గోవాలో డిస్టిలరీ(లీలా బేవరేజె్‌స)ని తప్పక వదులుకున్న ఎస్‌ఎన్‌జే షుగర్స్ అండ్ ప్రాడక్ట్స్‌కు చెందిన చెన్నైలోని బ్యాంకు అకౌంట్ నుంచి 5 కోట్ల రూపాయలు, ఎంపీ డిస్టిలరీస్ బ్యాంకు అకౌంట్ నుంచి 50 లక్షలు విత్ డ్రాకు అవకాశం లేకుండా చేసింది. గరికపాడు చెక్ పోస్టు వద్ద ఎన్నికల సమయంలో పట్టుబడ్డ సొమ్మును చెవిరెడ్డి పంపిన వ్యక్తులు రాజ్ కసిరెడ్డి నుంచి తాడేపల్లికి తీసుకొస్తున్నట్లు సిట్ ఆధారాలు సేకరించింది. రాజ్ కసిరెడ్డికి చెందిన ఆదాన్ డిస్టిలరీ్‌సకు ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి 800 కోట్లు జమైంది. అందులో హైదరాబాద్‌లోని మాదాపూర్‌లోని ఒక బ్యాంకులో 16.12 కోట్లు ఉన్నట్టు దర్యాప్తు అధికారులు గుర్తించారు. మరోవైపు మద్యం ఆర్డర్ల కోసం ఎస్‌ఎన్‌జే షుగర్స్ అండ్ ప్రాడక్ట్స్ నుంచి లిక్కర్ మాఫియా నగదు అడగ్గా.. అజ్ఞాత ఖాతాల్లోకి ఐదు కోట్లు పంపించింది. ఎంపీ డిస్టిలరీస్ కూడా అదే బాటలో నడిచి అడ్డంగా బుక్కైంది.