Exposing Liquor Overcharging and MRP Violations: మద్యం అమ్మకాల్లో దోచేస్తున్నారు
ABN , Publish Date - Mar 25 , 2025 | 04:19 AM
ఆర్టీజీఎస్ సర్వే ప్రకారం, 87.21% మంది వినియోగదారులు మద్యం అమ్మకాలలో ఎమ్మార్పీ ఉల్లంఘనలు జరగడంతో అధిక ధరలు చెల్లించాల్సి వస్తున్నట్లు పేర్కొన్నారు. అమ్మకాల టార్గెట్లు విధించడం వల్ల బెల్టు షాపులకు మద్యం సరఫరా పెరిగి, వినియోగదారులకు అదనపు ఛార్జీలు వేయడం జరిగింది. ఎక్సైజ్ శాఖ కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది.

ఒక్కో బాటిల్‌పై రూ.10-30 వరకూ వసూలు
విచ్చలవిడిగా బెల్టులకు మద్యం సరఫరా
అమ్మకాలపై టార్గెట్లతో పట్టించుకోని ఎక్సైజ్ శాఖ
ఆర్టీజీఎస్ సర్వేలో.. ఎమ్మార్పీ ఉల్లంఘనలు ఉన్నాయన్న 87.21శాతం మంది
అమరావతి, మార్చి 24(ఆంధ్రజ్యోతి): మద్యం అమ్మకాల్లో ఎమ్మార్పీని పాటించడం లేదు. ఒక్కో సీసాపై రూ.10 నుంచి రూ.30 అదనంగా వసూలు చేస్తూ.. వినియోగదారులను దోచేస్తున్నారు. ప్రభుత్వం నిర్వహించిన ఆర్టీజీఎస్ సర్వేలో ఈ విషయం బహిర్గతమైంది. వాట్సాప్, ఐవీఆర్‌ఎస్, ఇతర మార్గాల్లో ప్రభుత్వం ప్రజల నుంచి అభిప్రాయాలు స్వీకరించింది. ‘మీ ప్రాంతంలో రిటైల్ మద్యం దుకాణాల్లో ఎమ్మార్పీ ఉల్లంఘనలు జరుగుతున్నాయా?’ అని అడిగిన ప్రశ్నకు 11,635 మంది (87.21శాతం) అవును అని సమాధానం ఇచ్చారు. కేవలం 1,707 మంది (12.79శాతం) మాత్రమే ఉల్లంఘనలు లేవని చెప్పారు. ఆర్టీజీఎ్‌సపై సోమవారం చీఫ్ సెక్రటరీ సమీక్షలో ఈ విషయం వెలుగు చూసింది. మద్యం వినియోగంపై ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకోవాలని గతంలో సీఎం చంద్రబాబు చేసిన సూచన మేరకు ఈ అభిప్రాయ సేకరణ జరిగింది. సర్వే వివరాలను ఆర్టీజీఎస్ బయటపెట్టింది.
‘మద్యం నాణ్యత పెరిగిందా?’ అనే ప్రశ్నకు 98.12 శాతం మంది అవును అని, 1.88 శాతం మంది లేదు అని సమాధానం ఇచ్చారు. ‘పాపులర్ మద్యం బ్రాండ్లు అందుబాటులో ఉన్నాయా?’ అనే ప్రశ్నకు 98.77శాతం మంది అవును అని, 1.23 శాతం మంది లేవు అని చెప్పారు. ‘మద్యం ధరలు తగ్గాయా?’ అనే ప్రశ్నకు 95.67 శాతం మంది అవును అని, 4.33 శాతం మంది లేదు అని సమాధానమిచ్చారు. కాగా ఎక్సైజ్ శాఖలో అంతా బాగుందని, ఎక్కడా ఉల్లంఘనలు లేవని ఆ శాఖ అధికారులు చెబుతూ వస్తున్నారు. ఇప్పుడు మరో శాఖ సర్వే చేస్తే అసలు విషయం బయటపడింది.
అమ్మకాలకు టార్గెట్లతోనే సమస్య
రోజూ రూ.80కోట్ల మేర అమ్మకాలు ఉండాలని ఎక్సైజ్ ఉన్నతాధికారులు టార్గెట్లు విధించినట్లు తెలిసింది. దీంతో మద్యం షాపుల్లో అమ్మకాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయి. ఒక వ్యక్తికి మూడు కంటే ఎక్కువ సీసాలు అమ్మకూడదనే నిబంధన ఉన్నప్పటికీ బెల్టులకు ఇష్టానుసారంగా కేసుల చొప్పున అమ్ముతున్నారు. వీటికి ఒక్కో సీసాపై రూ.10 వసూలు చేస్తున్నారు. వాటిని బెల్టుల్లో విక్రయించేవారు సీసాపై రూ.30 వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. అమ్మకాలపై టార్గెట్లు విధించడంతో బెల్టులకు మద్యం విక్రయిస్తున్నా స్థానిక ఎక్సైజ్ అధికారులు చూసీచూడనట్లు వదిలేస్తున్నారు. బెల్టు షాపులపై కఠిన చర్యలు తీసుకోలేని పరిస్థితి ఏర్పడింది.
పని వేళలు పాటించని బార్లు
నిబంధనల ప్రకారం ఉదయం 11 నుంచి రాత్రి 11 గంటల వరకే బార్లు పని చేయాలి. కానీ చాలా బార్లు 24గంటలూ మద్యం విక్రయాలు చేస్తున్నాయి. అధికారిక సమయంలో బహిరంగంగా, ఆతర్వాత చాటుమాటుగా అమ్ముతున్నాయి. పైగా షాపుల నుంచి మద్యం తీసుకొచ్చి బార్లలో విక్రయిస్తున్నారు. ప్రభుత్వం నుంచి మద్యం కొనుగోలు చేయాలంటే షాపులతో పోలిస్తే 10 శాతం అదనంగా చెల్లించాలి. దీంతో బెల్టుల తరహాలో షాపుల్లో మద్యం కొని, దానిని అర్థరాత్రి, ఉదయం వేళల్లో బార్లలో విక్రయిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
YCP: భయం గుప్పెట్లో.. విశాఖ వైసీపీ
Mayor Suresh Babu: కడప గడ్డపై వైసీపీ షాక్
For National News And Telugu News