AP Liquor Scam: తాగుడు పెంచింది జగనే..
ABN , Publish Date - Jul 24 , 2025 | 03:19 AM
రాష్ట్రంలో దశలవారీగా మద్య నిషేధం చేస్తామని ప్రకటించి 2019లో జగన్ అధికారంలోకి వచ్చారు.

కమీషన్లు నొక్కేయడానికే పన్నుల వ్యూహం
షాక్ కొట్టేలా రేట్లు పెడతానంటూ అధికారంలోకి
కానీ, మడమతిప్పి చివరికి మహిళలకే షాక్
మద్య నిషేధం పేరిట తొలుత పన్నుల పెంపు
ఫలితంగా ఆకాశాన్ని తాకిన మందు రేట్లు
2020-21లో భారీగా పడిపోయిన అమ్మకాలు
అమ్మకాలతోపాటు కమీషన్లూ తగ్గిన వైనం
ఉలిక్కిపడి వెంటనే మద్యంపై పన్నులు తగ్గింపు
తిరిగి జోరందుకున్న అమ్మకాలూ.. కమీషన్లూ
లిక్కర్ స్కాంపై సిట్ చార్జిషీట్‌లో బయటపడ్డ కుట్ర
(అమరావతి - ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో దశలవారీగా మద్య నిషేధం చేస్తామని ప్రకటించి 2019లో జగన్ అధికారంలోకి వచ్చారు. కానీ, పదవిలో ఉన్న ఐదేళ్లూ మద్యంపై భారీగా కమీషన్లు పట్టడంపైనే వైసీపీ అధినేత దృష్టి పెట్టారు. అందుకు అనుగుణంగానే పన్నుల వ్యూహరచన చేశారని మద్యం స్కామ్‌ను విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) తన చార్జిషీట్‌లో వెల్లడించింది. అధికారంలోకి వచ్చిన కొత్తలో జగన్ ఒకసారి పన్నులు పెంచారు. 2019 సెప్టెంబరులో జీవో 422 ద్వారా అదనపు రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్(ఏఆర్‌ఈటీ) అనే కొత్త పన్నును మద్యంపై విధించారు. ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్, ఫారిన్ లిక్కర్‌పై ఈ పన్ను వేశారు. 2020 మేలో ఏఆర్‌ఈటీని ఇంకా పెంచారు.
ఫలితంగా మద్యం రేట్లు పెరిగాయి. అమ్మకాలు భారీగా పడిపోయాయి. 2020-21లో అమ్మకాలు దాదాపుగా సగానికి సగం పడిపోయాయి. దీంతో నిజంగానే జగన్ మద్య నిషేధం చేసేస్తారని మహిళలు ఆశ పడ్డారు. కానీ కొంతకాలానికే జగన్ మాట తప్పి, పెంచిన ధరలను అందరూ తాగేలా తగ్గించేశారు. తద్వారా సంపూర్ణ మద్యపాన నిషేధం చేయకపోవడం సంగతి అటుంచితే, తగ్గిపోయిన మద్యం అమ్మకాలు పెంచేశారు. నిజంగా మద్యం నిషేధం లేదా నియంత్రణ చేయాలనే ఉద్దేశమే ఉంటే పడిపోయిన అమ్మకాలు మళ్లీ ఎలా పెరిగాయి? పెంచిన మందు రేట్లను ఎందుకు తగ్గించారు? అంటే కేవలం కమీషన్ల కోసమే ఈ స్థాయిలో అమ్మకాలు పెంచినట్లు స్పష్టమవుతోంది. ఇలా మద్యం రేట్లు, పెంచి తగ్గించడం వెనుక అసలు కుట్ర కోణం కమీషన్లేనని సిట్ తన చార్జిషీట్‌లో పేర్కొంది.
ఇలా దించేశారు..: తొలుత పన్నులు పెంచిన జగన్ సర్కారు.. అనంతర కాలంలో విరుద్ధమైన నిర్ణయం తీసుకుంది. ఏఆర్‌ఈటీ పన్ను భారీగా పెంచడం వల్ల లిక్కర్ అమ్మకాలు పడిపోయాయి. దాదాపు రెట్టింపు ధరలతో మద్యం కొనుగోలు చేయలేక మందుబాబులు మద్యం తాగే విషయంలో కొంతమేర వెనక్కి తగ్గారు. 2019-20లో 5.2కోట్ల కేసుల లిక్కర్ అమ్ముడైతే, పన్నులు పెంచడంతో 2020-21లో అమ్మకాలు 2.43కోట్ల కేసులకు పడిపోయాయి. అమ్మకాలు బాగుంటే మద్యంపై కమీషన్లు వస్తాయి. కానీ అమ్మకాలు తగ్గిపోయిన కారణంగా కమీషన్లూ తగ్గాయి. దీంతో ఉలిక్కిపడిన తాడేపల్లి శిబిరం వెంటనే అమ్మకాలు పెంచేందుకు పన్నులు తగ్గించేసింది. 2020 సెప్టెంబరులో జీవో 256 జారీచేసి ఏఆర్‌ఈటీని భారీగా తగ్గించారు. అది కూడా లిక్కర్ మార్కెట్‌లో ఎక్కువగా అమ్ముడుపోయే క్వార్టర్ రూ.150 వరకు ధరలున్న బ్రాండ్ల ధరలనే తగ్గించారు. అవి తాగే పేదలు మళ్లీ తాగుడు పెంచారు. దీంతో 2023-24 నాటికి 4.63 కోట్ల కేసులకు మద్యం అమ్మకాలు పెరిగిపోయాయి.
విరుద్ధ నిర్ణయం అందుకే..
వైసీపీ ప్రభుత్వం తాను తీసుకున్న నిర్ణయానికి విరుద్ధంగా మరో నిర్ణయం తీసుకోవడాన్ని చార్జిషీట్‌లో సిట్ కీలకంగా ప్రస్తావించింది. ‘పన్నులపై తొలుత ఇచ్చిన జీవో వల్ల అమ్మకాలు తగ్గాయి. కానీ ఆ తర్వాత తెచ్చిన జీవో పూర్తి వ్యతిరేక దిశలో ఉండి, అమ్మకాలను పెంచింది. కమీషన్ల కోసం నాలుగు నెలల్లోనే పెంచిన పన్నులను తగ్గించేశారు’ అని సిట్ స్పష్టంచేసింది. మళ్లీ రెండు నెలలకు మీడియం, ప్రీమియం బ్రాండ్ల ధరలు కూడా తగ్గేలా ఏఆర్‌ఈటీని ఇంకా తగ్గిస్తూ మరో జీవో 312ను జారీచేశారు. వ్యాట్, స్పెషల్ మార్జిన్, అదనపు ఎక్సైజ్ డ్యూటీని కూడా సవరించారు. నిజంగా మద్యం అమ్మకాలు తగ్గించడమే అసలు ఉద్దేశం అయితే పెంచిన పన్నులను అలాగే కొనసాగించాలి. కానీ షాక్ కొట్టేలా భారీగా పెంచిన పన్నులను నెలల వ్యవధిలోనే భారీగా తగ్గించారని సిట్ తెలిపింది.
దోసకాయను ఉప్పుతో తింటున్నారా? ఈ ముఖ్య విషయం తెలుసుకోండి.!
శరీరంలో కనిపించే ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి.. లేదంటే..!