Share News

పల్లెల్లో సంక్రాంతి సంబరాలు

ABN , Publish Date - Jan 16 , 2025 | 12:42 AM

నంద్యాల ఆత్మకూరు బస్టాండు సమీపంలో వెలసిన సోమనందీశ్వరాలయంలో ఆలయశాశ్వత ధర్మకర్త బిల్లుపాటి వెంకట శంకరయ్య, అర్చకుల ఆధ్వర్యంలో సోమనందీశ్వర స్వామి కల్యాణం నిర్వహించారు.

పల్లెల్లో సంక్రాంతి సంబరాలు
మహానందిలో పార్వేట ఉత్సవాన్ని నిర్వహిస్తున్న వేదపండితులు

నంద్యాల కల్చరల్‌, జనవరి 15 (ఆంధ్రజ్యోతి): నంద్యాల ఆత్మకూరు బస్టాండు సమీపంలో వెలసిన సోమనందీశ్వరాలయంలో ఆలయ శాశ్వత ధర్మకర్త బిల్లుపాటి వెంకట శంకరయ్య, అర్చకుల ఆధ్వర్యంలో సోమనందీశ్వర స్వామి కల్యాణం నిర్వహించారు. బుధవారం కనుమ సందర్భంగా సోమేశ్వరీదేవి సమేత సోమనందీశ్వర స్వామి వార్ల కళ్యాణం వైభవంగా నిర్వహించారు. అనంతరం అన్నదానం ఏర్పాటు చేశారు. సాయంత్రం స్వామివార్ల గ్రామోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. రహీమ్‌, చెన్నయ్య, వీరభద్రప్ప, మురళి, ఉమ్మయ్య, శివయ్య, నాగరాజప్ప భక్తులు పాల్గొన్నారు.

నంద్యాల భగవత్‌ సేవా సమాజ్‌ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం సంజీవనగర్‌ కోదండరామాలయం నుంచి కనుల పండువగా శ్రీదేవిభూదేవి సమేత వేంకటేశ్వరస్వామి విష్ణుభాగ్య రఽథోత్సవం నిర్వహించారు. మాజీ ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్‌ఎండీ ఫిరోజ్‌, రామకృష్ణా విద్యాసంస్థల అధినేత డా.రామక్రిష్ణారెడ్డి, కమిటీ అధ్యక్షుడు సముద్రాల సూరయ్య, సభ్యులు దేవరశెట్టి శ్రీనివాస్‌, పార్థసారధికృష్ణ, వంకదారిమధుసూదన్‌, అధికారులు, వేలాదిమంది భక్తులు పాల్గొన్నారు.

నంద్యాల రూరల్‌ (ఆంధ్రజ్యోతి): నంద్యాల మండలంలో సంక్రాంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. రాయమాల్పురం గ్రామంలో శివువు, పార్వతి, గంగాదేవి ఉత్సవమూర్తులకు పల్లకీ సేవ నిర్వహించారు.

ఆత్మకూరు(ఆంధ్రజ్యోతి): సంక్రాంతి పర్వదినాన్ని వేడుకలను పురస్కరించుకుని ఆత్మకూరు మున్సిపాలిటీతో పాటు పలు గ్రామాల్లో మహిళలకు ముగ్గుల పోటీలు, యువతకు గ్రామీణ క్రీడాపోటీలను నిర్వహించారు. పట్టణంలో మంగళవారం సీపీఎం అనుబంధాల సంఘాల ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గుల పోటీలు, చిన్నారులకు మ్యూజికల్‌ చైర్స్‌, పరుగు పందెం పోటీలను నిర్వహించారు. గెలుపొందిన వారికి స్నేహ స్టడీ సర్కిల్‌, స్పేస్‌వారి సహకారంతో గెలుపొందిన విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. నాయకులు రాజశేఖర్‌, ఏసురత్నం, రణధీర్‌, స్నేహ స్టడీ సర్కిల్‌ కరస్పాండెంట్‌ పి.నూర్‌బాషా పాల్గొన్నారు.

ఆత్మకూరులోని అయ్యప్పస్వామి ఆలయంలో మంగళవారం మరకజ్యోతి దర్శన క్రతువను వైభవంగా నిర్వహించారు. ప్రతిఏటా సంక్రాంతి పర్వదినం సందర్భంగా శబరిమలైలోని అయ్యప్పస్వామి సన్నిధిలో జరిగే మకరజ్యోతి దర్శన కార్యక్రమం సందర్భంగా స్థానిక భక్తులకు జ్యోతి దర్శనం కల్పించాలన్న సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. భక్తులకు ఆలయ కమిటీ తరపున అల్పహార వితరణ చేపట్టారు.

ఆత్మకూరు రూరల్‌(ఆంధ్రజ్యోతి): మండలంలో మహిళలకు ముగ్గుల పోటీలు, యువతకు గ్రామీణ క్రీడాపోటీలను నిర్వహించారు. కరివేన గ్రామంలో ఆంధ్ర ప్రదేశ్‌ రైతు సంఘం ఆధ్వర్యంలో, కొత్తరామాపురంలో కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించి గెలుపొందిన మహిళలకు బహుమతులను ప్రదానం చేశారు. సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రాజశేఖర్‌, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఏసురత్నం, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, సీపీఎం, టీడీపీ నాయకులు, రైతులు, మహిళలు పాల్గొన్నారు.

మహానంది(ఆంధ్రజ్యోతి): మహానంది క్షేత్రంలో మకర సంక్రాంతి వేడుకలను రంగ రంగ వైభవంగా నిర్వహించారు. స్వామి,అమ్మవార్ల ఉత్సవమూర్తుల విగ్రహాలకు తిరుమంజన సేవను భక్తి శ్రద్ధలతో జరిపారు. సాయంత్రం ఆలయం ముందు భాగంలో ఈఏడాది ప్ర పధమంగా ఆలయ ఈవో శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో గంగిరెద్దుల నృత్య ప్రదర్శనతో పాటు హరిదాసు సంకీర్తనలను ఏర్పాటు చేశారు. పరుగు పందెంలో మహానందికి చెందిన కార్తీక్‌ విజేతగా నిలిచాడు. ఈవో అభినందించి, సత్కరించారు. పారువేట ఉత్సవం ముందు తిమ్మాపు రానికి చెందిన చిన్నారుల కోలాట నృత్యం పలువురిని ఆకట్టుకొంది. ముగ్గుల పోటీల విజేతలకు ఆలయ ఈవో బహుమతులు అందజేశారు. ఆలయ ఏఈవో ఎర్రమల్ల మధు, పర్యవేక్షకుడు శశిధర్‌రెడ్డి, సీనియర్‌ అసిస్టెంట్‌ పసుపుల సుబ్బారెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.

బుక్కాపురంలో బుధవారం సాయంత్రం సంక్రాంతి వేడుకల్లో భాగంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న కెసీ కెనాల్‌ చైర్మన్‌ బన్నూరి రామలింగారెడ్డి గ్రామ పారిశుధ్య కార్మికులను సన్మానించారు. దుస్తులు పంపిణి చేశారు. అనంతరం ముగ్గుల పోటీలతో పాటు ఆటపోటీల్లో విజేతలకు కూడా ఆయన బహుమతులు అందజేశారు. గ్రూపు దేవాలయాల ఈవో స్వర్ణముఖి, టీడీపీ నాయకులు నాగపుల్లయ్య, శివ, సుబ్రహ్మణ్యం,మారెడ్డి జయరాం, నాగరాజు, శివ పాల్గొన్నారు.

బండిఆత్మకూరు(ఆంధ్రజ్యోతి): మండలంలో సంక్రాంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఎ. కోడూరులో ముగ్గుల పోటీలు నిర్వహంచి విజేతలకు టీడీపీ నాయకుడు వడుడ మధుసూదన్‌రెడ్డి బహుమతులు అందజేశారు.

వెలుగోడు(ఆంరఽధజ్యోతి): వెలుగోడు మండలంలో అన్ని గ్రామాలలో సంక్రాంతి పండుగ వేడుకలను ఆయా గ్రామాల ప్రజలు ఘనంగా నిర్వహించుకున్నారు ఆలయాలకు వెల్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

నందికొట్కూరు(ఆంధ్రజ్యోతి): సంక్రాంతి పండుగ అంటే మహిళల పండుగ అని నందికొట్కూరు పట్టణ సీఐ ప్రవీణ్‌ కుమార్‌ రెడ్డి అన్నారు. సంక్రాంతి పండగ సందర్భంగా సీపీఐ ఆధ్వర్యంలో కుమ్మరి వీధిలో నిర్వహించిన ముగ్గుల పోటీలు, కుర్చీల ఆటల పోటీల్లో గెలుపొందిన మహిళలకు బహుమతుల ప్రదానోత్స వంలో ఆయన పాల్గొన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు నాగేశ్వర రావు, నాయకులు గోపాలకృష్ణ, బాబు, ఉస్మాన్‌ బాషా, అబ్దుల్‌ రషీద్‌, పాండు, రాధమ్మ, నాగేశ్వరమ్మ, జయమ్మ పాల్గొన్నారు.

మిడుతూరు(ఆంధ్రజ్యోతి): మండలంలో సంక్రాంతి పండగను ఘనంగా జరుపుకొన్నారు. ఆడ పడుచులు ఇళ్ల ముంగిట రంగు రంగుల ముగ్గులు వేసి, ఆవుపేడతో తయారు చేసిన గొబ్బెమ్మలను పసుపు, కుంకుమ, పుస్పాలతో అలంకరించారు.

గో జాతి సంరక్షణకు ప్రతి వ్యక్తి కృషి చేయాలని తిరుమల తిరుపతి దేవస్థానం, హిందూ ధర్మ ప్రచార పరిషత్‌ ధర్మాచార్యులు ఆమంచి వేంకటేశ్వర్లు అన్నారు. బుధవారం కనుమ పండగను పురస్కరించుకుని టీటీడీ, హిందూ ధర్మ ప్రచార పరిషత్‌ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ ఆధ్వర్యంలో మండల కేంద్రం మిడుతూరు లక్ష్మీచెన్నకేశవ స్వామి దేవస్థానంలో గోపూజ, ధార్మిక ప్రవచనాన్ని ఏర్పాటు చేశారు. గోమాతకు విశేష పూజలు నిర్వహించి, వృషభ రాజములతో నగర సంకీర్తన చేశారు. అర్చకులు వెంకట రామయ్య, చెంచు రామ్మోహన్‌ రావు, జగన్మోహన్‌ ఆచారి, చిట్టిబాబు పాల్గొన్నారు.

పాములపాడు(ఆంధ్రజ్యోతి): రుద్రవరం గ్రామం సర్పంచ్‌, టీడీపీ నాయకుడు రామస్వామి ఆధ్వర్యంలో ఆటల పోటీలు నిర్వహించారు మంగళవారం సంక్రాంతి పండుగ సందర్భంగా నిర్వహించిన మ్యూజిక్‌ చైర్‌, తాడు ఆటలలో మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. గెలుపొందిన మహిళలకు బహుమతిగా చీరలు పంపిణీ చేశారు. పాల్గొన్న ప్రతి మహిళకు గిఫ్ట్‌లను అందించారు. టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

పగిడ్యాల(ఆంధ్రజ్యోతి): నెహ్రూనగర్‌లో టీడీపీ నాయకుడు బండి జయరాజ్‌ ఆధ్వర్యంలో మంగళవారం మహిళలకు ముగ్గుల పోటీలను నిర్వహించారు. ఈపోటీలలో గెలుపొందిన వరలక్ష్మికి మొదటి బహుమతి రూ. 1000, రెండో స్థానంలో గెలుపొందిన మానసకు రూ.700, మూడోవ స్థానంలో గెలుపొందిన పి.కవితకు రూ. 500 బహుమతులను అనంతపురం జిల్లా రిజిస్ట్రార్‌ బండి శ్రీనివాసులు అందజేశారు.

పడమర ప్రాతకోట గ్రామంలోని కాశీవిశ్వేశ్వర, తూర్పు ప్రాతకోట గ్రామంలోని నాగేశ్వర స్వామి రథోత్సవాలను బుధవారం రాత్రి భక్తులు వైభవంగా నిర్వహించారు. నంద్యాల ఎంపీ డాక్టర్‌ బైరెడ్డి శబరి, నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్తా జయసూర్య, టీడీపీ నంద్యాల పార్లమెంట్‌ ఇన్‌చార్జి మాండ్ర శివానందరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై రథాన్ని లాగి ప్రారంభించారు. నాయకులు పలుచాని మహేశ్వరరెడ్డి, వెంకట్‌రెడ్డి, నాగశేషులు, శ్రీనివాసులు నాయుడు, బాలీశ్వర్‌గౌడ్‌, వెంకటేశ్వర్లు, మిద్దె శ్రీను తదితరులు పాల్గొన్నారు.

కొత్తపల్లి(ఆంధ్రజ్యోతి): కొత్తపల్లిలో వెలసిన పార్వతి సమేత తాండవ మల్లేశ్వర స్వామి కల్యాణ మహోత్సవం అశేష భక్తజనం మధ్య పురోహితులు లక్ష్మీనరసయ్య శర్మ, దేవదాయ శాఖ ఈవో, ఆలయ కమిటీ, గ్రామ పెద్దల సహకారంతో కన్నుల పండువగా జరిగింది. మంగళవారం ఉదయం స్వామివారికి గణపతి పూజ, సభాపూజ, పుణ్యహావాచనం, రుద్రాభిషేకాలు తదితర ప్రత్యేక పూజాదికార్యక్రమాలు శాస్త్రోత్తంగా నిర్వహించారు. రాత్రి 11 గంటల సమయంలో పురోహితులు స్వామి, అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలకు భక్తజన సమక్షంలో కల్యాణం జరిపించారు. అనంతరం ఉత్సవమూర్తులను ఊరేగించారు. బుధవారం భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. అలాగే బుధవారం సాయంత్రం రథోత్సవాన్ని నిర్వహించారు.

పూర్వపు ఆలయ పురోహితులు కాసులనాటి సుందర రామయ్యశాస్త్రి, అలివేలి మంగమ్మ గారి జ్ఞాపకార్థం వారి మనుమడు పూర్వపు ఆలయ పూజారి పురోహితులు బొల్ల పిన్ని ఉమామహేశ్వరశర్మ వారి కుటుంబ సభ్యులతో కలిసి రూ.15,116 అన్నదాన కార్యక్రమానికి విరాళంగా అందజేశారు. ఆలయ కమిటీతో పాటు దేవదాయశాఖ, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

గడివేముల(ఆంధ్రజ్యోతి): మండలంలోని సంక్రాంతి, కనుమ పండుగను ప్రజలు ఘనంగా నిర్వహించుకున్నారు. బుధవారం గడివేముల, కరిమద్దెల, గడిగరేవుల గ్రామాల్లో పారువేట నిర్వహించారు. స్వామి వారి ఉత్సవ విగ్రహాలను గ్రామ వీధుల్లో ఊరేగించారు.

పాణ్యం(ఆంధ్రజ్యోతి): సుబ్బరాయుని కొత్తూరు గ్రామంలో సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయంలో బుధవారం సంక్రాంతి సంబరాలు ఘనంగా ముగిశాయి. ఆలయ ఈవో రామకృష్ణ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, గ్రామోత్సవం నిర్వహించారు. సిబ్బంది సుబ్బారెడ్డి, లక్ష్మీనారాయణ, ప్రదాన అర్చకులు వీరయ్యస్వామి, నారాయణస్వామి, సురేష్‌ శర్మ, రోహిత్‌ శర్మ, కృష్ణయ్య స్వామి, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Updated Date - Jan 16 , 2025 | 12:42 AM