Share News

Viveka Case: సునీతపై వివేకా హత్య కేసు నిందితుల సంచలన ఆరోపణలు

ABN , Publish Date - Oct 31 , 2025 | 12:38 PM

సునీతా రెడ్డి తనకు కావాల్సిన విధంగా దర్యాప్తు జరగాలని కోరుకుంటున్నారని.. ఇందుకు సీబీఐని పావుగా వాడుకోవాలని చూస్తున్నారని అవినాష్ అన్నారు.

Viveka Case: సునీతపై వివేకా హత్య కేసు నిందితుల సంచలన ఆరోపణలు
Viveka Case

హైదరాబాద్‌/అమరావతి, అక్టోబర్ 31: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో (Viveka Murder Case) మరింత లోతైన దర్యాప్తు చేయాలంటూ సునీతారెడ్డి వేసిన పిటిషన్‌పై ఈరోజు (శుక్రవారం) సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. కోర్టు ఆదేశాల మేరకు ఈ కేసులో నిందితులు కౌంటర్లు దాఖలు చేశారు. వివేకా కుమార్తె సునీతారెడ్డి చేసిన వినతిని తిరస్కరించాలని కోరుతూ కోర్టులో నిందితులు కౌంటర్ వేశారు. సునీత దురుద్దేశంతో వ్యవహరిస్తున్నారని, తదుపరి దర్యాప్తు కోరడం వెనుక వ్యక్తిగత, రాజకీయ ఎజెండా రెండూ ఉన్నాయని నిందితులు పేర్కొన్నారు. నిందితులుగా ఉన్న ఏ5 నిందితుడు దేవిరెడ్డి శివ శంకర్ రెడ్డి, ఏ7 వైఎస్ భాస్కర్‌రెడ్డి, ఏ8 కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఈ మేరకు న్యాయస్థానంలో కౌంటర్ దాఖలు చేశారు.


సునీతా రెడ్డి తనకు కావాల్సిన విధంగా దర్యాప్తు జరగాలని కోరుకుంటున్నారని.. ఇందుకు సీబీఐని పావుగా వాడుకోవాలని చూస్తున్నారని అవినాష్ అన్నారు. అలాగే సీబీఐ కూడా లొంగిపోయిందని కడప ఎంపీ.. కోర్టుకు తెలిపారు. పార్లమెంట్ సభ్యుడైన అవినాష్ రెడ్డిని నిందితుడిగా చేర్చడం ద్వారా సీబీఐ లొంగిపోయినట్లు స్పష్టంగా కనిపిస్తోందని నిందితులు కౌంటర్లో తెలిపారు. సునీతారెడ్డి నిర్దేశం మేరకు తదుపరి దర్యాప్తు చేపట్టి దస్తగిరి అప్రూవర్‌గా మారారని.. స్వేచ్ఛగా వదిలేయాలనే కుట్ర జరుగుతోందని ఆరోపించారు.


తదుపరి దర్యాప్తు చేయడానికి కొత్త విషయాలు ఏవీలేవని కోర్టుకు తెలిపారు. ఈడీ, ఆదాయ పన్ను శాఖ కోణంలో దర్యాప్తు చేయాలని ఆమె కోరుతున్నారని.. అలాంటప్పుడు సీబీఐ చేయాల్సిన దర్యాప్తు ఏముంటుందని కౌంటర్‌లో నిందితులు పేర్కొన్నారు. ఏపీలో మారిన రాజకీయ పరిస్థితులు, ప్రస్తుతం అధికారంలో ఉన్నవారితో సునీతకు పొత్తు ఉందన్నారు. అవినాష్ రెడ్డి ప్రతిష్ఠను దెబ్బతీయడానికే ఈ పిటిషన్ వేశారని నిందితులు తెలిపారు. దర్యాప్తు సంస్థ ఏం చేయాలో ఆమె నిర్ణయించాల్సిన అవసరంలేదని వారు పేర్కొన్నారు. తదుపరి దర్యాప్తు చేయాలనుకోవడం లేదని.. కోర్టు ఆదేశిస్తే చేస్తామని సుప్రీంకోర్టుకు సీబీఐ వెల్లడించిన విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని నిందితుల సీబీఐ కోర్టులో వాదనలు వినిపించారు.


ఇవి కూడా చదవండి...

సర్దార్‌కు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఘన నివాళులు

పాండురంగ స్వామి ఉత్సవాలు.. పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 31 , 2025 | 01:22 PM