Share News

TIDCO Housing Issue: టిడ్కో ఇళ్లపై ఎమ్మెల్యేల క్వశ్చన్.. మంత్రి సమాధానం

ABN , Publish Date - Sep 18 , 2025 | 10:54 AM

జగన్ పెట్టిన పథకాలలో అవినీతిపై ఒకరోజు చర్చ పెట్టాలని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి కోరారు. ప్రస్తుతం లబ్ధిదారులను బ్యాంక్‌లు ఇబ్బందిపెడుతున్నాయని, జగన్ చేసిన అప్పులకు లబ్ధిదారులు బలి అవుతున్నారన్నారు.

TIDCO Housing Issue: టిడ్కో ఇళ్లపై ఎమ్మెల్యేల క్వశ్చన్.. మంత్రి సమాధానం
TIDCO Housing Issue

అమరావతి, సెప్టెంబర్ 18: ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. సభ మొదలవగానే స్పీకర్ ప్రశ్నోత్తరాలను చేపట్టారు. ఈ క్రమంలో టిడ్కో ఇళ్లపై ప్రశ్నోత్తరాల సమయంలో వాగ్వాదం చోటు చేసుకుంది. బీజేపీ శాసనసభ పక్ష నేత విష్ణు కుమార్ రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. టిడ్కో గృహాలు లబ్ధిదారులు , కాంట్రాక్టర్లను జగన్ ప్రభుత్వం నాశనం చేశారని విరుచుకుపడ్డారు. జగనన్న సెంటు పట్టాలు అని చెప్పి సర్వ నాశనం చేశారని.. అన్ని పథకాలు అవినీతితో నిండిపోయాయని విష్ణుకుమార్ రాజు ఆరోపించారు.


చర్చ జరపాల్సిందే: గోరంట్ల

జగన్ పెట్టిన పథకాలలో అవినీతిపై ఒకరోజు చర్చ పెట్టాలని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి కోరారు. ప్రస్తుతం లబ్ధిదారులను బ్యాంక్‌లు ఇబ్బందిపెడుతున్నాయని, జగన్ చేసిన అప్పులకు లబ్ధిదారులు బలి అవుతున్నారన్నారు. బ్యాంక్‌లు టిడ్కో ఇళ్లకు లాక్ వేస్తున్నాయని.. దీనిపై ప్రత్యేక చర్చ పెట్టాలని కోరారు.


పెండింగ్ ఇళ్ల సంగతేంటి: ధూళిపాళ్ల

లబ్ధిదారులకు ఇళ్లు పూర్తిచేసి ఎప్పుడు ఇస్తారో చెప్పాలని సీనియర్ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కోరారు. పెండింగ్ ఇళ్ల సంగతి ఏమిటి అనేది చెప్పాలన్నారు. మీరు ఒక నిర్దిష్ట ప్రణాళిక ప్రకారం వీటిని పూర్తి చేయాలని.. వీటిని ఎప్పటిలాగా పూర్తి చేసి ఇస్తారో మంత్రిగారు వెంటనే చెప్పాలని ధూళిపాళ్ల నరేంద్ర పేర్కొన్నారు.


శరవేగంగా ఇళ్ల నిర్మాణం: కడప ఎమ్మెల్యే మాధవి

కడప నియోజకవర్గంలో టిడ్కో ఇళ్ల నిర్మాణం శరవేగంగా జరుగుతుందని ఎమ్మెల్యే మాధవి తెలిపారు. డిసెంబర్ నాటికి కడపలో 2 వేల 434 ఇళ్లు పూర్తి చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు.


త్వరలో బకాయిలు చెల్లిస్తాం: మంత్రి నారాయణ

ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నకు మంత్రి నారాయణ సమాధానమిస్తూ... టిడ్కో ఇళ్ల కేటాయింపులను గత ప్రభుత్వం తగ్గించిందన్నారు. కాంట్రాక్టర్లకు గత నాలుగు నెలల్లో రూ.280 కోట్లు చెల్లించామని వివరించారు. మొత్తం 51 ప్రాంతాల్లో టిడ్కో ఇళ్లను మళ్ళీ ప్రారంభించామని తెలిపారు. కాంట్రాక్టర్లకు 3 వేల 664 కోట్ల బిల్లులు చెల్లించాలని తెలిపారు. మొత్తం ప్రాజెక్ట్ పూర్తి కావాలంటే 6 వేల కోట్లు అవసరమని చెప్పుకొచ్చారు. హడ్కో వాళ్లను అడిగితే వారు 4 వేల 500 కోట్లు రుణం ఇస్తామని చెప్పారన్నారు. ఈ రుణం వచ్చిన వెంటనే కాంట్రాక్టర్లకు 3 వేల 500 కోట్లు బకాయిలు చెల్లిస్తామని స్పష్టం చేశారు. ప్రతి శనివారం పూర్తయిన ఇళ్లను ఎమ్మెల్యేలకు చెప్పి లబ్ధిదారులకు ఇవ్వాలని చెప్పామని మంత్రి నారాయణ వెల్లడించారు.


ప్రత్యేక చర్చ పెడదాం: స్పీకర్

ఈ దశలో జోక్యం చేసుకున్న స్పీకర్ అయ్యన్న పాత్రుడు.. ఇది చాలా సీరియస్ సమస్యగా అభివర్ణించారు. మంత్రి పూర్తిగా సమాచారం తెప్పించుకుని వస్తే దీనిపై ప్రత్యేక చర్చ పెడదామన్నారు. శాసనసభ్యులు అందరు కూడా తమ సమస్యలు చెబుతారని.. ప్రభుత్వం ఏం చేయబోతుంది అనేది మంత్రి చెప్పాలని తెలిపారు. అప్పుడే ఈ విషయాలన్నీ ప్రజలు, లబ్ధిదారులు దృష్టికి వెళ్తాయని స్పీకర్ అయ్యన్న పాత్రుడు పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి..

ఫోటోల కలకలం.. కుప్పకూలిన కాపురం.. ఏం జరిగిందంటే

జగన్ చెంప పగలగొట్టాలి.. అచ్చెన్న ఫైర్

Read Latest AP News And Telugu News

Updated Date - Sep 18 , 2025 | 10:55 AM