Share News

Supreme Court: కొమ్మినేనికి బెయిల్ మంజూరు చేసిన సుప్రీం కోర్టు..

ABN , Publish Date - Jun 13 , 2025 | 12:39 PM

Supreme Court: నవ్యాంధ్ర రాజధాని అమరావతి మహిళలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన కేసులో ఏ2గా ఉన్న యాంకర్‌ కొమ్మినేని శ్రీనివాసరావు బెయిల్ కోసం సుప్రీం కోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన ధర్మాసనం ఆయనకు బెయిల్ మంజూరు చేసింది.

Supreme Court:  కొమ్మినేనికి బెయిల్ మంజూరు చేసిన సుప్రీం కోర్టు..
Supreme Court Bail Grant

New Delhi: ఏపీ రాజధాని (AP Capital) అమరావతి (Amaravati) మహిళల (Womens)పై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన కేసు (Abuse Case)లో సాక్షి యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావు (Kommineni Srinivasa Rao) అరెస్ట్ అయి ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా ఉన్నారు. దీంతో ఆయన బెయిల్ కోసం (Bail Petition) సుప్రీం కోర్టు (Supreme Court)ను ఆశ్రయించారు. కింది కోర్టులో బెయిల్ కోసం కొమ్మినేని దరఖాస్తు చేసుకున్నారు. అయితే అక్కడ ఆయన బెయిల్ పిటీషన్ పెండింగ్‌లో ఉండగానే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరిపిన జస్టిస్ పీకే మిశ్రా ధర్మాసనం బెయిల్ మంజూరు (Bail Grant) చేస్తూ.. వెంటనే విడుదల చేయాలని ఆదేశాలిస్తూ.. మరోసారి అమరావతిపై అసభ్యకర వ్యాఖ్యలు చేయవద్దని కొమ్మినేనికి సుప్రీం ధర్మాసనం సూచించింది. భవిష్యత్తులో మరింత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. కింది కోర్టు విధించిన షరతులకు లోబడే బెయిల్ మంజూరీ చేస్తున్నామని పేర్కొంది. విడుదలకు సంబంధించిన అన్ని నిబంధనలు ట్రయల్ కోర్టు ఇస్తుందని న్యాయమూర్తి ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ మన్మోహన్ ధర్మాసనం స్పష్టం చేసింది.


కేసు వివరాలు...

నవ్యాంధ్ర రాజధాని అమరావతి వేశ్యల రాజధాని అని జగన్‌ చానల్లో తీవ్ర వ్యాఖ్యలు చేసిన కేసులో యాంకర్‌ కొమ్మినేని శ్రీనివాసరావును పోలీసులు అరెస్టు చేశారు. ఇటీవల జగన్‌ చానల్లో యాంకర్‌ కొమ్మినేని నిర్వహించిన లైవ్‌ డిబేట్లో.. అమరావతి దేవతల రాజధాని కాదు... వేశ్యల రాజధాని అని కృష్ణంరాజు అనుచిత వ్యాఖ్యలు చేశారు. కొమ్మినేని ఆయనను వారించకుండా చర్చను కొనసాగించారు. దీనిపై రాజధాని ప్రాంతం సహా రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహావేశాలు పెల్లుబుకాయి. మహిళలు, ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేస్తున్నా.. ఆ ఇద్దరు గానీ, సాక్షి యాజమాన్యం గానీ కనీసం క్షమాపణలు చెప్పకపోవడంతో వారు మండిపడుతున్నారు.


కొమ్మినేని అరెస్టు ఇలా..

ఈ క్రమంలో రాజధాని ప్రాంత దళిత జేఏసీ నాయకురాలు కంభంపాటి శిరీష తుళ్లూరు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. కృష్ణంరాజు, కొమ్మినేని, సాక్షి యాజమాన్యంపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీతోపాటు పలు నాన్‌ బెయిలబుల్‌ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సోమవారం ఉదయం తుళ్లూరు పోలీసులు హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని జర్నలిస్టుల కాలనీకి వెళ్లి కొమ్మినేని నివాసంలో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం జూబ్లీహిల్స్‌ పోలీసు స్టేషన్లో హాజరుపరిచి.. అక్కడి నుంచి ట్రాన్సిట్‌ వారెంట్‌పై సోమవారం రాత్రికి విజయవాడ తీసుకొచ్చారు. తొలుత రాజధానిలోని తుళ్లూరు పోలీసు స్టేషన్‌కు గానీ.. లేదంటే గుంటూరు గానీ తీసుకురావాలని భావించారు. అయితే ఈ ప్రాంతంలో తీవ్ర ఆగ్రహంతో ఉన్న మహిళలు ప్రతిఘటించవచ్చని నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో పోలీసులు విజయవాడలోనే ఆయన్ను రహస్య ప్రాంతంలో ఉంచారు. రాత్రి పొద్దుపోయాక నల్లపాడు పోలీసు స్టేషన్‌కు తరలించారు. మంగళవారం ఉదయం మంగళగిరి కోర్టులో కొమ్మినేని హాజరుపర్చగా 14 రోజుల రిమాండ్ విధించింది.


జర్నలిస్టు కృష్ణంరాజు అరెస్టు...

జగన్‌ చానల్‌ డిబేట్‌లో అమరావతి ప్రాంత మహిళలను తీవ్రంగా కించపరుస్తూ దారుణ వ్యాఖ్యలు చేసిన కేసులో పరారీలో ఉన్న ఏ1, సీనియర్‌ జర్నలిస్టు కృష్ణంరాజు ఎట్టకేలకు పోలీసులకు చిక్కారు. బుధవారం మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో కృష్ణంరాజు ఫార్చునర్‌ వాహనంలో శ్రీకాకుళం నుంచి విశాఖ వైపు వస్తున్నట్టు గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఉన్నతాధికారులు విజయనగరం పోలీసులతో పాటు విశాఖ సిటీ పోలీస్‌ కమిషనర్‌ శంఖబ్రతబాగ్చీని అప్రమత్తం చేశారు. కృష్ణంరాజు ప్రయాణిస్తున్న కారు విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లి దాటి విశాఖపట్నం జిల్లా భీమిలి మండల పరిధిలోని అమనాం జంక్షన్‌కు చేరుకుంది. అప్పటికే అక్కడ మాటువేసిన భీమిలి పోలీసులు ఆ వాహనాన్ని ఆపి, అందులో ఉన్న కృష్ణంరాజుతోపాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని తుళ్లూరు పోలీసులకు అప్పగించారు. దీంతో కృష్ణంరాజును రోడ్డుమార్గంలో బుధవారం రాత్రికి నల్లపాడు పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. సాక్షి టీవీ చానల్‌లో ఈ నెల 6న నిర్వహించిన డిబేట్‌లో జర్నలిస్టు కృష్ణంరాజు రాజధాని అమరావతిని వేశ్యల రాజధానిగా అభివర్ణించిన విషయం తెలిసిందే.


ఇవి కూడా చదవండి:

భార్యను హతమార్చి భర్త ఆత్మహత్య..

ఆస్పత్రిలో క్షతగాత్రులను పరామర్శించిన ప్రధాని మోదీ..

For More AP News and Telugu News

Read Latest and Crime News

Updated Date - Jun 13 , 2025 | 01:50 PM