YCP MLC Resignations: స్వచ్ఛందంగానే రాజీనామా.. మండలి చైర్మన్‌తో ఆరుగురు ఎమ్మెల్సీలు
ABN , Publish Date - Dec 01 , 2025 | 03:18 PM
రాజీనామా చేసిన ఆరుగురు ఎమ్మెల్సీలతో మండలి చైర్మన్ మోషేన్ రాజు సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఎవరి ప్రోద్భలంతోనైనా లేక ప్రలోభాలకు లోనై రాజీనామాలు చేశారా అని ఎమ్మెల్సీలను మండలి చైర్మన్ ప్రశ్నించారు.
అమరావతి, డిసెంబర్ 1: వైసీపీకి రాజీనామా చేసిన పలువురు ఎమ్మెల్సీలు శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజును ఈరోజు (సోమవారం) కలిశారు. రాజీనామా పత్రాన్ని అందజేశారు. రాజీనామా అంశంపై ఆరుగురు ఎమ్మెల్సీలు వివరణ ఇచ్చారు. తమ రాజీనామాను ఆమోదించాలని మండలి చైర్మన్‌ను ఎమ్మెల్సీలు కోరారు. ఎమ్మెల్సీలు కర్రి పద్మశ్రీ, కళ్యాణ చక్రవర్తి, మర్రి రాజశేఖర్‌తో పాటు జయమంగళ వెంకటరమణ, జాఖియా ఖానం, పోతుల సునీత.. చైర్మన్‌ను కలిసిన వారిలో ఉన్నారు. ఇక రాజీనామా అంశంపై మండలి చైర్మన్, రాజీనామా చేసిన ఎమ్మెల్సీల మధ్య సుదీర్ఘ చర్చ జరిగింది.
వైసీపీలో ఉండలేక స్వచ్ఛందంగా రాజీనామా చేశామనే సమాధానం ఎన్ని సార్లు చెప్పమంటారని చైర్మన్‌ను ఆరుగురు ఎమ్మెల్సీలు అడిగారు. ఎవరి ప్రోద్భలంతోనైనా, లేక ప్రలోభాలకు లోనై రాజీనామాలు చేశారా అని ఎమ్మెల్సీలను మండలి చైర్మన్ ప్రశ్నించారు. పదవీకాలం తక్కువే ఉన్నందున ఎమ్మెల్సీలు కొనసాగవచ్చు కదా అని సూచించారు. రాజీనామా ఉపసంహరణ పునరాలోచన ఏమైనా ఉందా అని ఎమ్మెల్సీలను చైర్మన్ రాజు అడిగారు.
అయితే సభ్యుడు స్వచ్ఛందంగా రాజీనామా చేయలేదనే అనుమానం ఉంటే మాత్రమే విచారణ జరపాలని రాజ్యాంగం చెప్తోందని ఎమ్మెల్సీలు అన్నారు. రాజీనామా పత్రాలు స్వయంగా తామే తీసుకొచ్చి ఇచ్చినా, ఇప్పటికీ అనేక సార్లు స్వచ్ఛందంగా రాజీనామా చేశామనే విషయం చెప్పామన్నారు. ఇప్పటికీ అదే మాటకు కట్టుబడి ఉన్నామని ఇంకా ఎన్నిసార్లు అడిగినా తమది ఇదే సమాధానమని వారు స్పష్టం చేశారు. అసలు ఎందుకు రాజీనామాలు చేశారని చైర్మన్ ప్రశ్నించగా.. అది రాజ్యాంగం తమకు కల్పించిన హక్కు అంటూ ఎమ్మెల్సీలు సమాధానం ఇచ్చారు.
చైర్మన్‌తో సమావేశం తర్వాత ఎమ్మెల్సీలు మీడియాతో మాట్లాడుతూ.. 2024 ఆగస్టులో తాము రాజీనామాలు చేశామని ఇప్పటికీ 15 నెలలు దాటిపోయిందని కర్రి పద్మశ్రీ, బల్లి కళ్యాణ చక్రవర్తి, పోతుల సునీత అన్నారు. తాను గత ఏడాది నవంబర్‌లో రాజీనామా చేసినందున తనదీ ఏడాది దాటిపోయిందని జయమంగళ వెంకట రమణ వెల్లడించారు. తాము స్వచ్ఛందంగా రాజీనామాలు చేయలేదని ఒప్పించే తపన చైర్మన్‌లో ఎందుకు ఉందో అర్ధం కావట్లేదని ఎమ్మెల్సీలు వ్యాఖ్యలు చేశారు. విచక్షణాధికారం పరిధి దాటి చైర్మన్ ప్రశ్నలు వేసినా సంయమనంతో సమాధానం ఇచ్చామని ఎమ్మెల్సీలు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
తుస్సుమన్న జగన్ ప్లాన్.. పీపీపీపై వైసీపీ నేతలు రివర్స్
ఉదయం 9 గంటలకే 62.40 శాతం పింఛన్ల పంపిణీ
Read Latest AP News And Telugu News