Share News

Ravishankar Arrest: భార్యపై అనుమానం.. బిడ్డలపై ఘాతుకం... రవిశంకర్ అరెస్ట్

ABN , Publish Date - Jun 21 , 2025 | 10:44 AM

Ravishankar Arrest: దాదాపు పది రోజుల తర్వాత సింహాచలం అప్పన్న ఆలయంలో రవిశంకర్ ఉన్నట్లు గుర్తించిన మైలవరం పోలీసులు... గురువారం రాత్రి అక్కడకు వెళ్లి అతడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నిందితుడిని రెండు రోజులుగా మైలవరంలోని రహస్య ప్రదేశంలో ఉంచి విచారించారు.

Ravishankar Arrest: భార్యపై అనుమానం.. బిడ్డలపై ఘాతుకం... రవిశంకర్ అరెస్ట్
Ravishankar Arrest

ఎన్టీఆర్ జిల్లా, జూన్ 21: కన్నబిడ్డలను కడతేర్చిన కర్కశ తండ్రిని ఎట్టకేలకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈనెల 12న తన బిడ్డలు లక్ష్మీ హిరణ్య, లీలాసాయిలను కన్నతండ్రి రవిశంకర్ దారుణంగా హత్య చేశాడు. ఆపై తాను కూడా ఆత్మహత్య చేసుకుంటున్నట్లు లేఖ రాసి సదరు తండ్రి పరారయ్యాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి రవిశంకర్ కోసం తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టారు. చివరకు అతడి కాల్ డీటెయిల్స్ లోకేషన్ ఆధారంగా రవిశంకర్‌ను గుర్తించారు పోలీసులు. దాదాపు పది రోజుల తర్వాత సింహాచలం అప్పన్న ఆలయంలో రవిశంకర్ ఉన్నట్లు గుర్తించిన మైలవరం పోలీసులు... గురువారం రాత్రి అక్కడకు వెళ్లి అతడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నిందితుడిని రెండు రోజులుగా మైలవరంలోని రహస్య ప్రదేశంలో ఉంచి విచారించారు. చివరకు బిడ్డలను తానే చంపానని.. భార్యపై అనుమానంతోనే హత్య చేసినట్లు నిందితుడు అంగీకరించాడు.


రవిశంకర్ భార్య ఉద్యోగం నిమిత్తం విదేశాలకు వెళ్లింది. తొలి నుంచి భార్యపై అనుమానంతో ఉన్న రవిశంకర్.. ఆమె విదేశాలకు వెళ్లడంతో తన క్రూరత్వాన్ని బయటపెట్టాడు. పిల్లలను చంపేందుకు మూడు నెలల నుంచి ప్లాన్ చేశాడు. చివరకు తన ఇద్దరు పిల్లలను కన్నతండ్రి అనే మమకారం లేకుండా కర్కశంగా మట్టుబెట్టాడు. అంతేకాకుండా ఈ కేసు నుంచి తప్పించుకునే క్రమంలో తాను కూడా ఆత్మహత్య చేసుకుంటున్నట్లుగా లేఖ రాసి పరారయ్యాడు. చివరకు పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యాడు. ఇక రవిశంకర్ లేఖతో అప్రమత్తమైన పోలీసులు అతడి కోసం విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. నిజంగా ఆత్మహత్య చేసుకుంటాడని భావించిన పోలీసులు ఎన్నో చోట్ల గాలించారు. చివరకు అతడి కాల్ డేటా ఆధారంగా సింహాచలంలో ఉన్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో అసలు విషయం బయటపడింది. భార్యపై అనుమానంతోనే కన్న బిడ్డల్ని హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. దీంతో పది రోజుల తర్వాత రవిశంకర్ దొరకడంతో పోలీసు అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.


కాగా.. అనుమానం పెనుభూతం అంటారు. భార్యా లేదా భర్త మనసుల్లో అనుమానం అనే బీజం పడితే అది ఎంతటి దారుణాలకైనా దారి తీస్తుంది. ఒక్కసారి భాగస్వామిపై అనుమానం మొదలైతే అది పెనుభూతంగా మారి వారి నిండైన జీవితాన్ని బలితీసుకుంటుంది. అనుమానంతో భార్యలను భర్తలు చంపిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. అంతే కాకుండా దీని కారణంగా తమ కన్న బిడ్డలను కూడా బలితీసుకుంటున్న కఠినాత్ములు ఉన్నారు. ఎన్టీఆర్ జిల్లాలో జరిగిన ఈ ఘటన కూడా అలాంటిదే. అనుమానమే రోగంతో కన్న బిడ్డలని కూడా చూడలేదు. కంటికి రెప్పలా బిడ్డలను కాపాడాల్సిన తండ్రి కాలయముడిగా మారాడు. చిన్నారుల మోములను చూసి కూడా ఆ తండ్రి మనసు కరగలేదు. చివరకు ఆ పపిబిడ్డల ప్రాణాలను బలితీసుకుని ఇప్పుడు జైలు ఊచలు లెక్కబెడుతున్నాడు.


ఇవి కూడా చదవండి

గిన్నీస్ రికార్డు సృష్టించిన విశాఖ యోగాంధ్ర కార్యక్రమం..

యోగాను 130 దేశాల్లో జరుపుకుంటున్నాం..పోస్టల్ స్టాంపుల విడుదల

విశాఖలో ప్రారంభమైన అంతర్జాతీయ యోగా దినోత్సవం.. ప్రధాని మోదీ హాజరు

Read latest AP News And Telugu News

Updated Date - Jun 21 , 2025 | 11:53 AM