Cyclone Victims Essential Supplies: అన్ని రేషన్ షాపులకు నిత్యావసర సరుకులు.. పవన్ ట్వీట్
ABN , Publish Date - Oct 29 , 2025 | 01:04 PM
మొంథా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పునరావాస కేంద్రాల్లో ఉన్నవారికి, ఉపాధి కోల్పోయిన మత్స్యకారులు, చేనేత కార్మికులకు నిత్యావసరాలను ఉచితంగా అందించేందుకు కూటమి ప్రభుత్వం సన్నద్ధమైందని డిప్యూటీ సీఎం తెలిపారు.
అమరావతి, అక్టోబర్ 29: తుపాను ప్రభావిత ప్రాంత ప్రజలకు నిత్యావసర సరుకులను ఉచితంగా పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. తుపాను బాధిత కుటుంబానికి 25 కేజీల చొప్పున బియ్యాన్ని ఉచితంగా ఇవ్వాలని ఆదేశించింది. నిత్యావసర సరుకుల పంపిణీపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Deputy CM Pawan Kalyan) సామాజిక మాద్యమం ఎక్స్ వేదికగా స్పందించారు. మొంథా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పునరావాస కేంద్రాల్లో ఉన్నవారికి, ఉపాధి కోల్పోయిన మత్స్యకారులు, చేనేత కార్మికులకు నిత్యావసరాలను ఉచితంగా అందించేందుకు కూటమి ప్రభుత్వం సన్నద్ధమైందని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్దేశించిన విధంగా అధికార యంత్రాంగం నిత్యావసరాలను సమకూర్చిందని చెప్పారు.
బియ్యం 25 కేజీలు (మత్స్యకారులకు, చేనేత కార్మికులకు 50 కేజీలు), కందిపప్పు కేజీ, పామాయిల్ ఒక లీటర్, ఉల్లిపాయలు కేజీ, బంగాళాదుంపలు కేజీ, పంచదార కేజీ చొప్పున అందిస్తారన్నారు. పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశాలను అనుసరించి ఆ శాఖ అధికార యంత్రాంగం అన్ని రేషన్ షాపులకు వీటిని చేర్చిందని డిప్యూటీ సీఎం వెల్లడించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లోని 14,415 రేషన్ షాపుల్లో 1 లక్ష మెట్రిక్ టన్నుల బియ్యం, 3424 మెట్రిక్ టన్నుల పంచదారతో పాటు ఇతర నిత్యావసరాలను పంపిణీకి సిద్ధంగా ఉంచారన్నారు.
నిత్యావసరాల విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నారని చెప్పారు. హోమ్, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి అనిత, రెవెన్యూ శాఖ మంత్రి సత్య అనగాని సహాయ చర్యలను, ఆహారం, నిత్యావసరాల పంపిణీని సమన్వయం చేస్తున్నారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు.
ఇవి కూడా చదవండి...
బాహుదా నదికి పోటెత్తిన వరద.. ఇచ్ఛాపురం జలదిగ్భంధం
సరుకులు అందించండి.. నిర్వాసితులను ఆదుకోండి.. టెలీకాన్ఫరెన్స్‌లో సీఎం
Read Latest AP News And Telugu News