Liquor Don: కొనసాగుతున్న కసిరెడ్డి విచారణ
ABN , Publish Date - Apr 22 , 2025 | 09:54 AM
మద్యం కుంభకోణం కేసులో అరస్టయిన రాజ్ కసిరెడ్డిని సెట్ అధికారులు విజయవాడలోని విచారిస్తున్నారు. సోమవారం సాయంత్రం అత్యంత నాటకీయ పరిణామాల మధ్య రాజ్ కసిరెడ్డిని హైదరాబాద్ (శంషాబాద్) విమానాశ్రయంలో పోలీసులు అరెస్టు చేశారు. రాత్రికి రాత్రి ఆయనను విజయవాడకు తరలించారు.

విజయవాడ: లిక్కర్ డాన్ (Liquor Don) రాజ్ కసిరెడ్డి (Raj Kasireddy)ని ఎట్టకేలకు హైదరాబాద్ (Hyderabad)లో అరెస్టు (Arrest) చేసిన పోలీసులు (Police) విజయవాడ సీపీ కార్యాలయంలో విచారిస్తున్నారు. సోమవారం రాత్రి 11 గంటల నుండి మంగళవారం తెల్లవారుజామున 3 గంటల వరకు విచారించారు. సుమారు 4 గంటల పాటు రాజ్ కిసిరెడ్డిని సిట్ అధికారులు (SIT Officers) విచారించారు. తిరిగి మంగళవారం ఉదయం 7.30 గంటలకు మళ్ళీ విచారణ ప్రారంభించారు. కసిరెడ్డి నుండి సమాచారం రాబట్టేందుకు సెట్ బృందం ప్రయత్నాలు చేస్తోంది. సేకరించిన ఆధారాలు, పలువురి స్టేట్ మెంట్ల బట్టి రాజ్ కసిరెడ్డిని సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. కాగా వైసీపీ హయాంలో మద్యం కుంభకోణాన్ని నడిపించిన రాజ్ కసిరెడ్డి అలియాస్ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని ‘సిట్’ సిబ్బంది అరెస్టు చేశారు. ఇప్పటికి నాలుగు సార్లు విచారణకు రావాలని నోటీసులు ఇచ్చినా.. డుమ్మా కొట్టి... హైకోర్టు ఆదేశాలనూ బేఖాతరు చేసి... ‘తప్పించుకుని’ తిరుగుతున్న కసిరెడ్డి ఎత్తును పోలీసులు చిత్తు చేశారు. సోమవారం సాయంత్రం అత్యంత నాటకీయ పరిణామాల మధ్య రాజ్ కసిరెడ్డిని హైదరాబాద్ (శంషాబాద్) విమానాశ్రయంలో అరెస్టు చేశారు. రాత్రికి రాత్రి ఆయనను విజయవాడకు తరలించారు.
Also Read..: హైదరాబాద్: వ్యాపారవేత్త ఇంట్లో భారీ చోరీ
మరోవైపు మద్యం కుంభకోణం కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరిన రాజ్ కసిరెడ్డికి హైకోర్టులో ఊరట లభించలేదు. ఆయన పిటిషన్‌పై విచారణను వారం రోజులపాటు వాయిదా వేసింది. ఈ వ్యవహారంలో పూర్తి వివరాలు సమర్పించాలని సీఐడీ అధికారులను ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి.మల్లిఖార్జునరావు సోమవారం ఉత్తర్వులు ఇచ్చారు. న్యాయమూర్తి ఉత్తర్వులు ఇచ్చిన అనంతరం ఆన్‌లైన్ ద్వారా విచారణకు కసిరెడ్డి తరఫు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ దవే హాజరయ్యారు. మధ్యంతర ముందస్తు బెయిల్ కోరుతూ అనుబంధ పిటిషన్ వేశామని, అత్యవసరంగా దానిపై విచారణ జరపాలని కోరారు. న్యాయమూర్తి స్పందిస్తూ...ఇప్పటికే పిటిషన్‌ను వాయిదా వేశామని తెలిపారు. మంగళవారం కోర్టు విచారణ ప్రారంభ సమయంలో అభ్యర్థనను తమ ముందు ఉంచాలని సూచించారు. కాగా, మద్యం కుంభకోణం కేసులో తమను విచారించాలని భావిస్తే హైదరాబాద్‌లోని తమ నివాసంలో లేదా ఏదైనా తటస్థ ప్రదేశంలో అడ్వకేట్ సమక్షంలో విచారణ చేసేలా సిట్ దర్యాప్తు అధికారిని ఆదేశించాలంటూ రాజ్ కసిరెడ్డి తల్లిదండ్రులు ఉపేందర్‌రెడ్డి, సుభాషిని హైకోర్టులో అత్యవసరంగా పిటిషన్ దాఖలు చేశారు.
బీఎన్‌ఎస్‌ఎస్ చట్టనిబంధనలు అనుసరించేలా పోలీసులకు సూచించాలని పిటిషన్‌లో కోరారు. ఈ వ్యాజ్యాన్ని న్యాయస్థానం లంచ్‌మోషన్‌గా విచారణకు స్వీకరించింది. పిటిషనర్ల తరఫున న్యాయవాది దుష్యంత్‌రెడ్డి వాదనలు వినిపించారు. ‘‘దర్యాప్తు అధికారి ఇచ్చిన నోటీసులను అనుసరించి పిటిషనర్లు విజయవాడలోని సిట్ ముందు హాజరయ్యారు. విచారణ సందర్భంగా అధికారులు పిటిషనర్ ఉపేందర్‌రెడ్డిని దూషించారు. పిటిషనర్లు ఇద్దరూ 60 ఏళ్లకు పైబడి వయసు ఉన్నవారే. బీఎన్‌ఎస్‌ఎస్ చట్ట నిబంధనలు ప్రకారం వారిని ఇంటి వద్దే విచారించాల్సి ఉంటుంది.’’ అని వాదించారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ మెండ లక్ష్మీనారాయణ స్పందిస్తూ....బీఎన్‌ఎస్‌ఎస్ సెక్షన్ 179 మేరకు పిటిషనర్లను వారి ఇంటి వద్ద విచారించేందుకు అభ్యంతరం లేదన్నారు. విచారణ సందర్భంగా దూషణలకు పాల్పడ్డారని పోలీసు అధికారులపై చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. అధికారులను ప్రతివాదులుగా చేర్చడంపై అభ్యంతరం తెలిపారు. అధికారులపై చేసిన ఆరోపణలకు సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్ వేస్తామన్నారు. ఇరువైపుల వాదనలు పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి జస్టిస్ ఎన్.హరినాథ్... పిటిషనర్లను అడ్వకేట్ సమక్షంలో వారి ఇంటి వద్దే విచారించాలని సిట్ అధికారులను ఆదేశించారు. ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని స్పష్టంచేశారు. అధికారులపై పిటిషనర్లు చేసిన ఆరోపణలకు కౌంటర్ వేసేందుకు ప్రాసిక్యూషన్‌కు అనుమతిచ్చారు. విచారణను మే ఐదోతేదీకి వాయిదా వేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సినీ హీరో మహేష్ బాబుకు ఈడీ నోటీసులు
గరిష్ఠ స్థాయిల్ని తాకుతోన్న పసిడి..
For More AP News and Telugu News