Devineni Uma: అలాంటి వారిని ఉరి తీసినా పాపం లేదు.. వైసీపీపై దేవినేని ఫైర్
ABN , Publish Date - Nov 12 , 2025 | 04:14 PM
జగన్ దొంగలకు పెద్దన్నలా నిలిచారని దేవినేని ఉమా ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంకన్న స్వామితో పెట్టుకున్నారు కాబట్టే చిత్తుగా ఓడి 11 సీట్లకు పడిపోయారని వ్యాఖ్యలు చేశారు.
అమరావతి, నవంబర్ 12: వైసీపీ ఐదేళ్ల పాలనలో అఖిలాండ బ్రహ్మాండ నాయకుడి ప్రసాదంలో జరిగిన పాపం కోట్లాది మంది భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీశాయని మాజీ మంత్రి దేవినేని ఉమా (Former Minister Devineni Uma) విమర్శించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. హైకమాండ్ ఒత్తిడితో కల్తీ నెయ్యికి సహకరించానని, సుబ్బారెడ్డికి అంతా తెలిసే కల్తీ జరిగిందని ధర్మారెడ్డి సిట్ విచారణలో వెల్లడించినట్టు న్యూస్ అందరూ చూస్తున్నారని తెలిపారు. ఏళ్ల తరబడి ధర్మారెడ్డి.. తాడేపల్లి ప్యాలస్, సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి కనుసన్నల్లో టీటీడీలో పెత్తనం చేశారన్నారు.
శ్రీవారి ప్రసాదాన్ని కల్తీ చేసిన దొంగల్లో ధర్మారెడ్డి దొరికారని... తర్వాత సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి వంతు వస్తుందన్నారు. దేవుడంటే భయం, భక్తి లేని దొంగల ముఠా.. నెయ్యిని ఎలా కల్తీ చేశారో సుప్రీం కోర్టు పరివేక్షణలో సిట్ బయటపెట్టిందన్నారు. రాజశేఖర్ రెడ్డి పాలనలో హైదరాబాద్‌లో వందల కోట్ల భూకబ్జాలు చేసి సీబీఐ, ఈడీ విచారణను ఎదుర్కొంటున్న ఏ6 ముద్దాయి వైవీ సుబ్బారెడ్డి అంటూ వ్యాఖ్యలు చేశారు. హార్ష్ ఫ్రెష్ ఫుడ్స్, హార్ష్ డెయిరీ పేరుతో భోలే బాబా పామాయిల్, తప్పుడు బిల్లులతో 6.5 లక్షల కిలోల మోనోగ్లిసరైడ్, అసిటిక్ యాసిడ్ ఎస్టర్‌లతో నెయ్యి తయారు చేశారని మండిపడ్డారు.
పాలు, వెన్న లేకుండా జగన్మోహన్ రెడ్డి బాబాయి సుబ్బారెడ్డి టన్నుల కొద్దీ నెయ్యి తయారు చేయించారని విమర్శించారు. వైసీపీ పాలనలో అన్నదానంలో రేషన్ బియ్యం పెట్టి తిరుమల పవిత్రత దెబ్బతీశారని మండిపడ్డారు. ఏళ్లతరబడి శ్రీవారి పరకామణిలో విదేశీ కరెన్సీని కొల్లగొట్టిన కేసులో నిందితుడైన రవికుమార్‌తో రాజీ చేసుకుని అతని ఆస్తులను టీటీడీ పేరిట రాయించి దొంగలకు పెద్దన్నలాగా జగన్ రెడ్డి నిలిచారంటూ వ్యాఖ్యలు చేశారు. వెంకన్న స్వామితో పెట్టుకున్నారు కాబట్టే చిత్తుగా ఓడి 11 సీట్లకు పడిపోయారని... ఇలాంటి దుర్మార్గులను ఉరి తీసిన పాపం లేదంటూ ఫైర్ అయ్యారు.
కలియుగ వెంకన్న స్వామి ప్రసాదాన్ని కల్తీ చేసిందే కాకుండా ఇంకా తప్పుడు వార్తలతో భక్తుల మనోభావాలు దెబ్బతీస్తూ ఇంకా దిగజారుతున్నారన్నారు. ప్రమాదకర రసాయనాలతో తయారైన నెయ్యిని శ్రీవారి ప్రసాదంలో ఉపయోగించి ఇంకా సమర్థించుకుంటారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పారదర్శకత అంటున్న వైసీపీ ముఠా.. అజయ్ సుగంధ్ రిమాండ్ రిపోర్టు అంశాలపై ఏం సమాధానం ఇస్తారని దేవినేని ఉమా ప్రశ్నించారు.
ఇవి కూడా చదవండి...
విశాఖ సీఐఐ సమ్మిట్.. చంద్రబాబు పర్యటన అప్‌డేట్స్
టీటీడీ కల్తీ నెయ్యి కేసు... సీబీఐకి ధర్మారెడ్డి కీలక సమాచారం
Read Latest AP News And Telugu News