CM Chandrababu: రాజధానిలో వెంకన్న ఆలయ విస్తరణకు సీఎం భూమి పూజ
ABN , Publish Date - Nov 27 , 2025 | 11:32 AM
రాజధానిలో వేంకటేశ్వరస్వామి ఆలయ విస్తరణకు సీఎం చంద్రబాబు నాయుడు భూమి పూజ చేశారు. ఎప్పుడూ కూడా వేంకటేశ్వర స్వామికి అప్రతిష్ట పాలు తెచ్చే పనిని చెయ్యనని.... ఎవరినీ చేయనివ్వనని స్పష్టం చేశారు.
అమరావతి, నవంబర్ 27: దేవతల రాజధాని అమరావతి అయితే... ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) అన్నారు. రాజధానిలో వేంకటేశ్వరస్వామి ఆలయ విస్తరణకు సీఎం భూమి పూజ చేశారు. అనంతరం ఓం నమో వేంకటేశాయ అంటూ సీఎం చంద్రబాబు ఉపన్యాసాన్ని ప్రారంభించారు. కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి ఈ యుగంలో ఏపీలో అవతరించారన్నారు. 2019లో ఆలయాన్ని నిర్మించాలని సంకల్పం చేశామని గుర్తుచేశారు. ఈ ప్రాంతానికి పేరు పెట్టినప్పుడే వేంకటేశ్వర స్వామి తన ద్వారా సంకల్పించారని తెలిపారు.
ఇక్కడి రైతాంగం 29 వేల మంది 33,000 ఎకరాల భూమిని స్వచ్ఛందంగా ఇచ్చారని.. వారిని అభినందిస్తూ ధన్యవాదాలు తెలియజేశారు. వారికి ఆ సంకల్పాన్ని వేంకటేశ్వర స్వామి కల్పించారన్నారు. కృష్ణానది తీరాన పవిత్రమైన శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానం నిర్మితమైందని తెలిపారు. 1983లో తిరుమలలో అన్నదానాన్ని ఎన్టీఆర్ ప్రారంభిస్తే.. 2003లో ప్రాణదానం కార్యక్రమాన్ని స్విమ్స్‌లో ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. ‘మా ఇంటి దైవం వేంకటేశ్వర స్వామి... మా ఇంటి నుంచి చూస్తే ఆయన నామాలు కనిపిస్తాయి’ అని చెప్పుకొచ్చారు. ఎప్పుడూ కూడా వేంకటేశ్వర స్వామికి అప్రతిష్ట పాలు తెచ్చే పనిని చెయ్యనని.... ఎవరినీ చేయనివ్వనని స్పష్టం చేశారు. వేంకటేశ్వర స్వామి వద్దకు ఎప్పుడు వెళ్ళినా క్యూ లైన్‌లోనే వెళతానని తెలిపారు. ముఖ్యమంత్రిగా కాదు... భక్తుడిగా వెళతానని సీఎం అన్నారు. కొందరు తప్పులు చేస్తారని.. తప్పు చేసిన వారికి ఇంకో జన్మలో శిక్ష ఉంటుందనుకుంటారని.. అయితే తప్పు చేస్తే మాత్రం వేంకటేశ్వర స్వామి ఈ జన్మలోనే శిక్షిస్తారన్నారు.
గడచిన ప్రభుత్వం విధ్వంసం తప్ప మంచి చేసిన పరిస్థితులు లేవని విమర్శించారు. ఐదేళ్లు ఇక్కడ రైతులకు నరకాన్ని చూపించారన్నారు. వేంకటేశ్వర స్వామిని రైతులు నమ్ముకున్నారని.. న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు పాదయాత్ర చేసిన ఈ ప్రాంత రైతులను అభినందిస్తున్నట్లు తెలిపారు. ఈ దేవాలయాన్ని రూ.260 కోట్లతో పూర్తి చేస్తామన్నారు. తిరుపతి ప్రాంగణం తరహాలోనే ఇక్కడ గుడిని నిర్మిస్తామని.. రెండున్నర సంవత్సరాల్లో పూర్తి చేస్తామని ప్రకటించారు. దేవాలయాల నిర్మాణానికి దాతలు కూడా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఆరోగ్యం, ఆనందం, సంపద ప్రతి ఒక్కరికి అందించాలని వేంకటేశ్వర స్వామి ప్రార్థిస్తున్నానని అన్నారు. దేవతల రాజధాని అమరావతి నమూనాగా ఈ అమరావతి ఉండాలని వేంకటేశ్వర స్వామిని కోరుతున్నట్లు తెలిపారు. చివరగా.. ఓం నమో వేంకటేశాయ అంటూ సీఎం చంద్రబాబు ఉపన్యాసాన్ని ముగించారు.
ఇక.. రాజధానిలో వేంకటేశ్వరస్వామి ఆలయ విస్తరణకు ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా భూమిపూజ జరిగింది. రెండు దశల్లో రూ.260 కోట్లతో ఆలయ అభివృద్ధి పనులు జరుగనున్నాయి. ఆలయ ప్రాకారం, మహా రాజగోపురం, మండపాలు, ఆంజనేయస్వామి ఆలయాల నిర్మాణం జరుగనుంది. మాడ వీధులు, అన్నదాన కాంప్లెక్స్ తదితర నిర్మాణాలకు సీఎం చంద్రబాబు చేతుల మీదుగా శంకుస్థాపన జరిగింది. మొదటి దశలో రూ.140 కోట్లు వ్యయంతో వివిధ పనులు నిర్వహించనున్నారు. రూ.92 కోట్లతో ఆలయం చుట్టూ మహాప్రాకారం నిర్మాణం జరుగనుంది. ఏడంతస్తుల మహా రాజగోపురం, ఆర్జిత సేవా మండపం, అద్దాల మండపం, వాహన మండపం, రథ మండపం, ఆంజనేయ స్వామి ఆలయం, పుష్కరిణి, కట్ స్టోన్ ఫ్లోరింగ్‌ల నిర్మించనుండగా.. వీటి నిర్మాణాలకు రూ.48 కోట్లు ఖర్చు చేయనున్నారు.
ఇక రెండోదశ పనులను రూ.120 కోట్లతో టీటీడీ చేపట్టనుంది. శ్రీవారి ఆలయ మాడ వీధులు, అప్రోచ్ రోడ్లు, అన్నదాన కాంప్లెక్స్, యాత్రికులకు విశ్రాంతి భవనం, అర్చకులు-సిబ్బందికి క్వార్టర్స్, రెస్ట్ హౌస్, పరిపాలనా భవనం, ధ్యాన మందిరం, వాహనాల పార్కింగ్ వంటి పనులను కూడా చేపట్టాలని నిర్ణయించారు. ఇప్పటికే ఆలయ నిర్మాణం మొదటి విడత పూర్తైన నేపథ్యంలో నేడు శంకుస్థాపన అనంతరం రెండు, మూడవ విడత పనులకు శ్రీకారం చుట్టారు. 4వ విడత పనులను కూడా త్వరలోనే చేపట్టి టెండర్లు పిలిచే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి...
సికింద్రాబాద్-అనకాపల్లి మధ్య ప్రత్యేక రైళ్లు
రైతుల సమస్యల పరిష్కారంపై త్రిసభ్య కమిటీ ఫోకస్
Read Latest AP News And Telugu News