Chandrababu - lokesh Tribute: కస్తూరిరంగన్ మృతిపట్ల సీఎం చంద్రబాబు, లోకేష్ సంతాపం
ABN , Publish Date - Apr 25 , 2025 | 04:27 PM
Chandrababu, lokesh Tribute: ఇస్రో మాజీ చైర్మన్ కస్తూరి రంగన్ మృతి దేశానికి తీరని లోటు అని ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మృతిపట్ల ప్రగాఢ సంతాపం తెలియజేశారు.

అమరావతి, ఏప్రిల్ 25: ఇస్రో మాజీ చైర్మన్ డాక్టర్ కె.కస్తూరి రంగన్ (Former ISRO Chairman K. Kasturirangan) మృతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu), రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) సంతాపం తెలిపారు. సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా సీఎం చంద్రబాబు స్పందిస్తూ.. డాక్టర్ కె.కస్తూరి రంగన్ ఒక అసాధారణమైన శాస్త్రవేత్త అని కొనియాడారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చైర్మన్‌గా, తొమ్మిది సంవత్సరాల పాటు భారతదేశం యొక్క అంతరిక్ష కార్యక్రమాలను విజయవంతంగా నడిపించారని అన్నారు. అంతరిక్ష శాస్త్రం కంటే మించి ఆయన సేవలు విస్తరించాయన్నారు.
ఒక విద్యావేత్తగా, జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపీ) 2020ను రూపొందించడంలో కీలక పాత్ర పోషించారని అన్నారు. భారతదేశంలోని విద్యా భవిష్యత్తును ఒక రూపు ఇచ్చారని చెప్పుకొచ్చారు. అత్యున్నత పురస్కారమైన పద్మ విభూషణ్ పురస్కారం ఆయనకు లభించిందన్నారు. భారతదేశపు అత్యంత ప్రతిష్టాత్మకమైన అంతరిక్ష- ఆధారిత హై ఎనర్జీ ఆస్ట్రానమీ ఒబ్జర్వేటరీని కస్తూరి రంగన్ ఆధ్వర్యంలో ముందుకు తీసుకు వెళ్లారని అన్నారు. ఇది ఆయన నాయకత్వంలో ఒక మైలురాయిగా నిలిచిందన్నారు. ఆయన మరణం దేశానికి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి లభించాలని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులు, స్నేహితులు, సహోద్యోగులకు ప్రగాడ సానుభూతి తెలియజేస్తున్నాను అంటూ సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు.
దేశానికి తీరని లోటు: మంత్రి లోకేష్
ఇస్రో మాజీ ఛైర్మన్ కె.కస్తూరి రంగన్ (84) కన్ను మూశారన్న వార్త తనను తీవ్ర ఆవేదనకు గురిచేసిందని మంత్రి నారా లోకేష్ అన్నారు. భారత అంతరిక్ష పరిశోధనా రంగంలో విశేష సేవలు అందించిన కస్తూరి రంగన్ మృతి దేశానికి తీరనిలోటన్నారు. 1994 నుంచి 2003 వరకు ఇస్రో ఛైర్మన్‍గా ఉన్న కస్తూరిరంగన్... పీఎస్ఎల్వీ, జీఎస్ఎల్వీ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారని కొనియాడారు. 2020 జాతీయ విద్యా విధానం రూపకల్పన కమిటీ ఛైర్మన్‍గా విశేష సేవలందించారని తెలిపారు. 2003-09 మధ్య రాజ్యసభ సభ్యుడిగా పని చేసిన కస్తూరిరంగన్ పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ వంటి ఎన్నో పురస్కారాలు అందుకున్నారన్నారు. కస్తూరి రంగన్ మృతికి ఘన నివాళులు అర్పిస్తూ ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుని ప్రార్ధిస్తున్నానని మంత్రి లోకేష్ పేర్కొన్నారు.
కాగా.. ఇస్రో మాజీ చైర్మన్ కస్తూరి రంగన్ (84) కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. బెంగుళూరుని నివాసంలో తుది శ్వాస విడిచారు. ఇస్రో చైర్మన్ అంతరిక్ష రంగంలో భారత్‌ను అత్యన్నత స్థాయికి తీసుకెళ్లిన వ్యక్తి కస్తూరి రంగన్. దాదాపు తొమ్మిదేళ్ల పాటు ఇస్రో చైర్మన్‌గా పనిచేసిన ఆయన.. ఆగస్టు 27, 2003లో పదవీ విరమణ చేశారు. కస్తూరి రంగన్ మృతిపట్ల ప్రధాని మోదీతో పాటు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేశారు.
ఇవి కూడా చదవండి
Borugadda Anil Supreme Court: బోరుగడ్డ అనిల్‌కు సుప్రీంలో చుక్కెదురు
CM Yogi Emotional Video: శుభం కుటుంబాన్ని చూసి సీఎం యోగి కంటతడి.. వీడియో
Read Latest AP News And Telugu News