Buddha Venkanna: జోగి రమేష్, జగన్ లింకులు బయటకు వస్తాయి..
ABN , Publish Date - Nov 02 , 2025 | 01:53 PM
చంద్రబాబు, లోకేష్ లకు అరెస్టుతో సంబంధం లేదని బుద్దా వెంకన్న స్పష్టం చేశారు. జోగి రమేష్‌కు బీసీ కార్డు వేసుకోవడానికి సిగ్గుండాలని విమర్శించారు.
విజయవాడ: మాజీ మంత్రి జోగి రమేష్‌పై టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న ఫైర్ అయ్యారు. తప్పులు చేయడం, సమర్ధించుకోవడం వైసీపీ డీఎన్ఏలోనే ఉందని విమర్శించారు. కల్తీ మద్యం కేసులో జోగి రమేష్ జైలుకు వెళ్లడం ఖాయమని ఎప్పుడో తేలిందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జోగి రమేష్ ఒక బచ్చా... ఆయన గురించి ఆలోచన చేయడం సీఎం చంద్రబాబుకు అవసరం లేదని తెలిపారు. జనార్ధన్ రావు ఇచ్చిన సమాచారంతో జోగి రమేష్‌ను అరెస్టు చేశారని స్పష్టం చేశారు. విచారణలో జోగి రమేష్.. మాజీ సీఎం జగన్ పేరు చెబుతారని ఆయన పేర్కొన్నారు.
చంద్రబాబు, లోకేశ్‌లకు అరెస్టుతో సంబంధం లేదని బుద్దా వెంకన్న స్పష్టం చేశారు. జోగి రమేష్‌కు బీసీ కార్డు వేసుకోవడానికి సిగ్గుండాలని విమర్శించారు. దోచిన ఆస్తులను బీసీలకు పంచి పెట్టాలన్నారు. జగన్‌కు కూడా ఈ నకిలీ మద్యం కేసులో పాత్ర ఉందని తెలిపారు. మద్యం కుంభకోణం కేసులో కూడా తాడేపల్లి ప్యాలెస్‌కు డబ్బు చేరినట్లు అధికారులు నిర్ధారించారన్నారు. అసలు ఈ నకిలీ మద్యం వ్యవహారం గత ప్రభుత్వంలో ఎందుకు బయట పెట్టలేదని నిలదీశారు.
బాబాయిని చంపలేదని, రూ.42 వేలకోట్లు దోచుకోలేదని జగన్ ప్రమాణం చేస్తే తప్పు చేయనట్లేనా.. అని వెంకన్న ప్రశ్నించారు. డైవర్షన్ పాలిటిక్స్, దొంగ ప్రమాణాలు, దోచుకోవడం వంటివి జగన్‌కే తెలుసని ఆరోపించారు. జగన్ పెద్ద దొంగ, జోగి రమేష్ లాంటి వాళ్లు చిన్న దొంగలు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారంలో ఉంటే రంకెలు వేసే రమేష్.. ఇప్పుడు పోలీసులు రాగానే బాత్రూమ్‌లో దాక్కున్నారని ఎద్దేవా చేశారు. దమ్ముంటే అరెస్టు చేయండి అన్న రమేష్.. ఇప్పుడు చంద్రబాబు వల్లే అరెస్టు అనడం ఏమిటని చెప్పుకొచ్చారు. ఈ రాష్ట్రాన్ని నాశనం చేసిన వారిలో జగన్, జోగి రమేష్ వంటి వారు చాలా మంది ఉన్నారన్నారు.
జనార్ధన్ రావుతో జోగి రమేష్‌కు లింకు ఉందని అధికారుల విచారణలో తేలిందని వెంకన్న స్పష్టం చేశారు. ఇప్పుడు జోగి రమేష్‌కు, జగన్‌కు ఉన్న లింకు బయటకు రాబోతుందని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కేసు విచారణ పూర్తి అయితే.. ఇంకా పెద్ద వాళ్ల పేర్లు బయటకు వస్తాయన్నారు. వైసీపీ నేతలు.. కల్తీ మద్యం పేరుతో ప్రజలకు స్లో పాయిజన్ ఇచ్చారని మండిపడ్డారు. వారి ప్రాణాలు తీసి.. డబ్బులు దోచుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జోగి రమేష్ ఈ కేసులో కీలక నిందితుడని ఆయన చెప్పుకొచ్చారు.
మద్యం షాపుల్లో ఆన్‌లైన్ లావాదేవీలు లేకుండా చేసి కోట్లు దోచేసిన వ్యక్తి జగన్ అని వెంకన్న ఆరోపించారు. జగన్ డైవర్షన్ రాజకీయాలు చేయడంలో దిట్ట అని విమర్శించారు. దొంగతనాలు, దోపిడీలు, హత్యలు వారికే అలవాటని దుయ్యబట్టారు. టీడీపీ డీఎన్ఏలో ఎటువంటి మోసాలు లేవని స్పష్టం చేశారు. కల్తీ మద్యం కేసులో పాత్రధారులు, సూత్రధారులు అందరూ జైలుకు వెళ్లడం ఖాయమని టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న వెల్లడించారు.
ఇవి కూడా చదవండి..
PM Modi: దేశానికి త్వరలో మావోయిస్టు హింస నుంచి విముక్తి
Indias Heaviest Communication Satellite: ఇస్రో భారీ ప్రయోగం