Ayyanna Serious on Jagan: జగన్ ప్రతిపక్ష హోదాపై స్పీకర్ క్లారిటీ
ABN , Publish Date - Mar 05 , 2025 | 09:49 AM
Ayyanna Serious on Jagan: వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదాపై క్లారిటీ ఇచ్చేశారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు. అలాగే తనపై వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారంపై స్పీకర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. .

అమరావతి, మార్చి 5: ప్రతిపక్ష హోదా కోసం వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Former CM YS Jagan Mohan Reddy) పోరాడుతూనే ఉన్నారు. ప్రతిపక్ష హోదా ఇచ్చే వరకు అసెంబ్లీకి రావొద్దని నిర్ణయించిన వైసీపీ అధినేత.. యూటర్న్ తీసుకుని అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తొలిరోజు సభకు వచ్చారు. గవర్నర్ ప్రసంగం జరుగుతుండగా వైసీపీ పార్టీ నేతలు గందరగోళం సృష్టించినప్పటికీ నవ్వుతూ కూర్చున్నారే తప్ప వారిని నిలువరించలేదు. ఆ తరువాత కొద్ది నిమిషాలకే బాయ్‌కాట్ చేస్తూ జగన్, ఆ పార్టీ సభ్యులు సభ నుంచి వెళ్లిపోయారు. జగన్ తీరుపై అధికారపక్షం నేతలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు కూడా.
ఇదిలా ఉండగా.. ప్రతిపక్ష హోదాకు సంబంధించి గత ఏడాది జూన్‌లో అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడికి జగన్ సంచలన లేఖ రాసిన విషయం తెలిసిందే. ప్రతిపక్ష నాయకుడికి హోదా ఇవ్వకూడదని ముందుగానే నిర్ణయించినట్టు ఉన్నారంటూ జగన్ ఆ లేఖలో పేర్కొనడం అప్పట్లో హాట్‌టాపిక్‌గా నిలిచింది. ఇప్పుడు తాజాగా జగన్ రాసిన లేఖను స్పీకర్ సభలో ప్రస్తావించారు. అలాగే దీనిపై హైకోర్టును కూడా జగన్ ఆశ్రయించినట్లు తెలిపారు. అయితే హైకోర్టు స్పీకర్‌ను ఆదేశించినట్లు వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ సభలో అయ్యన్న ఆగ్రహం వ్యక్తం చేశారు.
Corruption : విడదల రజనీపై ఏసీబీ కేసు!
సభలో స్పీకర్ ఏమన్నారంటే..
‘‘జగన్ 24-06-2024న నాకు ఓ లేఖ రాశారు. దానిలో అభియోగాలు, ప్రేలాపనలు, బెదిరింపులు ఉన్నాయి. ఈ లేఖలో ప్రతిపక్ష హోదా కావాలన్నారు. ఈ లేఖ రాసిన కొద్దిరోజులకు జగన్ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. శాసనసభ కార్యదర్శిని, స్పీకర్ కార్యదర్శిని ఆదేశించాలని రిట్ పిటిషన్ వేశారు. రిట్ పిటిషన్ తీసుకోవాలా వద్దా అనే దశలో ఉంది. దీనిలో స్పీకర్‌ను, శాసనసభ వ్యవహరాల మంత్రిని పార్టీలను చేరుస్తూ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై ఏం జరుగుతుందో చూద్దాం అనుకున్నాం. అయితే గౌరవ హైకోర్టు స్పీకర్‌ను ఆదేశించినట్టు ప్రచారం చేస్తున్నారు. జగన్ ఇలాంటి ప్రచారం చేయడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. దానిలో ఆయన కల్పిత విషయాలను ప్రస్తావించారు. జగన్‌మోహన్ రెడ్డి గౌరవ న్యాయస్ధానాన్ని చూపుతూ చేస్తున్న అవాకులు, చవాకులపై రూలింగ్ ఇస్తున్నాను’’ అని అన్నారు.
‘‘ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని శాసనసభ్యుడిగా క్రమంలోనే మాజీ ముఖ్యమంత్రిగా మంత్రుల తరువాత ఆహ్వనించారు. 11-1-1995న జరిగిన ప్రమాణంలో మాజీ ముఖ్యమంత్రిని మంత్రుల తరువాతే ప్రమాణం చేయించారు. ఏపీ 16వ శాసనసభ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం 21-06-2024న జరిగింది. స్పీకర్ ఎన్నిక మరునాడు జరిగింది. ప్రతిపక్ష నాయకుడిగా నిరాకరించామన్న వాదన సరికాదు. జగన్‌మోహన్ రెడ్డి వైసీపీ శాసనసభా పక్షనాయకుడిగా ఎన్నికైనట్టు 26-06-2024 వరకూ మా సచివాలయానికి తెలపలేదు. అలాంటప్పుడు జూన్ 26 కన్నా ముందు అందునా స్పీకర్ ఎన్నిక జరగక ముందు ప్రతిపక్షనాయకుడు హోదాపై నిర్ణయం తీసుకోవడం సాధ్యామా. ప్రతిపక్ష నాయకుడిగా ఎవ్వరైనా అర్హుడా లేదా అనేది రాజ్యాంగం, కోర్టు తీర్పులు మాత్రమే నిర్ధారించగలవు’’ అంటూ స్పీకర్ సభలో పేర్కొన్నారు.
సభాపతి నిర్ణయమే ఫైనల్
ఏపీ వేతనాలు ఫించన్ చెల్లింపు అనర్హత చట్టం 1953లో ప్రతిపక్ష నాయకుడి హోదా ప్రస్తావన ఉందన్నారు. ఆ చట్టంలోని సెక్షన్ 12బి ప్రకారం ప్రతిపక్ష నాయకుడు చట్ట సభలో సభ్యుడు అయి ఉండాలని తెలిపారు. వారు ప్రభుత్వ వ్యతిరేఖ రాజకీయ నాయకుడిగా సభలో ఉండాలని.. ప్రతపక్షంలో ఉన్న పార్టీకి అత్యధిక సంఖ్యా బలం ఉండాలని చెప్పారు. ఆ వ్యక్తిని సభాపతి ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించాలన్నారు. అత్యధిక సంఖ్యా బలం ప్రతిపక్షాలు ఒకటి కన్నా ఎక్కువగా ఉంటే పార్టీ హోదాను దృష్టిలో ఉంచుకుని వారిలో ఏదో ఒక నాయకుడిని సభాపతి నిర్ణియించవచ్చని.. ఈ విషయంలో సభాపతి నిర్ణయమే ఫైనల్ అవుతుందని తెలిపారు. సభలో మొత్తం సభ్యులలో పదింట 1 వంతు సభ్యులు ఉండాలని.. దీన్ని పార్లమెంట్‌తో పాటు అన్ని శాసనసభలలో పాటిస్తున్నారని చెప్పారు. ఇలాంటి డైరెక్షన్‌ను గతంలో నెంబర్ 56 జారీ చేశారని గుర్తుచేశారు. దీనికి మూలాలు రాజ్యాంగం 100(3), 189(3) అధీకరణలలో ఉన్నాయన్నారు. చట్ట సభల నిర్వహణలో 10 ఇంట 1 వంతు కోరమ్‌గా నిర్ణయించారని తెలిపారు. స్పీకర్‌కు ఈ విషయంలో మార్గం చూసేది ఈ డైరెక్షనే అని చెప్పుకొచ్చారు. ఏ ఒక్క ప్రతిపక్ష పార్టీకి 1972 -77 మధ్య, 1994-99 మధ్య కాలంలో 10 శాతం సీట్లు రాలేదని.. దీంతో ఎవ్వరికి ప్రతిపక్షం హోదా రాలేదని వెల్లడించారు. 5,7,8,16,17 లోక్‌సభలోనూ ఎవ్వరికీ 10 శాతం సీట్లు రాకపోవడంతో ప్రతిపక్షహోదా ఎవ్వరికి రాలేదని గుర్తుచేశారు. ఇటీవల ప్రతిపక్షంలో ఉన్న తెలుగు రాష్ట్రంలో 20-01-2019న ప్రతిపక్షంలో ఉన్న అతిపెద్ద పార్టీకి సభాపతి గుర్తింపు ఇచ్చారని తెలిపారు. అయితే 9-06-2019న సభలో సంఖ్యా బలం 10 శాతం కన్నా తగ్గిందని నిర్ధారణకు రాగానే సభాపతి ప్రతిపక్ష నాయకుడి హోదాను తొలగించారని స్పీకర్ తెలిపారు.
జగన్‌ను క్షమిస్తున్నా...
20-06-2019న ఇదే సభలో ప్రసంగిస్తూ జగన్ చెప్పిన మాటలు గుర్తు చేయాలన్నారు. చంద్రబాబు నాయుడుకు 23 మంది సభ్యలు ఉన్నారని.. ఆయన వద్ద నుంచి ఐదుగురిని లాగేస్తే ఆయనకు 18 మంది కూడా ఉండరేమో 17 మంది ఉంటారు అయనకు ప్రతిపక్షహోదా స్టేటస్ కూడా ఉండదేమో అని ఆయన ఇదే హౌస్‌లో చెప్పారని గుర్తుచేశారు. జగన్ నాడు చెప్పిన మాటలు వినిపించాలని సభ్యులు కోరగా.. అందుకు స్పీకర్ అంగీకరించారు. ప్రతిపక్షనాయకుడిగా గుర్తింపు పొందాలంటే 10 శాతం సంఖ్యాబలం ఉండాలని ఆయన ప్రసంగం స్పష్టం చేస్తోందన్నారు. ఆయన కోరి మతిమరపు తెచ్చుకోవడం మాజీ ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నేతగా ఆయనకు తగదన్నారు. రాజ్యాంగం సభా నిబంధనల ప్రకారం స్పీకర్‌కు దురద్దేశాలు ఆపాదించడం సభా ఉల్లంఘనకిందకు వస్తుందని అందరికి తెలుసన్నారు. అయినా జగన్ ఇప్పటి వరకూ సాగించిన దుష్ప్రాచారాన్ని సంధి ప్రేలాపనలుగా భావించి సభాపతి హోదాలో క్షమిస్తున్నానట్లు చెప్పారు. ఇదే కోనసాగితే నిర్ణయాన్ని సభ్యులకు వదిలి పెడతానని తెలిపారు.
నేను పూజారిని మాత్రమే...
సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్లు.... అలాంటి ప్రజలు ఎన్నుకున్న దేవాలయం ఈ సభ అని తెలిపారు. ‘‘ఈ దేవాలయానికి నేను పూజారిని మాత్రమే. స్పీకర్‌గా దేవుడు తిరస్కరించిన వరాన్ని పూజారిగా ఆశించడం కరెక్టేనా. దేవుడు 11 మందిని మాత్రమే ఇచ్చారు. ఈ సందర్భంగా సభకు దూరంగా ఉంటున్న సభ్యులకు నా విజ్జప్తి మీ నియోజకవర్గాల ప్రజలు ఇచ్చిన బాధ్యతను గుర్తించి ప్రజల గొంతు వినిపించడానికి సభకు రావాలని రాజ్యాంగ భాద్యతను సమర్ధవంతంగా నిర్వహించాలని విజ్జప్తి చేస్తున్న’’ అంటూ ఈ వివరాలను వెల్లడిస్తూ స్పీకర్ అయ్యన్న పాత్రుడు రూలింగ్ ఇచ్చారు.
ఇవి కూడా చదవండి...
Chandrababu : వైసీపీ ఆటలు సాగనివ్వను
Karimnagar: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో.. బీజేపీ ముందంజ
Read Latest AP News And Telugu News