Kolusu Partha sarathy : ప్రజలతో దురుసుగా ప్రవర్తించొద్దు
ABN , Publish Date - Feb 12 , 2025 | 04:33 AM
ప్రజల పట్ల దురుసుగా ప్రవర్తించవద్దని, వారి సమస్యలను ఓపికగా విని, సానుకూలంగా స్పందించాలని సీఎం చంద్రబాబు సూచించారు.

ఈ నెలాఖరులోగా ఈ- ఆఫీ్‌సతో శాఖలన్నీ అనుసంధానం
రాష్ట్రాభివృద్ధి లక్ష్యంగా బడ్జెట్ ప్రతిపాదనలు
అధికారులు, మంత్రులకు ముఖ్యమంత్రి ఆదేశం
వివరాలు వెల్లడించిన మంత్రి పార్థసారథి
అమరావతి, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి): ప్రజల పట్ల దురుసుగా ప్రవర్తించవద్దని, వారి సమస్యలను ఓపికగా విని, సానుకూలంగా స్పందించాలని సీఎం చంద్రబాబు సూచించారు. మంగళవారం అమరావతి సచివాలయంలో మంత్రులు, కార్యదర్శుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సీఎం ఏమన్నది మంత్రి పార్థసారథి విలేకరులకు తెలిపారు. ‘‘గత ప్రభుత్వం విధ్వంస పరిపాలన చేసింది. వ్యవస్థలను కూల్చివేసింది. దీంతో ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకువచ్చారు. ప్రజల ఆశలను సాకారం చేసేవిధంగా శాఖలు పని చేయాలి. దానికి అనుగుణంగా లక్ష్యాలు నిర్దేశించుకోవాలి. వ్యవస్థలకు మళ్లీ పూర్వవైభవం తీసుకు వచ్చి రాష్ట్ర పరిస్థితులను గాడిలో పెట్టాలి. ఈ-ఆఫీసు అమలుపై అధికారులు సమీక్షలు నిర్వహించాలి. ప్రభుత్వంలోని అన్ని శాఖలను నెలాఖరుకల్లా ఈ-ఆఫీ్‌సతో అనుసంధానం చేయాలి. ప్రజలతో వ్యవహరించే తీరు బాగుండాలి. వారు సంతృప్తిపడే విధంగా అధికారుల ప్రవర్తన ఉండాలి. వారి సమస్యలు ఓపిగ్గా విని వాటిని సాధ్యమైనంత వరకు పరిష్కరించడానికి ప్రయత్నం చేయాలి.’’
స్వర్ణాంధ్ర లక్ష్యంగా పనితీరు మెరుగుపడాలి
‘‘2025-26 బడ్జెట్‌ను రాష్ట్రాభివృద్ధికి దోహదపడేలా రూపొందించాలి. స్వర్ణాంధ్ర-2047 లక్ష్యంగా ప్రభుత్వ శాఖలు తమ పనితీరును మెరుగుపరుచుకోవాలి. 15శాతం వృద్ధి రేటును సాధించ డం, తలసరి ఆదాయం 42,000 డాలర్లకు చేర్చడమే లక్ష్యం. 2047 నాటికి ఏపీని 2.4 ట్రిలియన్ డాలర్ల జీఎ్‌సడీపీ ఆర్థిక వ్యవస్థగా మార్చాలనేది ధ్యేయం. తెలంగాణలో పోలిస్తే జీఎ్‌సడీపీలో రూ.87,000 కోట్ల లోటు ఉంది. జీఎ్‌సడీపీ లక్ష్యాలను చేరుకోవడానికి వ్యూహాత్మక విధానం అవసరం. రాష్ట్రంలో కొనుగోలు శక్తిని పెంచాలి. కేంద్రం వద్ద మిగిలిన నిధులను అందిపుచ్చుకోవాలి. కేంద్రం నుంచి నిధులు రాబట్టుకోవడానికి మంత్రులు, అధికారులు కృషి చేయాలి. స్వర్ణాంధ్ర-2047 విజన్ సాధించడానికి రాష్ట్ర స్థాయిలో విజన్ మానిటరింగ్ యూనిట్ ఏర్పాటు చేయాలి. జిల్లాల ద్వారా నియోజకవర్గ స్థాయిలో ప్రణాళికలు రూపొందించాలి. జీఎ్‌సడీపీ వృద్ధికి దోహదపడే ప్రాజెక్టులను గుర్తించి, వాటిని ప్రత్యేక పోర్టల్ ద్వారా ట్రాక్ చేయాలి. ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ పనితీరు మారాలి. మున్సిపల్, రెవెన్యూ, హోం, పంచాయతీరాజ్, పౌర సరఫరాల విభాగాల్లో సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. పెన్షన్ల పంపిణీలో లబ్ధిదారులతో దురుసుగా ప్రవర్తించొద్దు. పెన్షన్లు ఇచ్చేటప్పుడు అధికారుల తీరుబాగుండాలి. ప్రభుత్వ ఉద్యోగులకు నిరంతర శిక్షణ కోసం మిషన్ కర్మయోగి కార్యక్రమం, నైపుణ్యాభివృద్ధికి ఐఎండీ స్విట్జర్లాండ్ సహకారం తీసుకోవాలి. ప్రభుత్వ ప్రాజెక్టుల సత్వర అమలకు పీఎంజీ విధానాన్ని రాష్ట్రంలోని అన్ని శాఖలు ఈ నెలాఖరులోగా అనుసంధానం చేయాలి. రాష్ట్రంలో రూ. 50 కోట్లు విలువైన ప్రతి ప్రాజెక్టును పర్యవేక్షిస్తూ, ప్రాజెక్టు అమలులో సమస్యలు త్వరితగతిన పరిష్కారం లభించేలా చర్యలు తీసుకోవాలి’’ అని చంద్రబాబు అధికారులను ఆదేశించినట్టు మంత్రి పార్థసారథి తెలిపారు.
గత ఐదేళ్లలో వృద్ధిరేటు భారీగా తగ్గింది
కార్యదర్శుల సదస్సులో ఆర్థిక శాఖ ప్రజెంటేషన్
విభజన అనంతరం 2014-15 నుంచి 2018-19 వరకు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు తలసరి ఆదాయంలోనూ సమానంగా పోటీపడ్డాయని ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి పీయూష్ కుమార్ తెలిపారు. ‘‘తొలుత ఏపీ 13.21ు వృద్ధిని నమోదుచేయగా, తెలంగాణ 13.37ు సాధించింది. అయితే, 2019-20 నుంచి 2023-24 మధ్య భారీ తేడా వచ్చింది. జాతీయ సగటు 8.16 శాతానికి తగ్గినా తెలంగాణ కొంతమేర తన వృద్ధిరేటును నిలబెట్టుకుంది. ఏపీ మాత్రం గణనీయంగా వెనుకబడింది. తెలంగాణ తలసరి ఆదాయం 11.45శాతానికి తగ్గి రూ.3,56,564కి చేరింది. అదే సమయంలో ఏపీ 9.18 శాతానికి తగ్గి రూ.2,37,951కి పడిపోయింది. 2014-15లో 13.07 శాతంగా ఉన్న ఏపీ జీఎ్‌సడీపీ వృద్ధిరేటు 2023-24కు 8.60 శాతానికి తగ్గింది. 2024-25లో జీఎ్‌సడీపీ వృద్ధిరేటు 12.9 శాతంగా ఉంటుందని అంచనా’’ అని పేర్కొన్నారు.