Kakani Govardhan Reddy: మీ కుమార్తె ఖాతాకు రూ.70 లక్షలు
ABN , Publish Date - Jun 27 , 2025 | 04:30 AM
గ్రావెల్ కుంభకోణం కేసుకు సంబంధించి రెండో రోజు గురువారం విచారణలో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డిపై సిట్ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు.

నిరంజన్‌రెడ్డి అకౌంట్ నుంచి ఎందుకొచ్చాయి?.. కాకాణికి సిట్ ప్రశ్నలు
నెల్లూరు, జూన్ 26(ఆంధ్రజ్యోతి): గ్రావెల్ కుంభకోణం కేసుకు సంబంధించి రెండో రోజు గురువారం విచారణలో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డిపై సిట్ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. బ్యాంక్ స్టేట్‌మెంట్లు కాకాణి ముందుంచి వీటికి ఏం సమాధానం చెబుతారని నిలదీశారు. తొలిరోజు జరిగిన విచారణలో ఈ కేసులోని ఇతర నిందితులతో తనకెలాంటి సంబంధం లేదని కాకాణి గట్టిగా వాదించినట్లు తెలిసింది. దీంతో రెండోరోజు విచారణలో నిందితుల అకౌంట్ల నుంచి మీ కుటుంబ సభ్యులకు లక్షల రూపాయలు ఎందుకు బదిలీ అయ్యాయని బ్యాంక్ రికార్డులు చూపించి కాకాణిని ప్రశ్నించినట్లు సమాచారం.
ఈ కేసులో కీలక నిందితుడైన నిరంజన్‌రెడ్డి అనే వ్యక్తి బ్యాంక్ అకౌంట్ స్టేట్‌మెంట్ల ఆధారంగా గురువారం కాకాణిని ఊపిరి సలపకుండా ప్రశ్నించారని తెలిసింది. నిరంజన్‌రెడ్డి బ్యాంక్ అకౌంట్ నుంచి కాకాణి కుమార్తె అకౌంట్‌కు రూ.70 లక్షలు ట్రాన్స్‌ఫర్ అయిన స్టేట్‌మెంట్లను చూపి దీనికి సమాధానం చెప్పాలని నిలదీశారు. తన కుమార్తెకు పెళ్లి చేసి పంపేశానని, ఆమెకు తనకు ఎలాంటి సంబంధం లేదని కాకాణి సమాధానం చెప్పినట్లు తెలిసింది. సింగ్‌పూర్ నుంచి నిరంజన్‌రెడ్డి హౌస్ ఇంటీరియర్ మెటీరియల్ చాలా కొనుగోలు చేశారు. అవన్నీ మీ ఇంటికే ఇచ్చినట్లు చెబుతున్నాడని కాకాణిని అధికారులు ప్రశ్నించినట్లు తెలిసింది. ఈ విధంగా ఆర్థిక పరమైన అంశాలపై ఆధారాలతో సహా సుమారు 5గంటల సేపు కాకాణిని విచారించారు.