Share News

Atchannaidu: అక్కడికెళ్లి ఏం చేస్తావు జగన్

ABN , Publish Date - Jul 07 , 2025 | 04:56 PM

పరామర్శల పేరుతో వైసీపీ అధినేత వైఎస్ జగన్ అనుసరిస్తున్న వైఖరిపై ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కె. అచ్చెన్నాయుడు మండిపడ్డారు. ఈ యాత్ర పేరుతో ఆయన బల ప్రదర్శన చేస్తున్నారని విమర్శించారు.

Atchannaidu: అక్కడికెళ్లి ఏం చేస్తావు జగన్
AP Minister K Atchannaidu

న్యూఢిల్లీ, జులై 07: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌పై ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కె. అచ్చెన్నాయుడు మరోసారి మండిపడ్డారు. పరామర్శల పేరుతో వైఎస్ జగన్ అనుసరిస్తున్న వైఖరిని ఆయన తప్పు పట్టారు. సోమవారం న్యూఢిల్లీలో మంత్రి కె. అచ్చెన్నాయుడు విలేకర్లతో మాట్లాడుతూ.. మళ్లీ ఓదార్పు యాత్రలంటూ లా అండ్ ఆర్డర్ సమస్యలు తెచ్చే విధంగా చూస్తున్నారంటూ వైఎస్ జగన్‌పై నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేకుండా చేయాలనే ప్రయత్నం జగన్ చేస్తున్నారన్నారు. డ్రగ్స్, గంజాయి వాడే వారిని పరామర్శించడానికి వెళ్లి రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు. ఎవరైనా చనిపోతే ఏడాది తర్వాత పరామర్శకు వెళ్తారా? అంటూ వైఎస్ జగన్ రెంటపాళ్ల పర్యటనపై ఆయన సందేహం వ్యక్తం చేశారు.


ఒక్క ఏడాది పాలనలోనే ఆంధ్రప్రదేశ్‌‌లో రూ. 10 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టించిన ఘనత సీఎం చంద్రబాబు నాయుడిదని గుర్తు చేశారు. ప్రతి అంశంలో సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించి.. రైతులతోపాటు ప్రజలకు సహాయం చేస్తున్నారని వివరించారు. ఆ క్రమంలో పొగాకు కొనుగోలు చేస్తున్నామని.. అలాగే మామిడి రైతులకు సైతం సహాయం అందిస్తున్నామని పేర్కొన్నారు. అయితే బంగారు పాలెం వ్యవసాయ మార్కెట్‌కు వెళ్తున్నామని వైసీపీ నేతలు అంటున్నారని.. అక్కడికి వెళ్ళి ఏం చేస్తావంటూ ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్‌ను ఈ సందర్భంగా ఆయన సూటిగా ప్రశ్నించారు.


ఈ పర్యటన కోసం 800 బస్సులు, 2 వేల కార్లతోపాటు ఏడు జిల్లాల నుంచి రైతులను తరలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల పేర్లు చెప్పి లా అండ్ ఆర్డర్ లేదని ప్రపంచానికి తెలియజేసే నీచమైన ప్రయత్నానికి వైఎస్ జగన్ తెర తీశారన్నారు. రైతులను మార్కెట్‌కు తీసుకు వెళ్లాలని.. అంతేకానీ ఇలా సమస్యలు సృష్టించడం ఏమిటని వైఎస్ జగన్‌ను ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు సూటిగా ప్రశ్నించారు.


ఇది బల ప్రదర్శన కాదో చెప్పాలంటూ వైఎస్ జగన్‌ను ఆయన డిమాండ్ చేశారు. శాంతి భద్రతల సమస్యలు సృష్టించేందుకు ఈ విధంగా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు. గత ఐదేళ్లలో ప్రజల సమస్యలు ఒక్కటి కూడా వినలేదంటూ మాజీ సీఎం వైఎస్ జగన్‌ వైఖరిని నిలదీశారు. పార్టీ జెండా తీసే పరిస్థితి వచ్చే సరికి ఇవన్నీ చేస్తున్నారంటూ వైసీపీ అధినేతపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు మిర్చి రైతుల ధర్నాకు వెళ్లి.. మిర్చి బస్తాలు దొంగిలించారని విమర్శించారు. కూటమి సర్కార్ పాలనలో ప్రజలు ఆనందంగా ఉన్నారన్నారు. మంగళవారం మార్కెట్‌కు వచ్చే వైఎస్ జగన్‌ను నిలదీయాలని రైతులకు ఆయన పిలుపు నిచ్చారు. అందుకోసం ప్రజల్లో చైతన్యం రావాల్సి ఉందన్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. కేవలం రూ.100తో భూముల రిజిస్ట్రేషన్‌..

జగన్ ప్రతిపక్షానికి కూడా పనికిరాడు.. దేవినేని ఉమ సెటైర్లు

For More AndhraPradesh News And Telugu News

Updated Date - Jul 07 , 2025 | 05:21 PM