Justice Srinivasareddy: సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు
ABN , Publish Date - Jul 04 , 2025 | 03:33 AM
సోషల్ మీడియాలో తనను ట్రోల్ చేస్తున్నారని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీనివాసరెడ్డి తెలిపారు. టీటీడీ లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి సరఫరా చేసిన కేసులో నిందితులకు గురువారం బెయిల్ మంజూరు చేసిన...

హైకోర్టు జడ్జి జస్టిస్ శ్రీనివాసరెడ్డి వ్యాఖ్య
రాజకీయనేతల పిటిషన్ల విచారణకు విముఖత
అమరావతి, జూలై 3(ఆంధ్రజ్యోతి): సోషల్ మీడియాలో తనను ట్రోల్ చేస్తున్నారని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీనివాసరెడ్డి తెలిపారు. టీటీడీ లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి సరఫరా చేసిన కేసులో నిందితులకు గురువారం బెయిల్ మంజూరు చేసిన అనంతరం న్యాయమూర్తి ఈ విషయాన్ని వెల్లడించారు. ట్రోలింగ్ చేసే ట్రోలర్లకు ఈ తీర్పు మరో అంశం అవుతుందని వ్యాఖ్యానించారు. సింగయ్య మృతి కేసులో పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి, ఆ పార్టీ నేతలు ఇటీవల హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. వాహన ప్రమాదానికి డ్రైవర్ బాధ్యుడు అవుతాడని, అందులో ప్రయాణించేవారిని ఎలా బాధ్యులను చేస్తారని విచారణ సందర్భంగా న్యాయమూర్తి ప్రశ్నించారు. పోలీసులు నమోదు చేసిన బీఎన్‌ఎస్ సెక్షన్ 105 రెడ్‌విత్ 49 జగన్‌కు, ఆపార్టీ నేతలకు వర్తించదంటూ వారిపై తదుపరి చర్యలను నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు. దీంతో గత రెండు రోజులుగా జస్టిస్ శ్రీనివాసరెడ్డిని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. గురువారం ఈ విషయాన్ని వెల్లడించిన న్యాయమూర్తి తదనంతరం తన ముందుకు వచ్చిన పలువురు రాజకీయనేతల పిటిషన్లను విచారించేందుకు విముఖత చూపారు.