Janzavathi Project: జంఝావతి కథ.. అంతులేని వ్యథ
ABN , Publish Date - Jul 04 , 2025 | 04:19 AM
చుట్టూ దట్టమైన కొండలు.. మదపుటేనుగుల ఘీంకారాలు.. తియ్యని.. పుల్లని రుచుల అనాస పళ్లు.. అమాయకంగా కనిపించే మట్టి మనుషులు.. వీటన్నిటితో కూడిన పార్వతీపురం మన్యం జిల్లా ప్రజల గోడు ప్రభుత్వాలకు పట్టడం లేదు

ఐదు దశాబ్దాలుగా ప్రభుత్వాల నిర్లక్ష్యం
ఒడిసాను ఒప్పించి 1,075 ఎకరాలు సేకరిస్తే 5 గ్రామాల్లో 24,460 ఎకరాలకు సాగునీరు
గత సీఎంలు నవీన్-జగన్ భేటీతో ఫలితం శూన్యం
చంద్రబాబే చొరవ చూపాలని మన్యం రైతుల వినతి
వచ్చేవారంలో ఉత్తరాంధ్ర ప్రాజెక్టులపై సీఎం సమీక్ష
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
చుట్టూ దట్టమైన కొండలు.. మదపుటేనుగుల ఘీంకారాలు.. తియ్యని.. పుల్లని రుచుల అనాస పళ్లు.. అమాయకంగా కనిపించే మట్టి మనుషులు.. వీటన్నిటితో కూడిన పార్వతీపురం మన్యం జిల్లా ప్రజల గోడు ప్రభుత్వాలకు పట్టడం లేదు. తాగు, సాగునీటి కష్టాలు తీర్చే జంఝావతి ప్రాజెక్టు సమస్య ఐదు దశాబ్దాలుగా తీరడం లేదు. సరిహద్దు రాష్ట్రం ఒడిసాలోని పది గ్రామాల్లో కేవలం 1,075 ఎకరాలు సేకరిస్తే.. మన రాష్ట్రంలో 75 గ్రామాలకు చెందిన 24,640 ఎకరాలకు సాగునీందుతుంది. ఆ రాష్ట్రానికీ తగుస్థాయిలో నీరందుతుంది. 1975 సెప్టెంబరు 24వ తేదీన ఆంధ్రప్రదేశ్, ఒడిసా రాష్ట్రాల ముఖ్యమంత్రులు జలగం వెంగళరావు, నందిని శత్‌పథి.. నాగావతి ఉపనది జంఝావతిలోని చెరి సగం జలాలు పంచుకునేలా జంఝావతి ప్రాజెక్టును పూర్తిచేయాలని తీర్మానించారు. 1976లో పనులను ఆంధ్రప్రదేశ్ భావించినా కుదరలేదు. 1978 డిసెంబరు 12న జరిగిన అంతర్రాష్ట్ర సమావేశంలో.. ప్రాజెక్టు నిర్మాణ వ్యయాన్ని పూర్తిగా ఏపీయే భరించాలని నిర్ణయించారు. 1980 జూలై 27న రెండు రాష్ట్రాల మధ్య జరిగిన సమావేశంలో రివర్‌గ్యాప్ మినహా జలాశయం పనులు చేపట్టేందుకు అంగీకారం కుదిరింది. అలాగే జంఝావతి ప్రాజెక్టుతో నిరాశ్రయులయ్యే వారికి సహాయ పునరావాసం కల్పించే బాధ్యత ఏపీదేనని ఉభయరాష్ట్రాలూ అంగీకరించాయి.
ఆ తర్వాత ఇరవై ఏళ్ల వరకు పునరావాసం గురించి రెండు రాష్ట్రాలూ పట్టించుకోలేదు. 2002 డిసెంబరు 23న జరిగిన అంతర్రాష్ట్ర భేటీలో.. ముంపు ప్రాంతాల్లో గ్రామ సభలు నిర్వహించి పునరావాస ప్యాకేజీని ఖరారు చేస్తే నిధులు మంజూరు చేస్తామని ఒడిసాకు ఆంధ్రప్రదేశ్ స్పష్టం చేసింది. ఆ నిధులు ఇచ్చాక రివర్‌గ్యాప్ పనులు కూడా పూర్తి చేయాలని నిర్ణయించింది. ఆలోగా ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయాలని భావించింది. జంఝావతి వల్ల రాష్ట్రంలో నాలుగు, ఒడిసాలోని పది గ్రామాల్లో మొత్తం 2,245.1 ఎకరాలు మునుగుతాయని అధికారులు గుర్తించారు. ప్రాజెక్టు నిర్మాణం పూర్తయినా రివర్ గ్యాప్ పనులు అలాగే ఉండిపోయాయి. ఆంధ్రప్రదేశ్‌లోని జంఝావతి పరివాహక ప్రాంతాలు ముంపునకు గురికాకుండా ఉండేందుకు ఆస్ట్రియా సహకారంతో నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో రబ్బర్ డ్యాం నిర్మించారు. దీనికి ఆయన ప్రభుత్వం విపరీతమైన ప్రచారం చేసుకుంది. అయితే కొద్దిపాటి వరదకే ఈ రబ్బరు డ్యాం కొట్టుకుపోయింది. వైఎస్ సర్కారు అభాసుపాలైంది.
చర్చలు... లేఖలే!
జంఝావతి నిర్మాణం పూర్తయినా నీటి నిల్వకు ఆస్కారం లేకుండా పోవడంతో.. 2015లో నాటి కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు, ఒడిసా సీఎం నవీన్ పట్నాయక్ మధ్య చర్చలు జరిగాయి. ఒడిసాకు చెందిన పది ముంపు గ్రామాల్లోని 1,175.1 ఎకరాలకు సహాయ పునరావాస ప్యాకేజీని అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఏపీ వెల్లడించింది. కానీ నవీన్ ముందుకు రాలేదు. భూసేకరణకయ్యే ఖర్చు భరించేందుకు సిద్ధంగా ఉన్నామంటూ 2018 మే 13వ తేదీన నాటి సీఎం చంద్రబాబు ఆయనకు లేఖ కూడా రాశారు. 2020 ఆగస్టులో ఒడిసా ప్రభుత్వం దీనిపై స్పందించి చర్చలకు ఆహ్వానించింది. దీంతో నాటి ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి, నవీన్ పట్నాయక్ మధ్య చర్చలు జరిగాయి. ఇక జంఝావతి ప్రాజెక్టు పూర్తయినట్లేనని.. రైతుల కష్టాలు తొలగిపోయాయంటూ వైసీపీ ప్రభుత్వం విస్తృత ప్రచారం చేసుకుంది. చర్చలు ఫలప్రదమయ్యాయని జగన్ ప్రకటించుకున్నారు. అయితే.. ఆయనేం చెప్పారో.. నవీన్ ఏం అర్థం చేసుకున్నారో గానీ.. భూసేకరణ వ్యయం లెక్కలను ఒడిసా చెప్పలేదు. జగన్ గద్దెదిగేదాకా సమస్య పరిష్కారమే కాలేదు. రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రస్తుతం అధికారంలో ఉన్నందున.. ఒడిసాలోని బీజేపీ ప్రభుత్వంతో ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చలు జరిపితే.. ఐదు దశాబ్దాల జంఝావతి జంఝాటానికి పరిష్కారం లభిస్తుందని మన్యం ప్రజలు ఆశిస్తున్నారు. ఈ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలు ఎన్డీఏ భాగస్వాములైనందున సమస్య కచ్చితంగా కొలిక్కివస్తుందని భావిస్తున్నారు.
ఉత్తరాంధ్ర ప్రాజెక్టులకు ప్రత్యేక ప్రాధాన్యం
వారం రోజుల్లో చంద్రబాబు సమీక్ష: నిమ్మల
అమరావతి, జూలై 3 (ఆంధ్రజ్యోతి): ఉత్తరాంధ్ర ప్రాజెక్టులకు ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చి పూర్తి చేస్తామని జల వనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ప్రకటించారు. వచ్చేవారం వాటిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేకంగా ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్టులపై సమీక్షిస్తారని వెల్లడించారు. గురువారం విజయవాడ క్యాంపు కార్యాలయంలో ఉత్తరాంధ్ర ప్రాజెక్టులపై అధికారులతో ఆయన సమావేశమయ్యారు. 2014-19 నడుమ నాటి టీడీపీ ప్రభుత్వం ఉత్తరాంధ్ర ప్రాజెక్టులను చాలావరకూ పూర్తి చేసిందని వెల్లడించారు. 2019లో దురదృష్టవశాత్తూ వచ్చిన వైసీపీ ప్రభుత్వం మిగిలిన కొద్ది పనులను చేయకుండా గాలికొదిలేసిందని విమర్శించారు. కూటమి అధికారంలోకి వచ్చిన ఈ ఏడాది కాలంలో మళ్లీ ఆ ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తున్నావన్నారు. వంశధార స్టేజ్-2 ఫేజ్-2 పనులు 90 శాతం మేర పూర్తయ్యాయని చెప్పారు తోటపల్లి ప్రాజెక్టు పనులను వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని.. గడచిన ఐదేళ్ల కాలంలో ఉత్తరాంధ్రకు జగన్ చేసిన ద్రోహం అంతా ఇంతా కాదన్నారు. ఈ సందర్భంగా హిరమండలం ఎత్తిపోతల, మడ్డువలస స్టేజ్-2, జంఝావతిపై మంత్రి ఆరా తీశారు. జైకా నిధులతో నత్తనడకన సాగుతున్న ఆండ్ర రిజర్వాయరు, రైవాడ, పెద్దంకలం, పెద్దగడ్డ, వట్టిగెడ్డ పనులను తక్షణమే పూర్తి చేయాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి సమీక్ష నాటికి ఏయే ప్రాజెక్టులకు ప్రాధాన్యమివ్వాలి.. ఎప్పటికల్లా పూర్తిచేస్తారో లక్ష్యాలను సిద్ధం చేయాలని స్పష్టంచేశారు. సమావేశంలో జల వనరుల శాఖ సలహాదారు ఎం.వెంకటేశ్వరరావు, ఈఎన్‌సీ నరసింహమూర్తి, ప్రాజెక్టుల చీఫ్ ఇంజనీర్లు, ఎస్‌ఈలు పాల్గొన్నారు.