Janasena: ఎడారి దేశంలో జనసేన వీరమహిళ ఆపన్నహస్తం
ABN , Publish Date - Jul 01 , 2025 | 04:28 AM
ఆమె ఓ తెలుగు నర్సు సేవే పరమావధిగా గల్ఫ్‌లోని బిషా అనే ఎడారి ప్రాంతంలో వేలాది మంది రోగులకు సేవలందిస్తోంది.

రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాలపాలైన హైదరాబాద్ యువతి
మృత్యువు నుంచి బయటపడినా ఒంటరిగా మిగిలిన వైనం
తన వారికోసం తపించిన బాధితురాలికి అండగా విశాఖ మహిళ ఉష
2200 కిలోమీటర్లు ప్రయాణించి ఇండియాకు పంపిన వైనం
(ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి): ఆమె ఓ తెలుగు నర్సు. సేవే పరమావధిగా గల్ఫ్‌లోని బిషా అనే ఎడారి ప్రాంతంలో వేలాది మంది రోగులకు సేవలందిస్తోంది. అలాంటి ఆమె కొంతకాలం క్రితం ఘోర రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రి పాలైంది. ప్రమాదం నుంచి మృత్యుంజయరాలిగా బయటపడినా.. పరాయిగడ్డపై ఆత్మీయులు కొరవడి ఏకాకిగా మిగిలింది. అదిగో.. సరిగ్గా అలాంటి సమయంలో ముక్కూ మోహం తెలియని ఆమె కోసం.. రియాద్‌లో ఉంటున్న.. విశాఖపట్నం జనసేన పార్టీకి చెందిన ఓ వీర మహిళ తానున్నానంటూ బాధితురాలికి ఆపన్న హస్తం అందించింది. సౌదీలో ఏకంగా 2200కిలో మీటర్ల దూరం ప్రయాణం చేసి ఆమెను సోమవారం స్వదేశానికి పంపించింది. వివరాలివీ.. సౌదీ అరేబియాలోని బిషా అనే ఎడారి ప్రాంతంలోని ఓ ఆస్పత్రిలో నర్సుగా పని చేస్తున్న హైదరాబాద్ నగరానికి చెందిన 34 ఏళ్ల గిరిజన యువతి ఒకరు కొద్ది కాలం క్రితం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు.
మృత్యువు నుంచి బయటపడినా మెదడు, వెన్నుపూస, కాళ్లు, చేతులకు అనేక శస్త్రచికిత్సలు జరిగాయి. మెరుగైన వైద్య సదుపాయం అందించినా.. ఆమె మాత్రం ఇంకా పూర్తిగా కోలుకోలేదు. మానసికంగానూ కుంగిపోయి కన్నీరు మున్నీరవుతోంది. ఈ నేపథ్యంలో ఆమె దయనీయ పరిసితి తెలుసుకుని సౌదీలోని రియాద్‌లో ఉంటున్న విశాఖపట్నానికి చెందిన చెందిన జనసేన పార్టీ వీరమహిళ, సామాజిక కార్యకర్త దుగ్గారపు ఉష చలించిపోయారు. ఓవైపు తనకు ఆరోగ్యం బాగోలేకపోగా, మరోవైపు పిల్లలకు పరీక్షలు ఉన్నప్పటికీ.. వారిని ఇంట్లో ఒంటగా వదిలిపెట్టి.. బాధితురాలి కోసం ఆమె ఉన్న ఆస్పత్రికి అతికష్టమ్మీద వెళ్లారు. ఎడారి దేశంలో ప్రయాణం తనకూ కొత్త అయినప్పటికీ.. రియాద్ నుంచి 800 కిలోమీటర్ల దూరంలోని బిషాకు లోకల్ ఫ్లైట్‌లో వెళ్లి, బాధితురాలిని మరో 700 కిలోమీటర్ల దూరంలోని జెద్దాకు ఫ్లైట్‌లో తరలించారు. అక్కడి నుంచి అంతర్జాతీయ విమానంలో ఇండియాకు బాధితురాలిని పంపించి, తిరిగి మరో 700 కి.మీ.ప్రయాణించి రియాద్‌కు చేరుకున్నారు. సమయానికి విమా నాలు అందుబాటులో లేకపోగా, నాలుగైదు రోజులు శ్రమపడి వేల కిలోమీటర్ల పైగా ఏడారిలో ప్రయాణించారు. పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్ఫూర్తితో సేవలో తనకు అలసట కనిపించదని ఉష ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. బాధితురాలు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.