Pawan Kalyan-Sharmishtha: శర్మిష్ట అరెస్ట్‌పై పవన్ తీవ్ర ఆగ్రహం.. 'ఐ స్టాండ్ విత్ శర్మిష్ట' అంటూ హ్యాష్ ట్యాగ్ పోస్ట్
ABN , Publish Date - Jun 01 , 2025 | 02:24 PM
'శర్మిష్ట పనోలి' ఈ పేరు ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగానే కాదు, యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్న పేరు. 22 ఏళ్ల న్యాయ విద్యార్థిని అయిన శర్మిష్ట అరెస్ట్‌పై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్..

ఇంటర్నెట్ డెస్క్: 'శర్మిష్ట పనోలి' ఈ పేరు ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగానే కాదు, యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్న పేరు. 22 ఏళ్ల న్యాయ విద్యార్థిని అయిన శర్మిష్ట అరెస్ట్‌పై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. శర్మిష్ట అరెస్ట్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ 'ఐ స్టాండ్ విత్ శర్మిష్ట', 'ఈక్వల్ జస్టిస్' అనే హ్యాష్ ట్యాగ్‌లతో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ఈ అరెస్ట్ ఇప్పుడు తెలుగు ప్రజల్లోనూ హాట్ టాపిక్‌గా మారిపోయింది.
విషయంలోకి వెళ్లే, శర్మిష్ట పనోలి హర్యానాలోని గుర్గావ్‌కు చెందిన యువతి. పూనే లా యూనివర్శిటీలో న్యాయవాద విద్యను అభ్యసిస్తోంది. అయితే, ఈమెను బెంగాల్ పోలీసులు గుర్గావ్ వెళ్లి మరీ అరెస్ట్ చేశారు. ఎందుకంటే ఆమె.. ఆపరేషన్ సిందూర్ సమయంలో ఉగ్రవాదులకు, పాకిస్థాన్‌కు, మత ఛాందసవాద కార్యకలాపాలకు వ్యతిరేకంగా తన సోషల్ మీడియా అకౌంట్ ఇస్టాగ్రాంలో పోస్ట్ పెట్టింది. ఈ దారుణాలపై బాలీవుడ్ ప్రముఖులు ఎందుకు పెద్దగా స్పందించడంలేదని నిలదీసింది. ఆమెకు దాదాపు 2 లక్షల మంది ఫాలోవర్లున్నారు అయితే, తీవ్ర పదజాలంతో కూడిన ఆమె వ్యాఖ్యలు కొందరిని బాధిస్తున్నాయనే ఉద్దేశ్యంతో ఆమె తన పోస్ట్ ను డిలీట్ చేసింది. ఆమె తన తప్పును అంగీకరించి, వీడియోను తొలగించి క్షమాపణలు చెప్పింది.
అయితే, ఇప్పుడు ఆమెను సీఎం మమతాబెనర్జీ నేతృత్వంలోని బెంగాల్ ప్రభుత్వం అరెస్ట్ చేసింది. శర్మిష్ట చేసిన పోస్ట్‌పై కోల్కతా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు రావడంతో ఆమెను కలకత్తా పోలీసులు గుర్గావ్‌లో అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో ఈ అరెస్ట్‌పై దేశవ్యాప్తంగానే కాదు, ప్రపంచవ్యాప్తంగానూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సీఎం మమతా బెనర్జీ చర్యలపై తీవ్ర నిరసనలూ వ్యక్తమవుతున్నాయి. విద్యార్థిని అరెస్ట్‌ను డచ్ ఎంపీ గీర్ట్ వైల్డర్స్ తీవ్రంగా ఖండించారు. ఏంటీ దారుణాలు అంటూ ఆయన ప్రధాని నరేంద్రమోదీని కూడా సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు.
ఇదిలా ఉంటే, జనసేనాని, ఏపీ డిప్యూటీ సీఎం శర్మిష్ట పనోలి అరెస్ట్ మీద తీవ్రంగా స్పందించారు. మమతా బెనర్జీ సర్కారుని కడిగిపారేశారు . అంతేకాదు, తాను శర్మిష్టకు అండగా ఉంటానని చెబుతూ, 'ఐ స్టాండ్ విత్ శర్మిష్ట', 'ఈక్వల్ జస్టిస్' అంటూ రెండు హ్యాష్ ట్యాగ్‌లు జోడించి తన సోషల్ మీడియా ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.
ఇంకా తన పోస్ట్‌లో పవన్ కళ్యాణ్ ఏమన్నారంటే.. పహల్గాం దాడికి ప్రతీకారంగా పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత దళాలు నిర్వహించిన సైనిక ఆపరేషన్ అయిన ఆపరేషన్ సిందూర్ దేశంలో ఉన్న పరిస్థితుల్ని, సున్నిత వాతావరణాన్ని సూచించింది. దీనిపై బాలీవుడ్ మౌనంపై శర్మిష్ట చేసిన కామెంట్లు అరెస్టుకు దారితీశాయి.
సదరు పోస్ట్ గురించి క్షమాపణలు చెప్పి.. పెట్టిన పోస్ట్‌ను శర్మిష్ట తొలగించినప్పటికీ ఆమెపై బెంగాల్ పోలీసులు వేగంగా చర్య తీసుకున్నారు. కానీ ఎన్నికైన నాయకులు, టిఎంసి ఎంపీలు సనాతన ధర్మాన్ని అపహాస్యం చేసినప్పుడు లక్షలాది మందికి కలిగిన లోతైన, తీవ్రమైన బాధ గురించి ఏమిటి? మన విశ్వాసాన్ని 'గాంధ ధర్మం' అని పిలిచినప్పుడు ఆ ఆగ్రహం ఎక్కడ ఉంది? వారి క్షమాపణ ఎక్కడ? వారి త్వరిత అరెస్టు ఎక్కడ? అని పవన్ ప్రశ్నల వర్షం కురింపించారు.
దైవదూషణను ఎల్లప్పుడూ ఖండించాలన్న పవన్.. లౌకికవాదం కొందరికి కవచం కాదు, మరికొందరికి కత్తి కాదు. ఇది రెండు వైపులా ఉండే చౌరస్తా అయి ఉండాలి. పశ్చిమ బెంగాల్ పోలీసులూ.. దేశం చూస్తోంది. అందరికీ సమన్యాయంగా వ్యవహరించండి. అంటూ పవన్ తన పోస్ట్ లో పేర్కొన్నారు.
అటు, శర్మిష్ట అరెస్ట్‌పై బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కూడా స్పందించారు. "శాంతిభద్రతల పేరుతో ఒకరిని వేధించడం మంచిది కాదు. ఎవరైనా క్షమాపణ చెప్పి పోస్ట్‌ను తొలగించినప్పుడు, ఆమెను జైలులో పెట్టడం, ఆమెను హింసించడం, ఆమె కెరీర్‌ను ముగించడం, ఆమె వ్యక్తిత్వంపై ప్రశ్నలు అడగడం చాలా తప్పు. ఏ ఆడ బిడ్డ విషయంలోనూ ఇలా జరగకూడదు. రాష్ట్రాన్ని ఉత్తర కొరియాగా మార్చడానికి ప్రయత్నించవద్దని నేను పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని కోరుతున్నాను. అందరికీ ప్రజాస్వామ్య హక్కులు ఉన్నాయి. ఆమె తన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పింది. ఆమె చాలా సాధారణ పరిభాషలో మాట్లాడింది. నేటి తరం అలాంటి భాషను చాలా మామూలుగా ఇంగ్లీష్, హిందీలలో ఉపయోగిస్తున్నారు. ఆమె చాలా చిన్న సాధారణ మహిళ కాబట్టి ఆమెను త్వరలో విడుదల చేయాలి. ఆమెకు ఎంతో కెరీర్, జీవితం ఉంది." అని కంగనా అన్నారు.
ఇవి కూడా చదవండి..
ఈ ఇంజినీర్‌కు చేతులెత్తి మొక్కాల్సిందే.. టాయిలెట్‌ను ఎక్కడ కట్టాడో చూడండి..
కారు టైరుతో కూలర్ తయారీ.. ఎలా సెట్ చేశాడో చూస్తే అవాక్కవుతారు..