Jagan: చెవిరెడ్డికి బయటి భోజనం అవసరం లేదు
ABN , Publish Date - Jun 25 , 2025 | 06:16 AM
జైలులో ఖైదీలకు నాణ్యమైన భోజనం అందజేస్తున్నామని, ఇంటి నుంచి భోజనం అవసరం లేదని విజయవాడ జిల్లా జైలు సూపరింటెండెంట్ ఇర్ఫాన్ ఖాన్ ఏసీబీ కోర్టుకు వివరించారు.

కోర్టుకు వివరించిన విజయవాడ జిల్లా జైలు సూపరింటెండెంట్
విజయవాడ, జూన్ 24(ఆంధ్రజ్యోతి): జైలులో ఖైదీలకు నాణ్యమైన భోజనం అందజేస్తున్నామని, ఇంటి నుంచి భోజనం అవసరం లేదని విజయవాడ జిల్లా జైలు సూపరింటెండెంట్ ఇర్ఫాన్ ఖాన్ ఏసీబీ కోర్టుకు వివరించారు. తమకు ఇంటి భోజనం, ఇతర సౌకర్యాలు కల్పించాలని కోరుతూ జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్న చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, వెంకటేశ్ నాయుడు దాఖలు చేసిన పిటిషన్లపై ఏసీబీ కోర్టులో మంగళవారం విచారణ జరిగింది. పిటిషన్లపై ఇర్ఫాన్ ఖాన్ కౌంటర్ దాఖలు చేసి వాదనను వినిపించారు. భోజనం ఎవరు తీసుకొస్తారో తెలియజేస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలని చెవిరెడ్డి న్యాయవాదిని న్యాయాధికారి పి.భాస్కరరావు ఆదేశించారు. తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేశారు.
వెంకటేశ్ నాయుడు పిటిషన్‌పై విచారణను గురువారానికి వాయిదా వేశారు. అదేవిధంగా చెవిరెడ్డి, వెంకటేశ్ నాయుడు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లు, వారిని కస్టడీకి ఇవ్వాలని సిట్ అధికారులు దాఖలు చేసిన కస్టడీ పిటిషన్‌పై విచారణను కూడా బుధవారానికి వాయిదా వేశారు. కాగా, మద్యం కేసులో నిందితుడు, జగన్ ఓఎస్డీ పి.కృష్ణమోహన్‌రెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై ఏసీబీ కోర్టులో మాజీ ఏజీ శ్రీరాం మంగళవారం వాదనలు వినిపించారు. ప్రాసిక్యూషన్ తరఫున వాదనల కోసం విచారణను న్యాయాధికారి బుధవారానికి వాయిదా వేశారు.