YS Jaganmohan Reddy: హంగామా చేద్దాం!
ABN , Publish Date - Nov 20 , 2025 | 04:53 AM
అక్రమాస్తుల కేసులో వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఆరేళ్ల తర్వాత కోర్టు మెట్లు ఎక్కనున్నారు. గురువారం హైదరాబాద్‌లోని నాంపల్లి సీబీఐ ప్రత్యేక కోర్టు...
నేడు హైదరాబాద్ కోర్టుకు జగన్
హడావుడి చేయాలని ప్రణాళిక
తరలి రావాలని కార్యకర్తలకు సంకేతాలు
తానొస్తే భద్రతా సమస్యలు తప్పవంటూ వ్యక్తిగత హాజరుకు డుమ్మా కొట్టే ఎత్తుగడ?
(అమరావతి - ఆంధ్రజ్యోతి): అక్రమాస్తుల కేసులో వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఆరేళ్ల తర్వాత కోర్టు మెట్లు ఎక్కనున్నారు. గురువారం హైదరాబాద్‌లోని నాంపల్లి సీబీఐ ప్రత్యేక కోర్టు ముందు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా అక్కడ తన పార్టీ శ్రేణుల ద్వారా నానా హడావుడి సృష్టించేందుకు రంగం సిద్ధం చేసినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. గురువారం ఉదయం 10.45 గంటలకు బేగంపేట విమానాశ్రయంలో దిగింది మొదలు నాంపల్లిలోని సీబీఐ కోర్టుకు వెళ్లే దాకా... ‘బలప్రదర్శన’ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
‘నేను కోర్టుకు ప్రత్యక్షంగా హాజరైతే భద్రతాపరమైన సమస్యలు తలెత్తుతాయి’ అంటూ సీఎంగా ఉన్నన్ని రోజులూ వ్యక్తిగత హాజరు నుంచి జగన్ మినహాయింపు పొందారు. ‘మాజీ’ అయ్యాకా అదే మినహాయింపు కొనసాగుతోంది. గత నెలలో లండన్ పర్యటనకు వెళ్లిన జగన్ స్వదేశానికి తిరిగొచ్చాక వ్యక్తిగతంగా హాజరు కావాలని కోర్టు స్పష్టంగా చెప్పింది. పర్యటనకు ముందు కోర్టు పెట్టిన షరతులన్నింటికీ ఒప్పుకున్న జగన్... తిరిగొచ్చాక మాత్రం కోర్టుకు వ్యక్తిగతంగా హాజరయ్యేందుకు ఇష్టపడలేదు. మినహాయింపు కోరారు. ఆయన వ్యక్తిగతంగా తమ ముందుకు రావలసిందేనని కోర్టు తేల్చిచెప్పడంతో... గురువారం హాజరు కాక తప్పడంలేదు. ఇప్పుడు కూడా... ‘భద్రతాపరమైన సమస్యల’ సాకు చూపి, భవిష్యత్తులో కోర్టుకు హాజరుకాకుండా ఉండేందుకే వైసీపీ శ్రేణుల ద్వారా హైదరాబాద్‌లో... మరీ ముఖ్యంగా కోర్టు వద్ద హంగామా సృష్టించాలనే ఎత్తుగడ వేసినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో ఏపీలో మెడికల్ కాలేజీలను పీపీపీ పద్ధతిలో నిర్మించాలన్న ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా హైదరాబాద్‌లో సంతకాల సేకరణ తలపెట్టడం గమనార్హం.
కోర్టులో గంటే ఉంటారంట!
జగన్ అక్రమాస్తుల కేసులో ‘నిందితుడు’! కోర్టులో హాజరయ్యాక ఆయన ఎప్పుడు బయటికి వస్తారన్నది అక్కడి పరిస్థితులు, న్యాయాధికారి నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. కానీ... ఎన్నిగంటలకు కోర్టుకు వెళ్లేదీ, అక్కడ ఎంత సేపు ఉండేది కూడా జగనే నిర్ణయించుకున్నారు. గురువారం తన పర్యటనపై షెడ్యూలు విడుదల చేశారు. ‘‘11.30 గంటలకు సీబీఐ కోర్టుకు వెళ్లి... 12.30 గంటలదాకా అక్కడ ఉంటారు’’ అని అందులో తెలిపారు. అంటే... కోర్టులో ఎంతసేపు ఉండాలో నిందితుడే నిర్ణయిస్తారా అంటూ సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి.
ఇవీ చదవండి:
హిడ్మా ఎన్‌కౌంటర్.. ప్రొ.హరగోపాల్ కీలక వ్యాఖ్యలు
అందుకే మారేడుమిల్లికి వచ్చిన మావోయిస్టులు.. జిల్లా ఎస్పీ