Jagan Blocks Growth: రాష్ట్ర ప్రగతిపై పగ
ABN , Publish Date - Apr 29 , 2025 | 04:00 AM
ఉర్సా సంస్థకు భూములు రాయితీ ధరకు కేటాయించినదాన్ని వైసీపీ దుష్ప్రచారంగా ఉపయోగించుకుంటోందని ఆరోపిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. పెట్టుబడుల రాకను అడ్డుకునేందుకు జగన్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని వ్యాఖ్యానించింది

బుసలు కొడుతున్న వైసీపీ విషనాగు
పెట్టుబడులను అడ్డుకోవడమే లక్ష్యం
నాడు కియ, అమరావతి.. నేడు ఉర్సా
భూ కేటాయింపులపై దుష్ప్రచారం
ఉర్సాకు రూ.కోటి, రూ.50 లక్షలకు భూమి
కానీ.. 99 పైసలకే ఇచ్చినట్లు జగన్ అసత్యాలు
విశాఖలో రూ.కోటికే నాడు వైసీపీ కేటాయింపులు
నేడు ప్రభుత్వం అదే విధంగా కేటాయిస్తే గగ్గోలు
ఉర్సా క్లస్టర్స్ అంతర్జాతీయ సంస్థ..
దావోస్ లో ఒప్పందం కుదుర్చుకున్న తెలంగాణ
అయినా అనామకం అన్నట్లుగా వైసీపీ అవాకులు
(అమరావతి - ఆంధ్రజ్యోతి)
అధికారంలో ఉన్న ఐదేళ్లూ పారిశ్రామికవేత్తలను బెదరగొట్టడం, పెట్టుబడిదారులను తరిమివేయడం! అధికారం పోయాకా... అదే పని! పెట్టుబడులపై తప్పుడు ప్రచారంతో విషం చిమ్మడం! ‘మళ్లీ మేమొస్తాం’ అంటూ భయపెట్టడం!
వైసీపీ నేతల తప్పుడు మాటలు... జగన్ రోత పత్రికలో తప్పుడు రాతలు! అప్పుడూ.. ఇప్పుడూ... జగన్ లక్ష్యం ఒకటే! ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులు రావొద్దు! రాష్ట్రం అభివృద్ధి చెందొద్దు! 2014-19 మధ్య అమలు చేసిన కుట్రలకు ఇప్పుడు మళ్లీ తెరలేపారు. అవగాహన లేని మాటలు... అర్ధ సత్యాలు... అసత్యాలతో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇందులో భాగంగానే... ‘ఉర్సాకు ఉచితంగా భూములు ఇచ్చేశారు’ అంటూ జగన్ రోత పత్రిక అక్కసు వెళ్లగక్కింది. ఉర్సా సంస్థ ఊరూపేరూ లేనిదన్నట్లుగా అభివర్ణించింది. పెట్టుబడుల విషయంలో వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ వైఖరికి ఈ కథనం అద్దం పట్టింది. అసలు విషయం ఏమిటంటే... ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఒక అంతర్జాతీయ సంస్థ. మరో విషయం ఏమిటంటే... ఆ సంస్థకు భూములు ఉచితంగా ఇవ్వలేదు.
ఇది రియల్ ఎస్టేట్ వ్యాపారమా?
పరిశ్రమలు రావాలంటే... ప్రోత్సాహకాలు కల్పించాలి. అందులో... భూమిని రాయితీ ధరకు కేటాయించడం కూడా భాగం. వచ్చే పెట్టుబడి, కల్పించే ఉద్యోగాలు, భూమి ఇచ్చే ప్రాంతాన్ని బట్టి ధర నిర్ణయిస్తారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ముఖ్యమంత్రిగా పని చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఇంకా బాగా తెలిసి ఉండాలి. కానీ... పరిశ్రమలకు భూకేటాయింపులపై అడ్డగోలు ఆరోపణలు చేస్తున్నారు. పరిశ్రమలకు భూకేటాయింపులంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం కాదు. కానీ, వైఎస్ హయాంలో భూకేటాయింపులను పక్కాగా ‘క్విడ్ ప్రోకో’ కోసం వాడుకున్నారు. ఊరూపేరూ లేని కంపెనీలకు అడ్డగోలుగా భూములు కేటాయించడం, వారు ఆ భూములను బ్యాంకుల్లో తాకట్టు పెట్టుకుని సొమ్ములు చేసుకుని దుకాణం మూసేసి వెళ్లిపోవడం! ఇదీ వైఎస్ హయాంలో జరిగింది. ఇప్పుడు జరుగుతున్నది అది కాదు! పరిశ్రమలకు భూకేటాయింపులపై ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఏఐ, డేటాబేస్ కంపెనీలపై ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. అందులో భాగంగా ఆ రంగంలో అంతర్జాతీయంగా పేరున్న కంపెనీలను రాష్ట్రానికి ఆహ్వానిస్తోంది. ఉర్సా క్లస్టర్స్ కూడా అందులో భాగంగానే రాష్ట్రానికి వచ్చేందుకు సిద్ధమైంది. కానీ... అదేదో అనామక సంస్థగా, ప్రభుత్వ పెద్దల బినామీది అన్నట్లుగా వైసీపీ విషం చిమ్ముతోంది.
ఇదీ... ఉర్సా నేపథ్యం...
అంతర్జాతీయ కంపెనీలు ఇతర దేశాల్లో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చేటప్పుడు ముందుగా అక్కడ స్పెషల్ పర్పస్ వెహికల్(ఎస్పీవీ)ను ఏర్పాటు చేసుకుంటాయి. ఉర్సా క్లస్టర్స్ అంతర్జాతీయంగా పేరున్న నిపుణులతో ఏర్పాటైన కంపెనీ. అభివృద్ధి చెందే రాష్ట్రాల్లో ఏపీని ఒకటిగా భావించడంతోపాటు సొంత రాష్ట్రంపై మమకారంతో... సంస్థ యాజమాన్యం ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. అందులో భాగంగా ఇక్కడ రెండు నెలల క్రితం ఎస్పీవీని ఏర్పాటు చేసుకుంది. అంతర్జాతీయ కంపెనీలు పెట్టుబడులు గురించి అవగాహన ఉన్నవారికి ఎవరికైనా ఈ విషయం తెలుస్తుంది. కానీ జగన్ మాత్రం ఉర్సా కంపెనీ రెండు నెలలు ముందు పెట్టిన కంపెనీ అంటూ దుష్ప్రచారం చేస్తున్నారు. రెండు నెలల కిందట పెట్టింది ఎస్పీవీ మాత్రమే! అసలు కంపెనీ ఎప్పటి నుంచో ఉన్నదే! ఇది వాస్తవం!
‘99 పైసలు’... పచ్చి అబద్ధం
‘ఉర్సా క్లస్టర్స్‌కు ఎకరా 99 పైసలకు భూమి కేటాయించారు. ఇడ్లీ కూడా రూపాయికి రాదు’ అంటూ వైఎస్ జగన్ వెకిలి వ్యాఖ్యలు చేస్తుండటం గమనార్హం. వాస్తవానికి... ప్రభుత్వం ప్రఖ్యాత ఐటీ సంస్థ టీసీఎ్‌సకు విశాఖ ఐటీ పార్కులో 99 పైసలకు 21 ఎకరాలను లీజుకు కేటాయించింది. అదే ఐటీ పార్కులో ఉర్సాకు ఎకరా రూ.కోటికి, కాపులుప్పాడులో ఎకరా రూ.50 లక్షల చొప్పున ధర నిర్ణయించింది. భూకేటాయింపులు చేసినా వారికి సేల్ డీడ్ చేయలేదు. పెట్టుబడులు పెట్టిన తర్వాతే ఆ భూమిని వారికి అప్పగిస్తామని కేబినెట్ భేటీలో స్పష్టంగా తీర్మానించారు. ఇవన్నీ జగన్‌కు తెలియక కాదు. కానీ... రాష్ట్రానికి పరిశ్రమలు రాకుండా చేయడం, ప్రభుత్వంపై బురదజల్లడం లక్ష్యంతోనే ఆయన తప్పుడు ప్రచారం చేస్తున్నారనేది సుస్పష్టం.
నాడు జగన్ చేసిందీ ఇదే...
ప్రస్తుత ప్రభుత్వం ఉర్సాకు భూకేటాయింపులు చేసిన విశాఖలో డేటాసెంటర్ పార్కు ఏర్పాటు చేస్తామన్న అదానీ ఎంటర్‌ప్రైజ్‌సకు 130 ఎకరాలు కేటాయిస్తూ 2021 అక్టోబరులో జగన్ కేబినెట్ తీర్మానించింది. అదానీతోపాటు చాలా కంపెనీలకు ఎకరా కోటి చొప్పున విశాఖ ఐటీ పార్కులో జగన్ హయాంలో భూకేటాయింపులు చేశారు. అప్పుడు సక్రమం అయింది ఇప్పుడు తప్పు ఎలా అవుతుందన్నది ప్రశ్న!
కియా మొదలు.. ఉర్సా వరకు..
అబద్ధాలు, అర్ధసత్యాలని తెలిసీ జగన్, ఆయన రోత పత్రిక తప్పుడు ప్రచారం ఎందుకు చేస్తోందంటారా? దీని వెనుక భారీ కుట్ర ఉందని ప్రభుత్వం అనుమానిస్తోంది. 2014-19 మధ్య కూడా జగన్ ఇలాగే వ్యవహరించారు. అనంతపురంలో కియా పరిశ్రమకు ఇచ్చిన రాయితీలు, భూకేటాయింపులపైనా ఇలాగే దుష్ప్రచారం చేశారు. ప్రస్తుతం... ఉపాధి కల్పనలో, రాష్ట్రానికి ఆదాయాన్ని సమకూర్చడంలోనూ కియా ముందు వరుసలో ఉంది. ఇక... రాజధాని అమరావతిపై వైసీపీ చేసిన దుష్ప్రచారం అంతా ఇంతా కాదు. వరదలు వస్తే మునిగిపోతుందని, రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కున్నారని రాజధానికి నిధులు సమకూరుస్తున్న ప్రపంచ బ్యాంకుకు, ఇతర అంతర్జాతీయ ఆర్థిక సంస్థలకు ఫిర్యాదులు చేశారు. కోర్టుల్లో కేసులు వేశారు. ఇన్‌సైడ్ ట్రేడింగ్ జరిగిందని ఆరోపించారు. అవన్నీ... తప్పుడు ఆరోపణలే అని స్పష్టంగా రుజువైంది. ఇప్పుడూ మళ్లీ అదే పంథాను అనుసరిస్తున్నారు. పెట్టుబడిదారుల విశ్వసనీయతపై సందేహాలు లేవనెత్తడం, వాళ్ల ప్రతిష్ఠను దెబ్బతీయడమనే వ్యూహాన్ని అనుసరిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
Guntur Mayor Election: గుంటూరు మేయర్ ఎన్నిక.. వైసీపీ అభ్యర్థి నామినేషన్
Visakhapatnam Mayor: విశాఖ మేయర్ ఎన్నిక ఏకగ్రీవం
Read latest AP News And Telugu News