Share News

Jagan Helicopter Incident: విండ్‌షీల్డ్‌ దెబ్బతింటే ఎలా వెళ్లారు

ABN , Publish Date - Apr 17 , 2025 | 03:19 AM

జగన్ హెలికాప్టర్ ప్రయాణం వివాదాస్పదంగా మారడంతో కోపైలట్ శ్రేయాజ్ జైన్‌ను పోలీసులు విచారించారు.విండ్షీల్డ్ దెబ్బతినడంపై, షెడ్యూల్ లో తిరుగు ప్రయాణం ఉందా అనే అంశాలపై ప్రశ్నల వర్షం కురిసింది.

Jagan Helicopter Incident: విండ్‌షీల్డ్‌ దెబ్బతింటే ఎలా వెళ్లారు

  • హెలికాప్టర్‌పై దాడి ఎవరు చేశారు?

  • జగన్‌ తిరుగు ప్రయాణం షెడ్యూల్‌లో ఉందా?

  • కో పైలట్‌పై పోలీసుల ప్రశ్నల వర్షం

  • కొన్ని ప్రశ్నలు దాటవేసిన శ్రేయాజ్‌ జైన్‌

  • పైలట్‌ అనిల్‌ గైర్హాజరుపై అనుమానాలు

  • ఇద్దరినీ మళ్లీ విచారణకు పిలిచే అవకాశం

పుట్టపర్తి, ఏప్రిల్‌ 16 (ఆంధ్రజ్యోతి): శ్రీసత్యసాయిజిల్లాలో మాజీ సీఎం జగన్‌ జరిపిన వివాదాస్పద హెలికాప్టర్‌ ప్రయాణంపై విచారణను పోలీసులు మొదలుపెట్టారు. ‘హెలికాప్టర్‌ విండ్‌షీల్డ్‌ దెబ్బతింటే, ఎలా టేకాఫ్‌ చేశారు..? విండ్‌షీల్డ్‌పై ఎవరు, ఎలా దాడి చేశారు..? జగన్‌ను వదిలేసి ఎగరడానికి ఎవరి అనుమతి తీసుకున్నారు..? అంటూ కో-పైలట్‌ శ్రేయాజ్‌ జైన్‌పై ప్రశ్నలవర్షం కురిపించారు. పాపిరెడ్డిపల్లిలో లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు ఈ నెల 8న జగన్‌ జిల్లాకు వచ్చారు. రామగిరి మండలం కుంటిమద్ది సమీపంలోని హెలిప్యాడ్‌లో దిగారు. ఆ రోజు జరిగిన సంఘటనలు వివాదాస్పదం కావడంతో పైలట్‌, కో పైలన్‌లను పోలీసులు విచారణకు పిలిచారు. పైలట్‌ అనిల్‌ కుమార్‌ గైర్హాజరు కాగా, కో పైలట్‌ తన న్యాయవాదితో కలిసి విచారణకు హాజరయ్యారు. చెన్నేకొత్తపల్లిలోని రామగిరి పోలీస్‌ సర్కిల్‌ కార్యాలయంలో ధర్మవరం డీఎస్పీ హేమంత్‌కుమార్‌, రామగిరి సీఐ శ్రీధర్‌... ఆయనను బుధవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2.45 గంటల దాకా విచారించారు. ఆ రోజు జరిగిన సంఘటనలు, జగన్‌ను వదిలేసి హెలికాప్టర్‌ వెనక్కి వెళ్లిపోవడానికి కారణాలను ఆరా తీశారు. విశ్వసనీయ సమాచారం మేరకు...కో పైలట్‌ను పోలీసులు అనేక విషయాలపై ప్రశ్నించి సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేశారు.


అయినా, ఆయన కొన్ని ప్రశ్నలకే స్పందించారు. ‘ఆ రోజు హెలికాప్టర్‌ బెంగళూరులోని ఏ ప్రాంతం నుంచి కుంటిమద్దికి వచ్చింది... తిరిగి వెళ్లేదాకా ఏం జరిగింది... ఎవరి ద్వారా హెలికాప్టర్‌ అద్దెకు తీసుకున్నారు..ఎంత అద్దె చెల్లించారు.... అది ఏ కంపెనీది.. షెడ్యూల్‌లో జగన్‌ తిరుగు ప్రయాణం ఉందా...జగన్‌ను వదిలేసి బెంగళూరుకు వెళ్లిపోయేందుకు ఎవరు అనుమతిచ్చారు..విండ్‌షీల్డ్‌ దెబ్బతినడం నిజమేనా....అలాగైతే మరమ్మతు చేయకుండా గాలిలోకి ఎగిరి ఎలా వెళ్లగలిగింది...వైసీపీ నేతలు, కార్యకర్తలు డోర్‌ లాగారా....ఫైలట్‌ బ్యాగ్‌ను తస్కరించారా...టేకాఫ్‌ చేస్తున్నట్లు జిల్లా పోలీస్‌ యంత్రాంగానికి ఎందుకు సమాచారం ఇవ్వలేదు.. ఇలా పోలీసులు శరపరంపరగా ప్రశ్నలు సంధించారు. అయితే, కో పైలట్‌ కొన్ని ప్రశ్నలకు సమాధానాలను దాటవేశారు. ‘హెలికాప్టర్‌ గోదావత్‌ ఏవియేషన్స్‌ కంపెనీది. బెంగళూరు వైట్‌ఫీల్డ్‌లోని చిప్పర్‌ ఏవియేషన్‌ ప్రైవేట్‌ కంపెనీ ద్వారా అద్దెకు తీసుకున్నారు. అద్దె ఎంతో నాకు తెలియదు. బెంగళూరు-కుంటిమద్దికి, తిరిగి కుంటిమద్ది-బెంగళూరుకు తీసుకెళ్లేలా షెడ్యూల్‌ ఇచ్చారు. హెలిప్యాడ్‌లో హెలికాప్టర్‌ దిగానే జెండాలు పట్టుకుని భారీగా జనం చుట్టుముట్టారు. హెలికాప్టర్‌ను తాకారు. ఆ సమయంలోనే విండ్‌షీల్డ్‌ దెబ్బతింది. హెలికాప్టర్‌కు మినిమం ఎక్యూ్‌పమెంట్‌ లిస్టు (కొన్ని పరికరాలు లేకపోయినా టేకాఫ్‌ తీసుకోవచ్చు. అయితే, ఏ పరికరాలు తప్పనిసరిగా ఉండాలనే లిస్టును పైలట్‌ ధ్రువీకరించాలి) ఉంటే టేకాఫ్‌ చేసుకుని వెళ్లవచ్చు.’’ అని కో పైలట్‌ తెలిపినట్టు తెలిసింది. కాగా, తాను తప్పనిసరి పరిస్థితుల్లో సెలవులో ఉన్నారని, అందుకే విచారణకు రావడం లేదని కోపైలట్‌ ద్వారా పైలట్‌ అనిల్‌ కుమార్‌ పోలీసులకు సమాచారం అందించినట్టు సమాచారం. అయితే, పైలట్‌ గైర్హాజరీ పలు అనుమానాలకు తావిస్తోంది. ఇద్దరు పైలెట్లునూ మరోమారు విచారణకు రావాలని నోటీసులు జారీ చేసే అవకాశం ఉందని పోలీసుశాఖ వర్గాలు తెలిపాయి.

Updated Date - Apr 17 , 2025 | 03:21 AM