Spy Satellite: నింగిలో మన గూఢచారి
ABN , Publish Date - Apr 29 , 2025 | 06:25 AM
పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో 24 గంటల నిఘా కోసం భారత్ ఈవోఎస్-09 గూఢచారి ఉపగ్రహాన్ని జూన్‌లో ప్రయోగించబోతోంది. శ్రీహరికోట నుంచి పీఎస్ఎల్వీ-సీ61 రాకెట్ ద్వారా ఈ ప్రయోగం జరగనుంది.

జూన్‌లో ఈవోఎస్-09 ఉపగ్రహ ప్రయోగం
భారత్-పాక్ సరిహద్దుపై 24 గంటలూ నిఘా
సూళ్లూరుపేట, ఏప్రిల్ 28 (ఆంధ్రజ్యోతి): పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్-పాకిస్థాన్ సరిహద్దుపై నిఘా పెంచాలని భారత్ భావిస్తోంది. దీనికోసం పగలూ, రాత్రీ తేడా లేకుండా 24 గంటలూ.. నిఘా పెట్టే ఓ గూఢచారి ఉపగ్రహాన్ని ప్రయోగించేందుకు ఇస్రో సిద్ధమవుతోంది. దీనికోసం జూన్‌లో అత్యాధునిక ఈవోఎస్-09 ఉపగ్రహాన్ని రోదసిలోకి పంపేందుకు సన్నాహాలు చేస్తోంది. శ్రీహరికోట నుంచి పీఎస్ఎల్వీ-సీ61 రాకెట్ ద్వారా ఈ ఉపగ్రహాన్ని కక్ష్యలోకి పంపనుంది. సీ-బ్యాండ్ సింథటిక్స్ ఎవర్చర్ రాడార్‌ను అమర్చిన ఈవోఎస్-09 ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా అధిక రిజల్యూషన్‌తో కూడిన భూ ఉపరితల చిత్రాలను తీయగలదు. భారత్‌కు ఇప్పటికే అంతరిక్షంలో 50కి పైగా ఉపగ్రహాలు ఉన్నాయి. ఇప్పుడు రాడార్ ఇమేజింగ్ శాటిలైట్ వాటికి జతకలవనుంది. ఇప్పటికే అధునాతన కార్టోశాట్-3 ఉపగ్రహం లోయర్ ఎర్త్ ఆర్బిట్‌లో తిరుగుతూ ఫొటోలు అందిస్తోంది. కానీ ఇది రాత్రి వేళల్లో పనిచేయదు. దీంతో శత్రువులు తమ ఆయుధాలను రాత్రి వేళల్లో తరలించగలుగుతున్నారు. తాజాగా పీఎ్‌సఎల్వీ-సీ61 రాకెట్ ద్వారా ప్రయోగించబోయే హైఎండ్ ఈవోఎస్-09 నుంచి శత్రువులు రాత్రి వేళల్లో కూడా తప్పించుకోలేరు. ఈ ప్రయోగానికి సంబంధించి షార్‌లోని ప్రథమ ప్రయోగ వేదిక వద్ద పీఎ్‌సఎల్వీ-సీ61 రాకెట్ అనుసంధాన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. జూన్ తొలివారంలో ఈ ప్రయోగాన్ని చేపట్టేందుకు ఇస్రో సన్నాహాలు చేస్తోంది.