YSRCP Jagan Mohan Reddy: జగన్ కారు కింద నలిగిన మానవత్వం
ABN , Publish Date - Jun 23 , 2025 | 05:28 AM
మనం ప్రయాణిస్తున్న కారు కింద పొరపాటున కుక్క, కోతిలాంటి జంతువు పడినా విలవిల్లాడిపోతాం! ప్రమాదవశాత్తూ వాహనం మనిషిని తాకితే మరింత అప్రమత్తమవుతాం.

టైరు కింద మనిషి పడినా బేఫికర్
స్పందించని జగన్, ఆయన నేతలు
సింగయ్యను పక్కకు లాగేసి ముందుకు!
తొలుత ఏదో వాహనం అనుకున్న పోలీసులు
అది... జగన్ ఎక్కిన కారే అని నిర్ధారణ
పోలీసుల ఆంక్షలు బేఖాతరు చేసి బలప్రదర్శన
(గుంటూరు - ఆంధ్రజ్యోతి): మనం ప్రయాణిస్తున్న కారు కింద పొరపాటున కుక్క, కోతిలాంటి జంతువు పడినా విలవిల్లాడిపోతాం! ప్రమాదవశాత్తూ వాహనం మనిషిని తాకితే మరింత అప్రమత్తమవుతాం. తక్షణం స్పందించి అంబులెన్స్‌కు ఫోన్ చేయడమో, అంత సమయంలేకపోతే అదే కారులో ఆస్పత్రికి తీసుకెళ్లడమో చేస్తాం. ఇది కారు డ్రైవర్‌దే కాదు, అందులో ప్రయాణిస్తున్న వారి మానవీయ, నైతిక, చట్టపరమైన బాధ్యత! కానీ వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, ఆయన సైన్యానికీ ఇవేవీ పట్టలేదు. తాను ప్రయాణిస్తున్న కారుకింద ఒక మనిషి పడి నలిగిపోయినా ఆయన పట్టించుకోలేదు. కారు నడుపుతున్న డ్రైవరుకు చీమ కుట్టినట్లయినా అనిపించలేదు. అదే కారులో ప్రయాణిస్తున్న ‘ప్రముఖులకు’ ఆ ప్రాణం విలువ తెలియలేదు. జన సమీకరణ వద్దూవద్దూ అని పోలీసులు చెప్పినా వినకుండా,,, సత్తెనపల్లి నియోజకవర్గంలో ఈనెల 18న జగన్ చేసిన బల ప్రదర్శనకు రెండు ప్రాణాలు బలైపోయిన సంగతి తెలిసిందే.
ఇందులో... సింగయ్య అనే వృద్ధుడి ఊపిరి జగన్ ప్రయాణిస్తున్న కారు కిందే పడి ఆగిపోయింది. ఆయన ఆర్తనాదాలు ‘రప్పా రప్పా’ ఉన్మాద నినాదాల హోరులో కలిసిపోయాయి. జగన్‌తోపాటు కారులో ఉన్న వారెవరూ ఆ వృద్ధుడి ప్రాణాలకు విలువ ఇవ్వలేదు. ‘పడిపోయాడు... పడిపోయాడు’ అంటూ కారు చుట్టూఉన్న కొందరు ఆందోళనకు గురైనా, ‘జరగరానిది ఏదో జరిగింది’ అని తెలియకపోయే అవకాశమే లేదు. అయినా... కారులోపల ఉన్నవారూ స్పందించలేదు. టైరుకు అడ్డంపడిన కర్రముక్కనో, రాయినో తీసేసినట్లుగా సింగయ్యను కార్యకర్తలు పక్కకు లాగేశారు. ఆ తర్వాత... జగన్ వాహనం ముందుకు వెళ్లిపోయింది.
సింగయ్య ప్రాణం గాలిలో కలిసిపోయింది. ‘జగన్ కాన్వాయ్‌లోని ఏదో కారు సింగయ్యను గుద్దింది’ అని పోలీసులు తొలుత భావించారు. కానీ... అది స్వయంగా జగన్ ఎక్కిన కారే అని వీడియోలతో సహా నేడు బయటపడింది. జరిగింది ప్రమాదమే కావొచ్చు! కానీ... దీనిపై జగన్, ఆయన నేతాగణం స్పందనారాహిత్యమే విస్తుగొలుపుతోంది. పోలీసులు వందమందిని అనుమతిస్తే వేలమందితో సత్తెనపల్లికి వెళ్లడం ఒక నేరం! నిర్లక్ష్యంగా కారు నడిపి మనిషిని ఢీకొట్టడం ఒక నేరం! ఆ తర్వాతైనా స్పందించకుండా, క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించకుండా వెళ్లిపోవడం మరింత పెద్ద నేరం! తమ కారణంగా ఒక నిండుప్రాణం పోయిందని తెలిసీ, సంఘటన జరిగి రోజులు గడుస్తున్నా స్పందించకపోవడం మరో నేరం!
బుధవారం జగన్ తాడేపల్లి నుంచి సత్తెనపల్లికి భారీ కాన్వాయ్‌తో బయలుదేరిన సంగతి తెలిసిందే. గుంటూరు జిల్లా ఏటుకూరు సమీపంలోని లాల్‌పురం జాతీయ రహదారిపై ఈ ఘోరం జరిగింది. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన సింగయ్య (53) జగన్ వాహనంపై పూలు జల్లేందుకు ఉత్సాహంగా ముందుకు వచ్చారు. అక్కడ జరిగిన తోపులాటలో జగన్ ప్రయాణిస్తున్న కారు కింద పడిపోయారు. సింగయ్య భుజాన్ని, మెడను తొక్కుతూ కారు ముందుకు వెళ్లింది. తీవ్రంగా గాయపడిన సింగయ్యను వైసీపీ నేతలు కనీసం ఆస్పత్రికి తరలించే ప్రయత్నం కూడా చేయలేదు. తీవ్ర గాయాలతో ఆర్తనాదాలు చేస్తున్న సింగయ్యను వైసీపీ కార్యకర్తలు పక్కకులాగేశారు.
ప్రమాదం గురించి సమాచారం అందుకున్న హైవే పెట్రోలింగ్ ఏఎ్‌సఐ రాజశేఖర్ అక్కడికి చేరుకుని 108లో సింగయ్యను జీజీహెచ్‌కు తరలించారు. అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. భార్య లూర్దు మేరీ, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అప్పటికి అందిన సమాచారం ప్రకారం జగన్ కాన్వాయ్‌లోని ఏదో వాహనం గుద్ది సింగయ్య మరణించినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయన భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. శనివారం ఈ ఘటనకు సంబంధించిన కీలక ఆధారాలు బయటపడ్డాయి. సింగయ్యను తొక్కింది జగన్ ప్రయాణిస్తున్న కారే అని స్పష్టమైంది. ఈ నేపథ్యంలో పోలీసులు కారు డ్రైవర్‌తోపాటు అందులో ప్రయాణించిన జగన్, ఇతర వైసీపీ ముఖ్యనేతలపైనా కేసు నమోదు చేశారు.