Police Raid: వైసీపీ నేత ఫ్యాక్టరీలో భారీగా పేలుడు పదార్థాలు
ABN , Publish Date - Apr 20 , 2025 | 06:41 AM
బాపట్ల జిల్లా మార్టూరులో వైసీపీ నేత దాసం హనుమంతరావు గ్రానైట్ ఫ్యాక్టరీ, గోడౌన్‌లలో భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం చేశారు. జిలెటిన్ స్టిక్స్, డిటోనేటర్లు సహా 10 టన్నుల మందుగుండు సామగ్రి పట్టు పడగా, ఇద్దరిపై కేసు నమోదైంది.

డిటోనేటర్లు, జిలెటిన్ స్టిక్స్ స్వాధీనం.. ఇద్దరిపై కేసు
మార్టూరు, ఏప్రిల్ 19 (ఆంధ్రజ్యోతి): బాపట్ల జిల్లాకు చెందిన వైసీపీ నేత దాసం హనుమంతరావుకు చెందిన గ్రానైట్ ఫ్యాక్టరీతో పాటు అతనికి చెందిన గోడౌన్‌లో భారీగా పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శనివారం చేపట్టిన తనిఖీల్లో మార్టూరు మండలం నాగరాజుపల్లి పంచాయతీ పరిధిలో గోడౌన్‌లో మూడు రకాలైన జిలెటిన్ స్టిక్స్, డీఎఫ్, ఓడీలు, ఇతర మందుగుండు సామగ్రి దాదాపుగా 10 టన్నులు, బల్లికురవ మండలం కొణిదెనలోని గ్రానైట్ ఫ్యాక్టరీలో 2,300 ఎలకా్ట్రనిక్ డిటోనేటర్స్ (ఈడీ)లు పోలీసులు గుర్తించినట్లు తెలిసింది. దాసం హనుమంతరావుతో పాటు మరొకరిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.