Vice-Chancellors : విశ్వవిద్యాలయాల ప్రక్షాళన!
ABN , Publish Date - Feb 19 , 2025 | 03:11 AM
యూనివర్సిటీలకు కీలకమైన వైస్ చాన్స్‌లర్ల(వీసీ) నియామకంలో రాజకీయాలకు తావులేకుండా ప్రతిభకు ప్రాధాన్యతనిచ్చింది.

రాజకీయాలకు అతీతంగా వర్సిటీలకు కొత్త వీసీల ఎంపిక
తొమ్మిది వర్సిటీలకు నియామకం పూర్తి
ప్రతిభకు పట్టంకట్టిన కూటమి సర్కార్
జాతీయ విద్యా సంస్థల నుంచి ఇద్దరు
ఢిల్లీ, హైదరాబాద్, ఉస్మానియాలకు చోటు
నియామకాల్లో సామాజిక సమతుల్యం
సుదీర్ఘ కసరత్తు చేసిన మంత్రి లోకేశ్
అమరావతి/విశాఖపట్నం, ఫిబ్రవరి 18(ఆంధ్రజ్యోతి): జగన్ ప్రభుత్వంలో రాజకీయ కేంద్రాలుగా మారిన విశ్వవిద్యాలయాలను గాడిన పెట్టేలా కూటమి ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. యూనివర్సిటీలకు కీలకమైన వైస్ చాన్స్‌లర్ల(వీసీ) నియామకంలో రాజకీయాలకు తావులేకుండా ప్రతిభకు ప్రాధాన్యతనిచ్చింది. రాష్ట్రంలోని 9 యూనివర్సిటీలకు వీసీలను నియమిస్తూ గవర్నర్ అబ్దుల్ నజీర్ మంగళవారం నోటిఫికేషన్ జారీ చేశారు. వారిలో ఇద్దరు జాతీయ విద్యా సంస్థల ప్రొఫెసర్లు ఉండగా, ఢిల్లీ, హైదరాబాద్, ఉస్మానియా యూనివర్సిటీల నుంచి ఒక్కొక్కరు చొప్పున నియమితులయ్యారు. సామాజిక సమతుల్యం పాటిస్తూ తొమ్మిది మందిలో ముగ్గురు బీసీలు, ఒక ఎస్సీ, ఒక ఎస్టీకి ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఇద్దరు కమ్మ, ఒక కాపు, ఒక బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వారు ఉన్నారు. అలాగే ప్రాంతాల మధ్య కూడా సమానత్వం ఉండేలా అన్ని ప్రాంతాలకూ వీసీల నియామకాల్లో ప్రాధాన్యత ఇచ్చింది. గత ప్రభుత్వంలో యూనివర్సిటీలకు వైసీపీ అనుకూల వ్యక్తులను వీసీలుగా నియమించడంతో వర్సిటీల ప్రతిష్ట దెబ్బతింది. ఆంధ్రా, నాగార్జున యూనివర్సిటీలు పూర్తిస్థాయి రాజకీయ కేంద్రాలుగా పనిచేశాయి. దీంతో యూనివర్సిటీలను తిరిగి గాడిలో పెట్టేందుకు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్.. ప్రతిభ ఆధారిత నియామకాలపై దృష్టి పెట్టారు. సామాజిక, ప్రాంతీయ సమతుల్యం పాటిస్తూనే విద్యారంగంలో నిష్ణాతులైన వారిని వీసీలుగా తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. జాతీయ విద్యా సంస్థల స్థాయిలో రాష్ట్ర యూనివర్సిటీలను తీర్చిదిద్దేలా ఈ నియామకాలపై దృష్టిపెట్టారు. ఇప్పటికే ఉన్నత విద్యామండలి చైర్మన్‌గా ఎన్‌ఐటీ వరంగల్ ప్రొఫెసర్‌ను నియమించారు. రాబోయే ఐదేళ్లలో అంతర్జాతీయ ర్యాంకింగ్ టాప్-100లో రాష్ట్ర యూనివర్సిటీలను ఉంచడమే లక్ష్యంగా వీసీల నియామకం చేపట్టారు.
ఇవీ ప్రత్యేకతలు!
‘ఐఐటీ ఖరగ్‌పూర్’లో ప్రొఫెసర్‌గా ఉన్న జీపీ రాజశేఖర్‌ను ఆంధ్రా యూనివర్సిటీకి వీసీగా నియమించారు. విశాఖపట్నానికి చెందిన ఆయన 13 ఏళ్లుగా ఖరగ్‌పూర్ ఐఐటీలో మ్యాథ్స్ ప్రొఫెసర్‌గా ఉన్నారు. 2023లో ‘నేషనల్ మేథమెటీషియన్ ఆఫ్‌ది ఇయర్’గా గుర్తింపు పొందారు. కృత్రిమ మేధ(ఏఐ)పై కూడా ఆయనకు అవగాహన ఉంది.
‘ఎన్‌ఐటీ వరంగల్’లో సివిల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్‌గా ఉన్న సీఎ్‌సఆర్‌కే ప్రసాద్ జేఎన్‌టీయూ కాకినాడకు వీసీగా నియమితులయ్యారు. బాపట్లకు చెందిన ఆయన 17 ఏళ్లుగా అధ్యాపక వృత్తిలో ఉన్నారు. ‘భారత్-అమెరికా’ ఉన్నతవిద్య సంప్రదింపుల్లో పాల్గొన్నారు.
హైదరాబాద్ యూనివర్సిటీలో లైఫ్ సెన్సెస్, బయోటెక్నాలజీ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న ఫణితి ప్రకాశ్‌బాబు.. యోగి వేమన యూనివర్సిటీ వీసీగా నియమితులయ్యారు. ప్రొఫెసర్‌గా 31 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉన్న ఆయన లండన్, చెన్నై, జర్మనీల్లో బయాలజీపై పరిశోధనలు చేశారు. ఆయన స్వస్థలం ఎన్టీఆర్ జిల్లాలోని జగయ్యపేట.
8 ఢిల్లీ టెక్నలాజికల్ యూనివర్సిటీలో అప్లైడ్ ఫిజిక్స్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న అల్లం శ్రీనివాసరావు విక్రమ సింహపురి యూనివర్సిటీ ప్రొఫెసర్‌గా నియమితులయ్యారు. కర్నూలుకు చెందిన ఆయనకు ప్రొఫెసర్‌గా 13 ఏళ్ల అనుభవం ఉంది. 2003, 2004లో పరిశోధనలపై అవార్డులు సాధించారు.
ఉస్మానియా యూనివర్సిటీలో కెమికల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్‌గా ఉన్న వి. వెంకట బసవరావును రాయలసీమ యూనివర్సిటీ వీసీగా నియమించారు. ఐఐటీ ఖరగ్‌పూర్‌లో ఎంటెక్ చేసిన ఆయన అనేక హోదాల్లో పనిచేశారు. మంగళగిరికి చెందిన ఆయన పలు అవార్డులు అందుకున్నారు.
ప్రస్తుతం జేఎన్‌టీయూ-అనంతపురం సంస్థలో ఇన్‌చార్జ్ వీసీగా ఉన్న హెచ్. సుదర్శన్‌రావు అదే యూనివర్సిటీకి వీసీగా నియమితులయ్యారు. ఆళ్లగడ్డకు చెందిన ఆయన ఐఐటీ-ముంబైలో పీహెచ్‌డీ చేశారు. 2008లో ఇంటర్నేషనల్ ఇంజనీర్ అవార్డు సాధించారు.
పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఇన్‌చార్జ్ వీసీగా ఉన్న వి. ఉమ అదే యూనివర్సిటీకి వీసీగా నియామకం అయ్యారు. 23 ఏళ్లుగా అధ్యాపక వృత్తిలో ఉన్న ఉమ తెనాలికి చెందిన వారు.
ఆంధ్రా యూనివర్సిటీలోని ఇంజనీరింగ్ కాలేజీలో మెకానికల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్‌గా ఉన్న కె. రామ్‌జీ.. కృష్ణా యూనివర్సిటీ వీసీగా నియమితులయ్యారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఆయన ఐఐటీ-రూర్కీలో పీహెచ్‌డీ చేశారు. 18 ఏళ్లుగా ప్రొఫెసర్‌గా ఉన్నారు. గతంలో బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీకి వీసీగా పనిచేశారు.
ఆంధ్రా యూనివర్సిటీలో ఆంగ్ల ప్రొఫెసర్‌గా ఉన్న ప్రసన్నశ్రీ ఆదికవి నన్నయ యూనివర్సిటీ వీసీగా నియమితులయ్యా రు. 22 ఏళ్లుగా ప్రొఫెసర్‌గా ఉన్నారు. రాష్ట్రపతి అవార్డు పొందారు. కుపియా, కోయ, పోర్జ, జాతపు, కొండదొర, గడబ, కోలం, గోండి, కోటియా, సవర, కుర్రు, సుగాలి, గిరిజన తెగలకు ‘లిపి’ని రూపొందించారు.