High Court: ఏబీవీ క్వాష్ పిటిషన్‌పై తీర్పు రిజర్వు
ABN , Publish Date - Apr 29 , 2025 | 05:22 AM
నిఘా పరికరాల కొనుగోలు కేసులో తనపై నమోదైన కేసు కొట్టివేయాలని కోరుతూ మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు హైకోర్టులో వేసిన పిటిషన్‌పై వాదనలు పూర్తయ్యాయి. కోర్టు తీర్పు రిజర్వు చేస్తూ, ఏసీబీ కోర్టులో విచారణపై స్టే విధించింది

హైకోర్టులో ముగిసిన వాదనలు.. ఏసీబీ కోర్టు విచారణపై స్టే
అమరావతి, ఏప్రిల్ 28(ఆంధ్రజ్యోతి): నిఘా పరికరాల కొనుగోలు వ్యవహారంలో తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ విశ్రాంత ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఇరువైపుల వాదనలు ముగియడంతో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్.హరినాథ్ తీర్పును రిజర్వు చేస్తున్నట్లు ప్రకటించారు. విజయవాడ ఏసీబీ ప్రత్యేక కోర్టులో విచారణపై స్టే విధిస్తున్నట్లు ప్రకటించారు. భద్రత, నిఘా పరికరాల కొనుగోలుకు సంబంధించి తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ ఏబీ వెంకటేశ్వరరావు హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యం సోమవారం విచారణకు రాగా సీనియర్ న్యాయవాది బి.ఆదినారాయణరావు వాదనలు వినిపించారు. నిఘా పరికరాల కొనుగోలు ప్రక్రియను అప్పటి డీజీపీ ప్రారంభించి, కాంపిటెంట్ అథారిటీ హోదాలో డీజీపీ సాంకేతిక, కొనుగోలు కమిటీలను ఏర్పాటు చేశారన్నారు. డీజీపీ కోరిన మేరకు కమిటీల్లో సభ్యులుగా సీనియర్ అధికారుల పేర్లను పిటిషనర్ సూచించారన్నారు. పరికరాల కొనుగోలు టెండర్ ప్రక్రియలో పిటిషనర్‌కు ఎలాంటి పాత్ర లేదన్నారు.
కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన స్టేట్ ట్రేడింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌టీసీఐఎల్)కు నిఘా పరికరాల కొనుగోలు టెండర్ ప్రక్రియను అప్పగించారన్నారు. పరిపాలన, సాంకేతిక కారణాలతో కొనుగోలు నిర్ణయాన్ని డీజీపీ వెనక్కితీసుకొని టెండర్‌ను రద్దు చేశారన్నారు. కొనుగోలు ప్రక్రియ నిలిచిపోవడంతో సేవలు అందించినందుకుగాను ఎస్‌టీసీఐఎల్ రూ.10 లక్షలు మినహాయించుకుందన్నారు. తర్వాత ఆ సొమ్మును కూడా వెనక్కి ఇచ్చిందన్నారు. అవినీతి నిరోధక చట్టంలోని వివిధ సెక్షన్ల కింద పిటిషనర్‌పై నమోదు చేసిన కేసు చెల్లుబాటు కాదన్నారు. ఆంధ్ర, తెలంగాణ మినహా దేశంలోని ఇతర రాష్ట్రాల్లో పిటిషనర్ కుమారుడికి చెందిన ఆకాశం అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ ఇజ్రాయెల్ సంస్థకు ప్రతినిధిగా వ్యవహరించారన్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో తమకు అనుబంధంగా ఎలాంటి సంస్థలు లేవని ఇజ్రాయెల్ సంస్థ స్పష్టం చేసిందన్నారు. ఈ నేపథ్యంలో కుమారుడికి అనుచిత లబ్ధి చేకూర్చారనే ప్రశ్నే ఉత్పన్నం కాదన్నారు. పిటిషనర్ ఒక్కడినే నిందితుడిగా పేర్కొన్నందున ఇతరులతో కలిసి కుట్రకు పాల్పడ్డారనే ప్రశ్నే ఉత్పన్నం కాదన్నారు. ఈ కేసుకు సెక్షన్ 120బీ వర్తించదన్నారు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకొని కేసు కొట్టివేయాలని వాదనలు వినిపించారు. ఏసీబీ తరఫున స్టాండింగ్ కౌన్సిల్ శీతిరాజు శ్యామ్ సుందర్‌రావు వాదనలు వినిపిస్తూ.. అధికారులు కేసు దర్యాప్తు పూర్తిచేసి చార్జిషీటు దాఖలు చేశారన్నారు. ఏసీబీ కోర్టు చార్జిషీట్‌ను కాగ్నిజెన్స్‌లోకి తీసుకొని పిటిషనర్‌కు సమన్లు ఇచ్చిందన్నారు. పిటిషనర్‌కు అవినీతి నిరోధక చట్టం వర్తిస్తుంద న్నారు. వాదనలు ముగియడంతో న్యాయమూర్తి తీర్పును రిజర్వు చేశారు.
ఇవి కూడా చదవండి
Guntur Mayor Election: గుంటూరు మేయర్ ఎన్నిక.. వైసీపీ అభ్యర్థి నామినేషన్
Visakhapatnam Mayor: విశాఖ మేయర్ ఎన్నిక ఏకగ్రీవం
Read latest AP News And Telugu News