Share News

AP High Court: ఆ కుటుంబాలకు 30 లక్షల పరిహారం

ABN , Publish Date - Apr 28 , 2025 | 04:26 AM

మాన్యువల్‌ స్కావెంజింగ్‌తో మరణించిన కార్మికుల కుటుంబాలకు 30 లక్షల పరిహారం చెల్లించాలని హైకోర్టు ఆదేశించింది. 1993 నుండి మరణించిన కార్మికుల వివరాలు సేకరించి, బాధిత కుటుంబాలను పునరావాసం కల్పించాలని సూచించింది

AP High Court: ఆ కుటుంబాలకు 30 లక్షల పరిహారం

పూర్తి పునరావాసం కల్పించండి.. సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించాలి

  • ‘మాన్యువల్‌ స్కావెంజింగ్‌’ మృతుల విషయంలో హైకోర్టు కీలక ఉత్తర్వులు

  • 1993 నుంచి మరణించిన కార్మికుల వివరాలు సేకరించాలని ప్రభుత్వానికి ఆదేశం

అమరావతి, ఏప్రిల్‌ 27(ఆంధ్రజ్యోతి): మాన్యువల్‌ స్కావెంజింగ్‌తో పాటు మురుగు డ్రెయిన్లు శుభ్రం చేస్తూ మరణించిన పారిశుధ్య కార్మికుల కుటుంబాలకు పరిహారం, పునరావాసంపై హైకోర్టు కీలక ఉత్తర్వులిచ్చింది. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా బాధిత కుటుంబాలకు రూ.30 లక్షల పరిహారంతో పాటు పూర్తి పునరావాసం కల్పించాలని స్పష్టం చేసింది. పునరావాసంలో భాగంగా బాధిత కుటుంబసభ్యుడికి ఉద్యోగ భద్రత, పిల్లలకు విద్యా సదుపాయాలు, నైపుణ్య శిక్షణ కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రస్తుత కేసులో మృతుడు మాణిక్యాలరావు విజయవాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో కాంట్రాక్ట్‌ ఉద్యోగిగా పనిచేసేవాడని, మ్యాన్‌హోల్‌ శుభ్రం చేస్తుండగా ప్రమాదవశాత్తూ అందులో పడి మృతి చెందాడని గుర్తు చేసింది. ఈ ఘటనను కార్పొరేషన్‌ ప్రమాదవశాత్తుగా జరిగిందని పేర్కొంటూ రూ.10 లక్షల పరిహారం చెల్లించిందని, అయితే సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా మిగతా రూ.20 లక్షలు ఒక నెలలో మాణిక్యాలరావు భార్యకు చెల్లించాలని ఆదేశించింది. బాధితుడి భార్యకు ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగం కల్పించినట్లు కార్పొరేషన్‌ చెప్పిందని, సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఆమెకు ఉద్యోగ భద్రత ఉన్న కొలువు ఇవ్వడంతో పాటు పూర్తి పునరావాసం కల్పించాలని సీఎ్‌సకు స్పష్టం చేసింది. రెండు నెలల్లో తగిన ఉత్తర్వులు జారీ చేయాలని ఆదేశించింది.


ఒక్క కుటుంబానికే పరిమితం చేయొద్దు

రూ.30 లక్షల పరిహారం చెల్లింపు ఒక్క మాణిక్యాలరావు కుటుంబానికే పరిమితం చేయకుండా మురుగు డ్రెయిన్లు శుభ్రం చేస్తూ ప్రాణాలు కోల్పోయిన వారందరి కుటుంబాలకు చెల్లించాల్సిన అవసరం ఉందని హైకోర్టు పేర్కొంది. 1993 నుండి ఇప్పటివరకు మాన్యువల్‌ స్కావెంజింగ్‌ చేస్తూ మరణించిన కార్మికుల వివరాలను సంబంధిత కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, స్థానిక సంస్థలు, కార్మిక సంఘాల నుండి సేకరించాలని పురపాలక శాఖ కమిషనర్‌ను ఆదేశించింది. మాన్యువెల్‌ స్కావెంజింగ్‌ మరణాలకు బాధ్యులైన అధికారులను గుర్తించి వారి సర్వీసు రికార్డులో నమోదు చేసి, ప్రమోషన్‌ అర్హత కోల్పోయేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. కాంట్రాక్ట్‌ విధానంలో పనిచేస్తూ మరణించిన ఉద్యోగుల విషయంలో సంబంధిత కాంట్రాక్టర్‌ను గుర్తించి, వారి నుంచే పరిహారం వసూలు చేయాలని పేర్కొంది. ఈ కేసులో ఇతర అంశాలపై లోతైన విచారణ జరిపేందుకు తదుపరి విచారణను జూలై 16కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌, జస్టిస్‌ చీమలపాటి రవి ధర్మాసనం ఇటీవల ఉత్తర్వులు జారీచేసింది.


నిబంధనలకు విరుద్ధంగా అధికారులు..!

మాన్యువల్‌ స్కావెంజర్ల నియామక నిషేధం, పునరావాస చట్టం-2013 నిబంధనలకు విరుద్ధంగా విజయవాడ కార్పొరేషన్‌ పరిధిలో ప్రత్యక్షంగా, పరోక్షంగా మాన్యువల్‌ స్కావెంజింగ్‌ అనుసరిస్తున్నారని పేర్కొంటూ విశ్రాంత ఉద్యోగి టి.దాలయ్య హైకోర్టులో పిల్‌ వేశారు. పిటిషనర్‌ తరఫు న్యాయవాది పి.రవితేజ వాదనలు వినిపిస్తూ... విజయవాడ కార్పొరేషన్‌ పరిధిలో 250 మంది మాన్యువల్‌ స్కావెంజర్లుగా పనిచేస్తున్నారని తెలిపారు. మ్యాన్‌హోల్‌ శుభ్రం చేస్తూ మాణిక్యాలరావు మరణించినట్లు 2023 సెప్టెంబరు 8న పత్రికల్లో కథనం వచ్చిందని, అయితే 2022 ఏప్రిల్‌ 18న విజయవాడ లెమన్‌ ట్రీ హోటల్‌ సమీపంలో 20 మంది పారిశుధ్య కార్మికులు మ్యాన్యువల్‌ స్కావెంజింగ్‌ చేస్తున్నారని, ఫోటోలతో సీఎస్‌కు ఫిర్యాదు చేసినప్పటికీ.. అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. విజయవాడ కార్పొరేషన్‌ తరఫున స్టాండింగ్‌ కౌన్సిల్‌ వాదనలు వినిపిస్తూ... కార్పొరేషన్ల పరిధిలో మ్యాన్యువల్‌ స్కావెంజింగ్‌ అమలు చేయడం లేదని, యంత్రాల ద్వారానే మ్యాన్‌హోల్స్‌, మురుగు డ్రెయిన్లు శుభ్రం చేస్తున్నారని పేర్కొన్నారు. వరద డ్రెయిన్‌ శుభ్రం చేస్తుండగా మాణిక్యాలరావు ప్రమాదవశాత్తూ మ్యాన్‌హోల్‌లో పడి మృతిచెందాడని నివేదించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

Visakhapatnam: యాప్‌లతో ఆర్థిక నేరాలకు పాల్పడుతోన్న ముఠా గుట్టు రట్టు

AP Police: పోలీసులను చూసి.. ఆ దొంగ ఏం చేశాడంటే..

Rains: ఏపీలో భారీ వర్షాలు.. నీట మునిగిన వరి ధాన్యం

Simhachalam: స్వామి చందనోత్సవం.. సమీక్షించిన హోం మంత్రి

TDP Supporter: రెచ్చిపోయిన వైసీపీ నేతలు.. టీడీపీ కార్యకర్తకు కత్తిపోట్లు

For AndhraPradesh News And Telugu News

Updated Date - Apr 28 , 2025 | 04:26 AM