Share News

Srisailam Flood: కృష్ణమ్మ పరవళ్లు

ABN , Publish Date - Jul 29 , 2025 | 05:46 AM

ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద వచ్చి చేరుతుండటంతో శ్రీశైలం డ్యాం కళకళలాడుతోంది.

Srisailam Flood: కృష్ణమ్మ పరవళ్లు

శ్రీశైలానికి భారీగా వరద.. నాలుగు గేట్లు ఎత్తివేత

  • నిండు కుండలా నాగార్జునసాగర్‌

  • నేడు గేట్లెత్తి పులిచింతలకు నీటి విడుదల

  • గోదావరికి వరద తగ్గుముఖం

  • సముద్రంలోకి 5,85,246 క్యూసెక్కుల విడుదల

(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌): ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద వచ్చి చేరుతుండటంతో శ్రీశైలం డ్యాం కళకళలాడుతోంది. దీంతో నాలుగు గేట్లను 10 అడుగుల మేర ఎత్తి దిగువకు 1,08,260 క్యూసెక్కులు, కుడి, ఎడమ గట్టు జల విద్యుత్‌ ఉత్పాదన నిమిత్తం మరో 66,896 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు. అలాగే, తెలంగాణలోని కల్వకుర్తికి 16వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల నుంచి 1,48,279, సుంకేసుల నుంచి 94,445 క్యూసెక్కుల వరద శ్రీశైలం డ్యాంలోకి వచ్చి చేరుతోంది. డ్యాం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 882.80 అడుగులకు చేరింది. నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 203.4290 టీఎంసీల నీరు నిల్వ ఉంది. శ్రావణ మాసం ప్రారంభం కావడంతో శ్రీశైలానికి భక్తుల తాకిడి ఎక్కువైంది. జలాశయం వద్ద సందర్శకుల తాకిడి పెరిగింది. నాగార్జున సాగర్‌ జలాశయం నిండు కుండలా దర్శనమిస్తోంది. డ్యాం పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతం 585 అడుగులకు చేరుకుంది. నీటి నిల్వ సామర్థ్యం 312.04 టీఎంసీలకు గాను ప్రస్తుతం 297 టీఎంసీల నీరు నిల్వ ఉంది. సాగర్‌ డ్యాంలోకి 1,47,195 కూసెక్కుల వరద వస్తోంది. కుడి, ఎడమ కాలువలతోపాటు విద్యుదుత్పత్తికి 42,913 కూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జవహర్‌ కుడికాలువకు నీటి విడుదలను 500 కూసెక్కుల నుంచి 5000 కూసెక్కులకు పెంచినట్టు జలవనరులశాఖ ఎస్‌ఈ కృష్ణమోహన్‌ తెలిపారు. కుడి కాలవ పరిధిలో సాగు, తాగు అవసరాలకు 132 టీఎంసీల నీటిని కేటాయించారు. మరో 24 టీఎంసీలు కేటాయించాలని కోరుతూ జలవనరుల శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. జూలైలోనే పుష్కలంగా సాగునీరు సరఫరా చేయడం 18 ఏళ్లలో ఇదే తొలిసారి. దీంతో పంటల సాగు ఊపందుకుంది. సాగర్‌ నుంచి విద్యుత్‌ ఉత్పత్తి ద్వారా పులిచింతల జలాశయానికి 25 వేల కూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. పులిచింతల డ్యాం గరిష్ఠ నీటిమట్టం 175 అడుగులు కాగా ప్రస్తుతం 160.3 అడుగులకు చేరింది. నీటి నిల్వ సామర్థం 45.77 టీఎంసీలకు గాను ప్రస్తుతం 25.9 టీఎంసీల నీరు చేరింది. మంగళవారం సాగర్‌ గేట్లు ఎత్తనుండటంతో మరో మూడు రోజుల్లో పులిచింతల డ్యాం కూడా నిండుతుందని జలవనరుల శాఖ అధికారుల అంచనా. ఈ నెలలోనే పులిచింతల గేట్లు కూడా తెరచుకోనున్నాయి.


hjkl.jpg

గోదావరిలో స్వల్పంగా తగ్గిన నీటిమట్టం

గోదావరిలో వరద ఉధృతి క్రమంగా తగ్గుతోంది. ఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్టు ఎగువన సోమవారం నీటిమట్టం స్వల్పంగా తగ్గింది. ఉప నదులు శబరి, సీలేరు, మంజీర, ప్రవర, పర్ణ, ఇంద్రావతి నదుల నుంచి అదనంగా వస్తున్న 6,42,370 క్యూసెక్కుల వరదను స్పిల్‌వే నుంచి దిగువకు విడుదల చేస్తున్నారు. స్పిల్‌వే ఎగువన 30.900 మీటర్లు, దిగువన 21.890 మీటర్లు నమోదైనట్టు అధికారులు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం వద్ద నీటి మట్టం 10.90 అడుగులు ఉంది. కాటన్‌ బ్యారేజ్‌ నుంచి సముద్రంలోకి 5,85,246 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు.

dghmj.jpg

గోదారిలో వేటకు వెళ్లి మత్స్యకారుడి మృతి

గోదావరిలో చేపల వేటకు వెళ్లి మత్స్యకారుడు ప్రాణాలు కోల్పోయారు. రాజమహేంద్రవరం జాలరిపేటకు చెందిన సవదాల సత్యారావు(45) సోమవారం తెల్లవారుజామున కాటన్‌ బ్యారేజ్‌ దిగువనున్న పాత ఆనకట్ట స్కవర్‌ స్లూయిజ్‌ మీదుగా నడుస్తూ ప్రమాదవశాత్తూ స్కవర్‌ స్లూయిజ్‌ గేట్లు ఉండే రాతి కట్టడంలోకి పడిపోయారు. వరద ఉధృతిలో పైకి రాలేక ప్రాణాలు కోల్పోయారు.

Updated Date - Jul 29 , 2025 | 05:46 AM